acqapark
-
వద్దనడం లేదు.. తరలించమంటున్నాం
ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధుల మనోగతం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడి సాక్షి ప్రతినిధి, ఏలూరు : ’తుందుర్రులో తలపెట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వద్దనడం లేదు. కాలుష్య కారకమైన ఆ పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించమంటున్నాం. మమ్మల్ని అభివృద్ధి నిరోధకులుగా, తీవ్రవాదులుగా చూపించి దమనకాండకు దిగుతున్నారు. మాపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో బంధించారు. అయినా మేం భయపడటం లేదు. ఎన్ని సంవత్సరాలైనా జైళ్లలో మగ్గడానికి సిద్ధమే. మా త్యాగాలు వృథా కావు. మొన్నటివరకూ మూడు గ్రామాల ప్రజలు చేసిన ఉద్యమం ఇప్పుడు 30 గ్రామాల పోరాటంగా మారింది. అందరి నుంచి వచ్చిన మద్దతు ఉత్సాహాన్నిచ్చింది. మరీ ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మాకు మద్దతుగా నిలవడం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపగలమన్న మనోధైర్యం వచ్చింది. అరెస్టులు చేసి జైలుకు పంపినా మేం వెనకడుగు వేసేది లేదు. ప్రజల నుంచి. ముఖ్యంగా మా గ్రామాల మహిళల నుంచి వచ్చిన స్ఫూర్తితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా’మని గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు స్పష్టం చేశారు. జైలు నుంచి ఇటీవల విడుదలైన పోరాట కమిటీ నాయకుల మనోగతం వారి మాటల్లోనే.. బెదిరించారు రెండున్నరేళ్లుగా ఇక్కడ ఇక్కడ నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నన్ను మర్యాదగా డ్రాప్ అవ్వమని బెదిరించారు. నేను వినకపోవడంతో అక్రమంగా, అన్యాయంగా హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మా నాన్న గారికి అమ్మ ఆపరేషన్ చేయించి తీసుకువచ్చింది. ఇంట్లో ఆయనకు సపర్యలు చేస్తూ ఉంది. నన్ను జైలుకు పంపడంతో కుటుంబ సభ్యులంతా ఉద్వేగానికి లోనయ్యారు. నేను జైలులో ఉండగా ఆక్వాపార్క్ యాజమాన్యం కొంతమంది మఽధ్యవర్తులను పంపించి కాంప్రమైజ్ కోసం ప్రయత్నించింది. నేను ఒప్పుకోకపోవడంతో మా అమ్మను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 307 సెక్షన్ కేసులో అయినా 14 రోజుల్లో బెయిల్ రావాల్సిన మాకు 53 రోజుల వరకూ బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. విజిటర్స్‌పై కూడా ఆంక్షలు విధించారు. జైలులో ఉన్న వారందరికీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు ఫోన్ ఇచ్చేవారు. మాకు మాత్రం ఆ అవకాశం లేకుండా చేశారు. ఆరేటి వాసు, కన్వీనర్, ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నిద్రలేని రాత్రులు గడిపాను నా భర్త పేషెంట్‌గా ఉన్నారు. ఆయనను చూసే దిక్కులేదు. పగలూ, రాత్రి నిద్రలేకుండా కాలం వెళ్లదీశాను. ఆయనను ఆసుపత్రికి తీసుకవెళ్లాల్సి ఉంది. నేను, నా కుమారుడు జైలులోనే ఉన్నాం.ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లలేని దుస్థితిలో ఉండిపోయాం. పాలకొల్లులో నిర్వహించిన ధర్నాలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు అరెస్టు చేశారు. గ్రంధి శ్రీనివాస్ దగ్గరకి వెళ్లి చెప్పుకునేంత నాయకురాలివి అయిపోయావా అంటూ డొక్కల్లో పొడిచి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. చంద్రబాబుకు ఓటు వేసినందుకు మాకు ఈ తిప్పలా. అడపడుచుల ఉసురుపోసుకుంటాడని చెప్పి జీపు ఎక్కాను. అక్కడికి వెళ్లాక గాజులు తీసేయి, గొలుసులు తీసేయమంటూ వేధించారు. వైఎస్ జగన్ నా దగ్గరికి వచ్చి ఓదార్చారు. నా పెద్దకొడుకు నా దగ్గరకు వచ్చినట్టు అనిపించి ధైర్యం వచ్చింది. ఫ్యాక్టరీ ఆపివేయిద్దామని ఆయన హామీ ఇచ్చారు. ఒక్క సత్యవతిని అరెస్ట్ చేశారు. వేలాది మంది సత్యవతులు రోడ్డెక్కుతారని ఫ్యాక్టరీ యాజమాన్యం ఊహించలేదు. ఆరేటి సత్యవతి, ఉద్యమకారిణి ఆఫర్లిచ్చారు తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మద్య ఆక్వా పుడ్ పార్క్ పెట్టడం వల్ల గ్రామాల్లో జల, వాయు కాలుష్యం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడతారని ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. పోరాట కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ప్రభుత్వం మా పట్ల కక్షపూరితంగా వ్యవహరించింది. మా బంధువులను బెదిరించారు. మాకు ఆఫర్లు కూడా ఇచ్చారు. అయినా మేం దేనికీ లొంగలేదు. అందుకే మాపై అక్రమ కేసులు పెట్టారు. 