షార్లో రెండో ఉపగ్రహ కేంద్రం
రూ. 364 కోట్లతో నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో రెండో ఉపగ్రహ నిర్మాణ కేంద్రాన్ని రూ.363.95 కోట్ల వ్యయంతో నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర అంతరిక్ష శాఖ ఈ ప్రాజెక్టు కోసం షార్లో బృందాలను ఏర్పాటు చేయనుంది. ఈ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. రెండో ఉపగ్రహ నిర్మాణ కేంద్రం నిర్మాణాన్ని 42 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కాగా, పదిహేడేళ్లుగా కొనసాగుతున్న యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంను (ఏఐబీపీ) 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా కొనసాగించాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదించింది. దీనికోసం రూ.55,200 కోట్లు ఖర్చు కానుండగా, ఈ పథకం కింద రాష్ట్రాలు అదనంగా 87 లక్షల హెక్టార్ల భూములకు సాగునీటి వసతిని కల్పించగలవని అంచనా వేస్తున్నారు. నీటిపారుదల రంగానికే చెందిన మరో రెండు పథకాలను రూ.15 వేల కోట్ల వ్యయంతో 12వ ప్రణాళికలో కొనసాగించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
పేదలకు అదనంగా 50 లక్షల టన్నుల తిండిగింజలు...
బీపీఎల్ కుటుంబాలకు సరఫరా చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా 50 లక్షల టన్నుల తిండి గింజలను మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదించింది. జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ అధీకృత వాటా మూలధనాన్ని రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఈ మూలధనం పెరగడం వల్ల మరింత మంది ఓబీసీలకు ఆర్థిక సాయం అందించేందుకు వెసులుబాటు ఏర్పడుతుంది.