academic experts
-
అకడమిక్ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ఎంతో తేడా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ కొలువుల జాతర సాగుతోంది. ప్రభుత్వం దాదాపు 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు మొదలుకొని.. డిగ్రీ, ఆపై చదువుకున్న వారిలో మెజారిటీ నిరుద్యోగుల దృష్టి ఈ ఉద్యోగాలపైనే ఉంది. సహజంగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కసరత్తు ప్రారంభించడం పరిపాటిగా కనిపిస్తుంది. దరఖాస్తు అనంతరం పోటీకి సన్నద్ధమై.. పరీక్ష తేదీ నాటికి సిద్ధంగా ఉంటే సరిపోతుంది. ఆమేరకు నియామక సంస్థలు సైతం సమయాన్ని ఇస్తాయి. అయితే ఆ వ్యవధిలో ప్రిపేర్ కావడమంటే అకడమిక్ పరీక్షలకు సిద్ధమైనట్లు కాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.ముక్తేశ్వర్రావు సూచిస్తున్నారు. అకడమిక్ పరీక్షలకు కేవలం విషయాన్ని చదివి రాస్తే సరిపోతుందని, కానీ పోటీ పరీక్షల్లో మాత్రం ప్రతి విషయాన్ని లోతుగా చదివి, ఆకళింపు చేసుకుంటేనే విజయం సాధిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఆయన ‘సాక్షి’తో పలు అంశాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... సివిల్ సర్వెంట్‌కు... సివిల్ సర్వెంట్ అంటే కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉద్యోగం. ఇక రాష్ట్రస్థాయిలో గ్రూప్–1 ఉద్యోగం ఉత్తమమైంది. వీటికి ఎంతో విశిష్టత ఉంటుంది. అధికారం, చట్టం, నిధులు, స్వీయ నిర్ణయానికి ప్రాధాన్యత ఉండటంతో సమాజానికి మేలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యవస్థలో మార్పులు తేవాలంటే ఇలాంటి ఉద్యోగాలతో సాధ్యమవుతుంది. అంతటి ఉన్నత ఉద్యోగం పొందాలంటే ఎంతో సాధన అవసరం. స్వీయ దృక్పథం ఉండాలి... ఒక అంశాన్ని చదివినప్పుడు దానిపై స్వీయ దృక్పథం ఉండాలి. మనకంటూ ఒక వ్యూ పాయింట్ ఉంటేనే దానిపై పరిశీలన చేయగలం. అలా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలి, లోతుగా అధ్యయనం చేయాలి. అప్పుడే ఆ అంశంపై మనకు పట్టు పెరుగుతుంది. ఇందుకు ఎక్కువ పుస్తకాలు చదవాలి. ఆ రోజుల్లో నేను రోజుకు కనీసం పది నుంచి పన్నెండు సంపాదకీయాలు చదివే వాడిని. శ్రద్ధతో ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. వ్యక్తీకరణ కీలకం... సివిల్స్, గ్రూప్స్‌లో రాత పరీక్షలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ పరీక్షలకు వ్యక్తీకరణ అనేది కీలకం. ఒక అంశం చదివిన తర్వాత దాన్ని అర్థవంతంగా వ్యక్తీకరించాలి. అందుకు సరైన భాష, పదప్రయోగం వాడాలి. ఏ సందర్భంలో ఎలాంటి పదాలు వాడాలనే అవగాహన ఉంటేనే వ్యక్తీకరణ సులభమవుతుంది. విషయ పరిజ్ఞానంతోపాటు సమాజం పట్ల అవగాహన ఉండాలి. అందుకోసం సమాజాన్ని చదవాలి. వార్తాపత్రికలతోపాటు సామాజిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలి. ప్రతి అంశాన్ని లోతుగా చదవడం నేర్చుకుంటే దానిపై అవగాహన పెరుగుతుంది. వీలుంటే నిపుణులతో ఆయా అంశాలపై చర్చిస్తే మంచి ఫలితం ఉంటుంది. తెలుగు అకాడమీ పుస్తకాలు బాగు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే మంచి ఫలితం ఉంటుంది. జాతీయ అంశాలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాలున్నాయి. పోటీ పరీక్షల్లో విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. అది మనకు నచి్చన భాషలో సన్నద్ధం కావొచ్చు. మాతృభాషలో అయితే తక్కువ వ్యవధిలో ఎక్కువ పుస్తకాలు చదవడంతోపాటు సిలబస్ పూర్తిచేసే వీలుంటుంది. ఆ తర్వాత అవసరం ఉన్న భాషలోకి దాన్ని వినియోగించుకోవాలి. బహుముఖకోణం... ఒక అంశాన్ని మనం పరిశీలించే తీరును బట్టి అవగాహనకు వస్తాం. అలా ప్రతి అంశానికి బహుముఖ కోణాలుంటాయి. నేను ఒకసారి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న సమయంలో తీవ్ర కరువు పరిస్థితులు వచ్చాయి. అప్పుడు వికారాబాద్ ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లాను. అక్కడి మెజార్టీ మహిళలు తాగునీటి సౌకర్యం కలి్పంచాలని కోరగా... ఇతర పనులు చేసుకునే పురుషులు మాత్రం మంచి రోడ్డు వేయాలని అడిగారు. కరువు పరిస్థితుల్లో కూడా ఒక్కోక్కరి డిమాండ్ ఒక్కోలా ఉంది. అంటే మహిళలు ఇంటి పనులు చూసుకుంటారు కాబట్టి తాగునీరు అడిగితే, పనులు చేసుకునే వారు మెరుగైన రవాణా కోసం రోడ్లు అడిగారు. ఇలా ఒక్కో అంశానికి అనేక కోణాలు ఉంటాయి. అలా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. -
సెలవుల్లోనూ ‘స్టడీ’గా.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష క్లాసులతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయని భావిస్తున్న సమయంలో, ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు, సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత వరకు పాఠాల పునఃశ్చరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఇవి సర్వ సాధారణమే అయినప్పటికీ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థి తుల్లో ఇన్ని రోజుల సెలవులపై తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కన్పిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కరోనా థర్డ్‌వేవ్‌తో స్కూళ్లు మూతపడుతున్నాయి. దీంతో సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో యథావిధిగా స్కూళ్లు నడుస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. గడచిన రెండేళ్ళుగా కరోనా నేపథ్యంలో విద్యా సంస్థ లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా విద్యా ర్థులు పెద్ద మొత్తంలో లెర్నింగ్ లాసెస్ (అభ్యసన నష్టాలు) ఎదుర్కొంటున్నారు. 41 శాతం మందిలో రాత నైపు ణ్యం, 34 మందిలో చదివే సామర్థ్యం, 51 శాతానికి పైగా ఇంగ్లీష్ భాషపై పట్టు పోయిందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ స్కూళ్లు మూతపడితే విద్యార్థుల పరిస్థితి ఏమి టనే ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చదువుపై ప్రత్యేకంగా దృష్టి సారించా ల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరి ప్రణాళిక వారిది? ♦సెలవుల్లో విద్యార్థి చదువు స్పృహ నుంచి పక్క దారి పట్టకుండా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో సంక్రాంతిని ఉమ్మడిగా ఆస్వాదించే అవకాశం కూడా లేదు కాబట్టి, విద్యార్థులు చదువుపైనే దృష్టి కేంద్రీకరించేలా చూడాలని భావిస్తున్నాయి. ♦ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థులను మళ్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్‌కు కనెక్ట్ చేసే (ఆన్లైన్ పాఠాలు) ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి వంటి జిల్లాల్లోని కొన్ని ప్రైవేటు స్కూళ్ళు ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి. ♦ఇప్పటివరకు జరిగిన పాఠాల్లో విద్యార్థులు ఆసక్తిగా వినలేదని భావించే సబ్జెక్టులపై ప్రత్యేక క్లాసులు (పునఃశ్చరణ) నిర్వహించాలని నిర్ణయించినట్టు కొన్ని స్కూళ్ళ నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా ప్రతిరోజూ విద్యార్థులకు క్విజ్, పజిల్స్, జనరల్ నాలెడ్జ్, పాఠ్యాంశాల్లోంచే సంక్షిప్త ప్రశ్నలు అడిగేలా ప్లాన్ చేసినట్టు ప్రైవేటు విద్యా సంస్థలు కొన్ని తెలిపాయి. ♦ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను త్రీడీ యానిమేషన్‌తో అందించేందుకు ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సైన్స్ సబ్జెక్టులో ఇప్పటివరకు చెప్పిన ఖగోళ, మొక్కలు, మానవ అవయవ నిర్మాణం తదితర అంశాలు త్రీడీ ద్వారా అర్థమయ్యేలా ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు వివరించాలని భావిస్తున్నారు. ♦ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెలవు దినాల్లో ప్రత్యేక హోంవర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడు రవికాంత్ తెలిపారు. ఇప్పటికే ఎస్ఏ–1 పరీక్ష పూర్తి చేశాం. కాబట్టి పిల్లలకు పరీక్షల భయం లేదు. కాకపోతే విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవ్వడం, ఇప్పుడిప్పుడే సిలబస్ ముందుకెళ్ళడం జరుగుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. వాటిని మరిచి పోకుండా ఉండేందుకు ప్రణాళిక బద్ధంగా హోంవర్క్ ఇస్తున్నట్టు చెబుతున్నారు. విద్యార్థుల మూడ్‌కనుగుణంగా బోధన సెలవుల్లో విద్యార్థులు సాధారణంగా మానసికోల్లాసాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు మళ్లీ చదువు, పాఠాలంటే విసుగుకరంగా భావించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఆసక్తి కలిగించే రీతిలో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. దీనికోసం మేం డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను వాడుతున్నాం. క్విజ్, పజిల్స్‌తో పాటు సిలబస్‌లోని పాఠాలు మరిచిపోకుండా ప్రాక్టికల్‌గా త్రీడీ యానిమేషన్‌తో అందించేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేశాం. సెలవుల్లో విద్యార్థి మేథోశక్తికి పదును పెట్టకపోతే దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. – ఆర్ పార్వతీ రెడ్డి, హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం బడి మరిచిపోకుండా హోం వర్క్ సెలవుల్లోనూ విద్యార్థి బడిని, చెప్పిన పాఠాన్ని మరిచిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్కూల్ నుంచైతే కొంత హోం వర్క్ ఇస్తున్నాం. దీన్ని ఫాలో అయితే ఫైనల్ పరీక్షల్లో విద్యార్థి చురుకుదనం పెరుగుతుంది. ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. రోజూ కొంత సేపైనా పుస్తకాలు పఠించేలా ప్రోత్సహించాలి. – పరాంకుశం రాజా భానుప్రకాశ్, హెచ్ఎం, ఎల్ అండ్ ఎం ప్రభుత్వ పాఠశాల, కరీంనగర్ -
ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం!
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ స్తంభించిపోయాయి. పరీక్షలు, ఇతరత్రా కార్యక్రమాలు నిలిచిపోయాయి. వాటిని నిర్వహించడంతోపాటు వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహణను ముగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యూజీసీ)కు పలు సిపార్సులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరాన్ని 2020 ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలని సూచించింది. అలాగే, సెమిస్టర్ల వారీగా పరీక్షల తేదీలను కూడా కమిటీ వివరించింది. అంతేకాదు.. వర్సిటీలు వారానికి 6 రోజులు పనిదినాలుగా పెట్టుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఆగిపోయిన ప్రాజెక్టు వర్కు డిజర్టేషన్, ఇంటర్న్‌షిప్, ఈ ల్యాబ్స్, సిలబస్ పూర్తి, ఇంటర్నల్ అసెస్మెంటు, అసైన్మెంట్లు, ప్లేస్‌మెంటు డ్రైవ్ కార్యక్రమాలను మే 16 నుంచి మే 31లోపు పూర్తిచేయాలి. పరీక్షల షెడ్యూల్ ఇలా ఉండాలి.. ► సంవత్సరాంత పరీక్షలు జూలై 1–15 వరకు నిర్వహించాలి. ► పరీక్షల నిర్వహణలో వర్సిటీలు, కాలేజీలు ప్రత్యామ్నాయ, సులభ మార్గాలను ఎంచుకోవాలి. ► యూజీసీ నిర్దేశించిన సీబీసీఎస్ విధానంలో తక్కువ సమయంలో పూర్తిచేసేలా చూడాలి. ► ఓఎమ్మార్/ఎంసీక్యూ ఆధారిత పరీక్షలు, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్, ఓపెన్ చాయిస్ అసైన్మెంటు వంటివి అనుసరించాలి. ► భౌతిక దూరాన్ని పాటిస్తూ బహుళ షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించాలి. ► మిడ్ సెమిస్టర్ తదితర ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ మార్కులకు 50 శాతం, తక్కిన 50 శాతం మార్కులను అంతకుముందు విద్యార్థి పనితీరుకు వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకోవాలి. ► యూజీ, పీజీ కోర్సుల సెమిస్టర్/ఇయర్లీ పరీక్షలను ఆయా వర్సిటీలు లాక్డౌన్ తొలగింపు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవాలి. ► ల్యాబ్ ప్రాజెక్టులకు బదులు సాఫ్ట్వేర్ ఆధారిత ప్రాజెక్టులను ఇవ్వాలి. స్కైప్ తదితర విధానాల్లో వైవా నిర్వహించాలి. ► రాష్ట్ర, జాతీయస్థాయి కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ఆయా వర్సిటీలు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవచ్చు. ► వర్సిటీలు పీజీ, యూజీ కోర్సుల్లోకి 2020–21 ప్రవేశాలను ఆగస్టు 31లోపు నిర్వహించుకోవచ్చు. సెప్టెంబర్ 30 నాటికి ధ్రువపత్రాల పరిశీలన జరగాలి. ప్రైవేటు స్కూళ్ల వివరాలకు ప్రత్యేక పోర్టల్ ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవలే ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఇందులో ఆయా స్కూళ్లు తమ సంస్థల్లో పనిచేస్తున్న వారి సమాచారం మొత్తాన్ని అందించాలి. పాఠశాలల అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పటికే అమలవుతోంది. అందులో ఆయా స్కూళ్ల భవనాలు, తరగతి గదులు, అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్, మున్సిపల్ తదితర వివిధ విభాగాల అనుమతులు, నిరభ్యంతర ధృవపత్రాలు సమర్పించేలా నిబంధనలు ఉన్నాయి. విద్యార్థులు, వారి ఫీజులు, సదుపాయాలు వంటి నిబంధనలూ ఉన్నాయి. టీచర్లకు సంబంధించి కూడా కొన్ని నియమాలున్నా వాటి అమలు అంతంతే. ఇక విద్యార్థుల ఫీజుల నుంచి టీచర్లకు ఇచ్చే జీతాలు, సదుపాయాల కల్పన ఇలా అన్నీ వాస్తవ విరుద్ధమైన రీతిలోనే ఉంటున్నాయి. అలాగే.. ► కొన్ని కార్పొరేట్ స్కూళ్లు అయితే అనుమతుల్లేకుండానే నడిపేస్తున్నాయి. ► కొన్ని ఒక అడ్రసులో అనుమతులు తీసుకుంటూ వేరేచోట ఎక్కడో నిర్వహిస్తున్నాయి. ► ఆయా టీచర్ల అర్హతలు, వారికిస్తున్న వేతనాలు, ఇతర సదుపాయాల విషయంలో స్కూళ్ల యాజమాన్యాలు ఇస్తున్న సమాచారం వేరు.. వాస్తవంగా వేరుగా ఉంటోంది. ► ఇవి విద్యాశాఖలోని అధికారులందరికీ తెలుసు. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడంవల్ల ఈ తంతు దశాబ్దాల తరబడి సాగుతోంది. ► కొన్ని కార్పొరేట్ స్కూళ్లు గత ప్రభుత్వ పెద్దల బినామీవిగా ఉండడం, స్కూళ్ల అధిపతులే మంత్రులు కావడంతో అధికారులు కూడా ఏమీచేయలేని స్థితి. ► ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాల, ఉన్నత విద్యారంగాలు రెండింటినీ సమూలంగా ప్రక్షాళన చేసి ప్రమాణాలు పెంచే దిశగా అనేక చర్యలు చేపట్టింది. ► ఇందులో భాగంగా ఇప్పటికే ఈ రెండింటికీ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు చైర్మన్లుగా చట్టబద్ధమైన కమిషన్లను ఏర్పాటుచేసింది. ► అంతేకాక.. పాఠశాల విద్యాశాఖ ఆయా స్కూళ్లలోని పరిస్థితులపై వాస్తవిక, సమగ్ర సమాచారాన్ని సేకరించాలని తలపెట్టింది. ఇందులో భాగంగా.. ► ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు సంబంధించి ప్రత్యేకంగా ‘ప్రైవేటు టీచర్స్ పర్టిక్యులర్స్’ పేరుతో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన వెబ్సైట్లో కొన్ని వివరాలు అప్లోడ్ చేయిస్తోంది. ► ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వినతి మేరకు మే 5వ తేదీ గడువు పొడిగించి ఆ తేదీలోగా అందరూ తమ సంస్థల్లో పనిచేస్తున్న వారి సమాచారాన్ని పొందుపర్చాలని ఆదేశించింది. టీచర్లకు సంబంధించి అనేక అంశాలు దీనిలో ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లు ఇవ్వాల్సిన వివరాలు ► జిల్లా కోడ్, స్కూల్ పేరు, జిల్లా పేరు, మండలం, గ్రామం, స్కూల్ కేటగిరి. టీచర్లు ఇవ్వాల్సిన ప్రాథమిక సమాచారం ► టీచర్ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జెండర్, పాన్‌కార్డు నెం, ఆధార్ నెం, మొబైల్ నెం, కమ్యూనిటీ, నెల జీతం, నెలవారీ టాక్స్, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్. ► ఇక టీచర్ల అర్హతలకు సంబంధించి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ తదితరాలను పొందుపర్చాలి. ఆయా కోర్సులు పాసైన తేదీలు, వాటిని ఏ స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, సంస్థల్లో చదివారో కూడా స్పష్టంగా తెలియజేయాలి. వీటితో పాటు టీచర్లు ఎక్కడ నివసిస్తున్నారన్న అంశాలను పొందుపర్చాలి. -