307 కేసు పెట్టడమే కాకుండా మేం బయటకు రాకుండా ఉండటం కోసం పదే పదే పెండింగ్ ట్రైల్ పేరుతో పీటీ వారెంట్లు వేశారు. బెయిల్ ప్రొసీడింగ్స్ సమయంలో కూడా ఏడు కేసులు కట్టి పీటీ వారెంట్లు వేయడానికి ప్రయత్నం చేసినా మేజిస్ట్రేట్ అంగీకరించకపోవడంతో బయటకు వచ్చాం. ఇప్పుడు కూడా తప్పుడు ఫిర్యాదులతో కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్థాన్ బోర్డర్ తరహాలో ఇంకా 144 సెక్షన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ముచ్చర్ల త్రిమూర్తులు, పోరాట కమిటీ ప్రతినిధి ఈ ప్రభుత్వ పతనం తప్పదు నేను కంసాలి బేతపూడి గ్రామ పెద్దగా ఉన్నాను. నీటి సంఘం డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. ఈ కంపెనీ పెట్టడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతుంది. అసలే మాది శివారు గ్రామం. నీరు పూర్తిగా రాదు. ఇటువంటి పరిస్థితిలో ఫ్యాక్టరీ వద్దని కోరాం. నేను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుటి నుంచి అందులోనే పని చేస్తున్నాను. నరసాపురం నియోజకవర్గంలో ఎక్కడా రానంత మెజారిటీ మా గ్రామం నుంచి ఇచ్చాం. విశ్వనాథరాజు భార్య, రంగరాజు భార్య కనీసం ఓటు వేయడానికి కూడా రారు. అటువంటి వారికి మద్దతు ఇచ్చి, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే మమ్మల్ని అరెస్టు చేయడానికి కూడా వెనుకాడలేదు. నా తమ్ముడి కూమారుడి పెళ్లి. కనీసం వధూవరులను ఆశీర్వదించే అవకాశం లేకుండా చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలు నెగ్గారంటే మేం పనిచేయబట్టే. మమ్మల్ని బయటకు రాకుండా హింస పెట్టారు. మీ ఉద్యమం ఎంత, మీరెంత అంటూ పోలీసులు దారుణంగా మాట్లాడారు. అన్నం పెట్టిన చేతిని కరిచినట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. ఇంకా ఆ ఫ్యాక్టరీని కట్టాలనుకుంటే, ముందుగా నన్ను కాల్చి చంపి కట్టుకోండి. సముద్రాల వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత పనికి వెళ్తుంటే అరెస్ట్ చేశారు మాది జొన్నలగరువు దళితపేట. మా ఇంటి ఎదురుగానే ఫ్యాక్టరీ కడుతున్నారు. అందుకే వద్దన్నాం. నేను యూత్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నాను. పనికి వెళ్తేగాని పొట్టగడవని పరిస్థితి. ఆ రోజు భీమవరంలో పనికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. నన్ను అరెస్టు చేశామన్నారు. ఏఎస్సైకి ఫోన్ చేసి నా పేరు చెప్పగా, కేసులో పేరు లేదన్నారు. అయినా పోలీసులు వినకుండా నన్ను అరెస్ట్ చేసి లోపల వేశారు. ఽఅక్రమ కేసు బనాయించారు. నా భార్య జైలుకు వచ్చి చాలా ఏడ్చింది. మూడు రోజులు భోజనం కూడా చేయలేదు. నేను జైలులో ఉన్నన్ని రోజులు కుటుంబం గడవక నా భార్య, ఇద్దరు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. కొయ్యే మహేష్, జొన్నలగరువు బాధ లేదు.. భయపడుతున్నాం మేం చేసేది న్యాయమైన పోరాటం. అందుకే బాధపడటం లేదు. అయితే మళ్లీ అరెస్టులు చేస్తారన్న భయం వెంటాడుతోంది. పిల్లల్ని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నా ఆధార్ కార్డు అడిగారు. ఇంతకంటే దారుణం మరేమైనా ఉంటుందా. మా వారిని జైలులో పెట్టినప్పుడు మేం పడిన బాధ అంతాఇంతా కాదు. ఇద్దరు చంటిబిడ్డలతో ఎన్నో అవస్థలు పడ్డాను. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొయ్యే కీర్తన, మహేష్ భార్య -
ఇంకా ఆంక్షల మధ్యే..
