అకడమిక్‌ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ఎంతో తేడా! | Retired IAS Mukteshwarrao Suggestions On Academic And Competitive Exams | Sakshi
Sakshi News home page

అకడమిక్‌ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ఎంతో తేడా!

Published Thu, Apr 28 2022 9:16 AM | Last Updated on Thu, Apr 28 2022 9:16 AM

Retired IAS Mukteshwarrao Suggestions On Academic And Competitive Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ కొలువుల జాతర సాగుతోంది. ప్రభుత్వం దాదాపు 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన వారు మొదలుకొని.. డిగ్రీ, ఆపై చదువుకున్న వారిలో మెజారిటీ నిరుద్యోగుల దృష్టి ఈ ఉద్యోగాలపైనే ఉంది. సహజంగా నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే కసరత్తు ప్రారంభించడం పరిపాటిగా కనిపిస్తుంది. దరఖాస్తు అనంతరం పోటీకి సన్నద్ధమై.. పరీక్ష తేదీ నాటికి సిద్ధంగా ఉంటే సరిపోతుంది.

ఆమేరకు నియామక సంస్థలు సైతం సమయాన్ని ఇస్తాయి. అయితే ఆ వ్యవధిలో ప్రిపేర్‌ కావడమంటే అకడమిక్‌ పరీక్షలకు సిద్ధమైనట్లు కాదని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎన్‌.ముక్తేశ్వర్‌రావు సూచిస్తున్నారు. అకడమిక్‌ పరీక్షలకు కేవలం విషయాన్ని చదివి రాస్తే సరిపోతుందని, కానీ పోటీ పరీక్షల్లో మాత్రం ప్రతి విషయాన్ని లోతుగా చదివి, ఆకళింపు చేసుకుంటేనే విజయం సాధిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఆయన ‘సాక్షి’తో పలు అంశాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... 

సివిల్‌ సర్వెంట్‌కు... 
సివిల్‌ సర్వెంట్‌ అంటే కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉద్యోగం. ఇక రాష్ట్రస్థాయిలో గ్రూప్‌–1 ఉద్యోగం ఉత్తమమైంది. వీటికి ఎంతో విశిష్టత ఉంటుంది. అధికారం, చట్టం, నిధులు, స్వీయ నిర్ణయానికి ప్రాధాన్యత ఉండటంతో సమాజానికి మేలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యవస్థలో మార్పులు తేవాలంటే ఇలాంటి ఉద్యోగాలతో సాధ్యమవుతుంది. అంతటి ఉన్నత ఉద్యోగం పొందాలంటే ఎంతో సాధన అవసరం. 

స్వీయ దృక్పథం ఉండాలి... 
ఒక అంశాన్ని చదివినప్పుడు దానిపై స్వీయ దృక్పథం ఉండాలి. మనకంటూ ఒక వ్యూ పాయింట్‌ ఉంటేనే దానిపై పరిశీలన చేయగలం. అలా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలి, లోతుగా అధ్యయనం చేయాలి. అప్పుడే ఆ అంశంపై మనకు పట్టు పెరుగుతుంది. ఇందుకు ఎక్కువ పుస్తకాలు చదవాలి. ఆ రోజుల్లో నేను రోజుకు కనీసం పది నుంచి పన్నెండు సంపాదకీయాలు చదివే వాడిని. శ్రద్ధతో ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. 

వ్యక్తీకరణ కీలకం... 
సివిల్స్, గ్రూప్స్‌లో రాత పరీక్షలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ పరీక్షలకు వ్యక్తీకరణ అనేది కీలకం. ఒక అంశం చదివిన తర్వాత దాన్ని అర్థవంతంగా వ్యక్తీకరించాలి. అందుకు సరైన భాష, పదప్రయోగం వాడాలి. ఏ సందర్భంలో ఎలాంటి పదాలు వాడాలనే అవగాహన ఉంటేనే వ్యక్తీకరణ సులభమవుతుంది. విషయ పరిజ్ఞానంతోపాటు సమాజం పట్ల అవగాహన ఉండాలి. అందుకోసం సమాజాన్ని చదవాలి. వార్తాపత్రికలతోపాటు సామాజిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలి. ప్రతి అంశాన్ని లోతుగా చదవడం నేర్చుకుంటే దానిపై అవగాహన పెరుగుతుంది. వీలుంటే నిపుణులతో ఆయా అంశాలపై చర్చిస్తే మంచి ఫలితం ఉంటుంది. 

తెలుగు అకాడమీ పుస్తకాలు బాగు 
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే మంచి ఫలితం ఉంటుంది. జాతీయ అంశాలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాలున్నాయి. పోటీ పరీక్షల్లో విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. అది మనకు నచి్చన భాషలో సన్నద్ధం కావొచ్చు. మాతృభాషలో అయితే తక్కువ వ్యవధిలో ఎక్కువ పుస్తకాలు చదవడంతోపాటు సిలబస్‌ పూర్తిచేసే వీలుంటుంది. ఆ తర్వాత అవసరం ఉన్న భాషలోకి దాన్ని వినియోగించుకోవాలి.  

బహుముఖకోణం... 
ఒక అంశాన్ని మనం పరిశీలించే తీరును బట్టి అవగాహనకు వస్తాం. అలా ప్రతి అంశానికి బహుముఖ కోణాలుంటాయి. నేను ఒకసారి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న సమయంలో తీవ్ర కరువు పరిస్థితులు వచ్చాయి. అప్పుడు వికారాబాద్‌ ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లాను. అక్కడి మెజార్టీ మహిళలు తాగునీటి సౌకర్యం కలి్పంచాలని కోరగా... ఇతర పనులు చేసుకునే పురుషులు మాత్రం మంచి రోడ్డు వేయాలని అడిగారు. కరువు పరిస్థితుల్లో కూడా ఒక్కోక్కరి డిమాండ్‌ ఒక్కోలా ఉంది. అంటే మహిళలు ఇంటి పనులు చూసుకుంటారు కాబట్టి తాగునీరు అడిగితే, పనులు చేసుకునే వారు మెరుగైన రవాణా కోసం రోడ్లు అడిగారు. ఇలా ఒక్కో అంశానికి అనేక కోణాలు ఉంటాయి. అలా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement