యూట్యూబ్‌లో కోమల్
*ఇలాంటి సినిమాలు ప్రతి పాఠశాలలోనూ ప్రదర్శించాల్సి ఉందంటున్న విద్యారంగ నిపుణులు
*చిన్నారులపై లైంగిక వేధింపులపై చైతన్యం పరుస్తూ ‘చైల్డ్‌లైన్’ యానిమేటెడ్ సినిమా
సాక్షి, బెంగళూరు : లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించాలంటే ముందుగా పిల్లలకు తమను దగ్గరకు తీసుకుంటున్న వారి మనసులోని ఆలోచనలు పసిగట్టేలా సిద్ధం చేయాలి. ఇదే అంశాన్ని ఇతివృత్తగా చేసుకొని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని నోడల్ ఏజన్సీ చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్ ‘కోమల్’ పేరిట ఓ యానిమేషన్ చిత్రాన్ని రూపొందిం చింది. పది నిమిషాల నిడివి గల ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించబడింది.
ఈ చిత్రంలో కోమల్ అనే చిన్నారి తన ఎదురింటిలోని వ్యక్తి కారణంగా ఎదుర్కొన్న లైంగిక వేధింపులు అనంతరం ఆ చిన్నారిలో వచ్చిన మార్పులు వంటి అంశాలతో పాటు ఈ సమయంలో ‘చైల్డ్‌లైన్’ కౌన్సిలర్ల ద్వారా ఆ చిన్నారి ‘సేఫ్ టచ్’, ‘అన్ సేఫ్ టచ్’ వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవడం వంటి సన్నివేశాలను చూడవచ్చు. ఇటీవలే యూ ట్యూబ్‌లోకి అప్‌లోడ్ అయిన ఈ యానిమేషన్ సినిమా ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్‌ను మూడు లక్షల 12వేల మంది చూడగా, హిందీ వర్షన్‌ను 11వేల మంది వీక్షించారు.
అంతేకాదు ఈ సినిమాను చూసిన వారంతా చైల్డ్‌లైన్ సంస్థ చేసిన ఈ ప్రయత్నానికి ప్రశంసల వర్షాన్నే కురిపించేస్తున్నారు. ఈ చిత్రాన్ని మీరు చూడాలనుకుంటే గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి "komala film on child sexual abuse'అని టైప్ చేస్తే సరి, యూట్యూబ్‌లో ఉన్న ఈ యానిమేషన్ సినిమా మీ ముందు ప్రత్యక్షం అవుతుంది.
అన్ని పాఠశాలల్లోనూ ఈ తరహా సినిమాలు ప్రదర్శించాలి...
చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారికి ఈ తరహా చిత్రాలను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా తమతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే పిల్లలు తమ తల్లిదండ్రులకు లేదా సంబంధిత పాఠశాల సిబ్బందికి తెలియజేయడానికి వీలుగా ఉంటుంది. వారంలో ఏదో ఒక రోజు ఒక గంట పాటు పిల్లలకు ఈ తరహా యానిమేషన్ సినిమాలు చూపేందుకు, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పాఠశాలల్లో సమయాన్ని పాఠశాలల యాజమాన్యాలు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- రంగారెడ్డి, ఏజీఎం, నారాయణ ఒలంపియాడ్ పాఠశాల
సన్నిహితుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి....
ఇటీవల జరుగుతున్న సంఘటనలు చిన్నారుల తల్లిదండ్రుల్లో విపరీతమైన భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు చిన్నారులు బలికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులే తమ సన్నిహితుల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలి. అంతేకాదు బంధువుల ప్రవర్తన విషయంలో ఏదైనా మార్పును గమనిస్తే వెంటనే పిల్లలను వారికి దూరంగా ఉండమని సలహా ఇవ్వాలి. చిన్నారులు వెళ్లే ప్రదేశాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అని ఒకసారి సరిచూసుకుంటే ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
- శ్రీనిధి, మానసిక నిపుణురాలు