యూట్యూబ్‌లో కోమల్
*ఇలాంటి సినిమాలు ప్రతి పాఠశాలలోనూ ప్రదర్శించాల్సి ఉందంటున్న విద్యారంగ నిపుణులు *చిన్నారులపై లైంగిక వేధింపులపై చైతన్యం పరుస్తూ ‘చైల్డ్‌లైన్’ యానిమేటెడ్ సినిమా సాక్షి, బెంగళూరు : లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించాలంటే ముందుగా పిల్లలకు తమను దగ్గరకు తీసుకుంటున్న వారి మనసులోని ఆలోచనలు పసిగట్టేలా సిద్ధం చేయాలి. ఇదే అంశాన్ని ఇతివృత్తగా చేసుకొని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని నోడల్ ఏజన్సీ చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్ ‘కోమల్’ పేరిట ఓ యానిమేషన్ చిత్రాన్ని రూపొందిం చింది. పది నిమిషాల నిడివి గల ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించబడింది. ఈ చిత్రంలో కోమల్ అనే చిన్నారి తన ఎదురింటిలోని వ్యక్తి కారణంగా ఎదుర్కొన్న లైంగిక వేధింపులు అనంతరం ఆ చిన్నారిలో వచ్చిన మార్పులు వంటి అంశాలతో పాటు ఈ సమయంలో ‘చైల్డ్‌లైన్’ కౌన్సిలర్ల ద్వారా ఆ చిన్నారి ‘సేఫ్ టచ్’, ‘అన్ సేఫ్ టచ్’ వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవడం వంటి సన్నివేశాలను చూడవచ్చు. ఇటీవలే యూ ట్యూబ్‌లోకి అప్లోడ్ అయిన ఈ యానిమేషన్ సినిమా ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్‌ను మూడు లక్షల 12వేల మంది చూడగా, హిందీ వర్షన్‌ను 11వేల మంది వీక్షించారు. అంతేకాదు ఈ సినిమాను చూసిన వారంతా చైల్డ్‌లైన్ సంస్థ చేసిన ఈ ప్రయత్నానికి ప్రశంసల వర్షాన్నే కురిపించేస్తున్నారు. ఈ చిత్రాన్ని మీరు చూడాలనుకుంటే గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి "komala film on child sexual abuse'అని టైప్ చేస్తే సరి, యూట్యూబ్‌లో ఉన్న ఈ యానిమేషన్ సినిమా మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. అన్ని పాఠశాలల్లోనూ ఈ తరహా సినిమాలు ప్రదర్శించాలి... చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారికి ఈ తరహా చిత్రాలను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా తమతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే పిల్లలు తమ తల్లిదండ్రులకు లేదా సంబంధిత పాఠశాల సిబ్బందికి తెలియజేయడానికి వీలుగా ఉంటుంది. వారంలో ఏదో ఒక రోజు ఒక గంట పాటు పిల్లలకు ఈ తరహా యానిమేషన్ సినిమాలు చూపేందుకు, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పాఠశాలల్లో సమయాన్ని పాఠశాలల యాజమాన్యాలు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - రంగారెడ్డి, ఏజీఎం, నారాయణ ఒలంపియాడ్ పాఠశాల సన్నిహితుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.... ఇటీవల జరుగుతున్న సంఘటనలు చిన్నారుల తల్లిదండ్రుల్లో విపరీతమైన భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు చిన్నారులు బలికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులే తమ సన్నిహితుల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలి. అంతేకాదు బంధువుల ప్రవర్తన విషయంలో ఏదైనా మార్పును గమనిస్తే వెంటనే పిల్లలను వారికి దూరంగా ఉండమని సలహా ఇవ్వాలి. చిన్నారులు వెళ్లే ప్రదేశాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అని ఒకసారి సరిచూసుకుంటే ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. - శ్రీనిధి, మానసిక నిపుణురాలు