► 144 సెక్షన్ ఎత్తివేతపై మీనమేషాలు ► సీఎం ప్రటించినా అమలుకాని వైనం ► ఆక్వాపార్క్ బాధిత గ్రామాల్లో దుస్థితి ► విపక్షాలపై కొత్తరకం దుష్ప్రచారం ఆక్వాపార్క్ బాధిత గ్రామాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ ఎత్తివేతపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈనెల 17న పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేస్తామని, కేసుల ఎత్తివేత అంశాన్నీ పరిశీలిస్తామని ప్రకటించారు. అయితే ఆ దిశగా ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదు. దీనిపై ప్రశ్నిస్తే రెవెన్యూ, పోలీసు అధికారులు పొంతనలేని ప్రకటనలు ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఫలితంగా తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం 144 సెక్షన్ ఎత్తివేసి, పార్కును సముద్ర తీరానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు. దీనివల్ల సుమారు 40 గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆ ప్రాంతవాసులు పోరాటానికి దిగారు. దీనిని జీర్ణించుకోలేని సర్కారు ఫుడ్‌పార్కు నిర్మితమవుతున్న తుందుర్రు, జొన్నలగరువు, కంసాలిబేతపూడి గ్రామాల్లో 144 సెక్షన్ విధించింది. 600 పోలీసులను మోహరించింది. ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అరెస్ట్ చేసి, వారిపై హత్యాయత్నం కేసులు బనాయించింది. నరసాపురం, తణుకు సబ్‌జైలుకు తరలించింది. గ్రామీణులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించింది. పాశవిక చర్యలకు పాల్పడింది. ఆ తర్వాత పోలీసు బందోబస్తు నడుమ ఫుడ్‌పార్కు నిర్మాణ సామగ్రిని అక్కడికి తరలించింది. ఆ ప్రాంతాన్ని ఇండో–పాక్ సరిహద్దులా మార్చేసింది. ఆ గ్రామాల్లోకి ఎవరన్నా వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ఆధార్ కార్డు చూపించాల్సిదేనంటూ పోలీసులు హుకుం జారీ చేసే పరిస్థితిని తీసుకువచ్చింది. ఈ నిర్బంధకాండను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం రంగంలోకి దిగాయి. ఆ గ్రామాలకు వెళ్లేందుకు జిల్లాకు వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన పోరాడేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం తరపున మాజీ మంత్రులు కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ ఈ గ్రామాలకు వచ్చారు. ఈ సమయానికి పోలీసులు ఆ గ్రామాల్లో కొంతవరకూ బలగాలను దాదాపుగా ఉపసంహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి బాధితులకు సంఘీభావం ప్రకటించి, ఆ గ్రామాల్లో పర్యటించడంతో పోలీసులు అక్కడ పూర్తిగా బలగాలను ఉపసంహరించారు. అయితే అధికారికంగా 144 సెక్షన్‌ను మాత్రం కొనసాగిస్తున్నారు. పలువురిపై కేసులూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 17న పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆక్వాపార్క్ బాధిత గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. అయినా ఆ దిశగా ప్రయత్నం జరగలేదు. దీంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే రెండుమూడురోజుల్లో ఎత్తివేస్తామని రెవెన్యూ అధికారులు, ఇప్పటికే పూర్తిగా ఎత్తేశామని పోలీసులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ బాధితుల గోడు పట్టించుకోని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఇటీవల వరుసగా రెండుసార్లు ఆక్వాపార్క్ బాధిత గ్రామాలను సందర్శించేందుకు యత్నించారు. అయితే బాధితులు తిరస్కరించడంతో ఆయన వెనుకడుగు వేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చి 144 సెక్షన్ ఎత్తివేయాలని, ఆక్వాపార్కును సముద్రతీర ప్రాంతానికి తరలించాలని ఆ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీని ఇక్కడ కట్టడానికి అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు. కొత్తరకం ప్రచారం ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోగా, బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీపై విమర్శలకు దిగుతోంది. కొత్తరకం వాదనను తెరపైకి తెస్తోంది. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కుకు అరెంజ్ కేటగిరి ఇచ్చారని, సిమెంట్ ఫ్యాక్టరీలకు కాలుష్య నియంత్రణ మండలి రెడ్ కేటగిరి ఇస్తుందని, వాటితోపోలిస్తే ఫుడ్‌పార్కు నుంచి తక్కువ స్థాయిలోనే కాలుష్యం వస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే సిమెంట్ ఫ్యాక్టరీలను ఎక్కడైనా జనావాసాల మధ్య, పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేశారా అన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలోనే ఇటువంటి ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు 17 ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఓ విషయాన్ని విస్మరిస్తోంది. అదేంటంటే విపక్షాలు ఈ పరిశ్రమలను వద్దనడం లేదు. జనావాసాల మధ్య, పచ్చని పొలాల మధ్య మాత్రం పెట్టవద్దని సూచిస్తున్నాయి. సముద్ర తీరంలో నిర్మించుకుంటే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నాయి. అయితే సర్కారు ఈ విషయాన్ని ప్రస్తావించకుండా దీనివల్ల కాలుష్యం ఉండదని మాత్రమే చెబుతోంది. 144 సెక్షన్ వెంటనే ఎత్తివేయాలి తుందుర్రు, జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో 144 సెక్షన్‌ను వెంటనే అధికారికంగా ఎత్తివేయాలి. దీంతోపాటు ఆక్వా ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. తాము ఆ పరిశ్రమను ప్రజల అభీష్టం మేరకు అక్కడి నుంచి తరలించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కన పెట్టి తాము పరిశ్రమలకు వ్యతిరేకం అన్నట్టు ప్రకటనలు ఇవ్వడం సరికాదు. ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం లేనప్పుడు ముఖ్యమంత్రి వ్యర్థ జలాలను సముద్రంలో కలిపేలా పైపులైన్ వేస్తామని ఎందుకు ప్రకటించారు. అంటే కాలుష్యం వస్తుందని ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నట్లే కదా. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం తమ మొండి వైఖరి విడనాడి ఫుడ్‌పార్కును తరలించాలి. -ఆళ్ల నాని, వైఎస్సార్ సీపీ, జిల్లా అధ్యక్షుడు -
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు
– కాలుష్య కారక కర్మాగారాన్ని అడ్డుకుంటే జైల్లో పెడతారా – హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారా – తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ దారుణం – ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర – తణుకు సబ్‌జైలులో ఆరేటి సత్యవతిని పరామర్శించిన వైఎస్ జగన్ సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతూ అరెసై ్ట 38 రోజులుగా రిమాండ్‌లో ఉన్న తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి సత్యవతిని తణుకు సబ్జైల్లో కలుసుకుని పరామర్శించారు. పోలీసుల వైఖరిని, అక్కడ ఫ్యాక్టరీ వద్దంటూ జరుగుతున్న పోరాట వైనాన్ని అడిగి తెలుసుకున్నారు. సత్యవతి చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన జగన్మోహనరెడ్డి ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత సత్యవతి కూతురు కల్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం వల్ల గ్రామాలు కలుషితమవుతాయని, పంటలు నాశనమవుతాయని ఆందోళన చేస్తుంటే వారిపై హత్యాయత్నం చేసులు నమోదు చేస్తారా అని జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. కేవలం ప్రశ్నించినందుకే హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆరేటి సత్యవతిని తణుకు çసబ్‌జైలులో, ఆమె కుమారుణ్ణి నరసాపురం సబ్‌జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకించినందుకు మొత్తం ఏడుగురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. ఎఫ్ఐఆర్లో ఇతరులు అని రాసి.. ఆ ఇతరులుగా మిమ్మల్నీ అరెస్ట్ చేస్తామంటూ గ్రామస్తులను పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఆ ఇతరుల్లోనే సత్యవతిని చూపించి అరెస్ట్ చేశారని ఆయన విమర్శించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టకు పోయి ఆక్వా పార్క్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. దానికి వ్యతిరేకంగా నిలబడిన వారిపై ఇలా కేసులు నమోదు చేస్తూ గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేయడం దుర్మార్గమన్నారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన డెల్టా పేపర్ మిల్లు వల్ల ఇప్పటికే యనమదుర్రు డ్రెయిన్ కాలుష్య కాసారంగా మారిందని గుర్తు చేశారు. దాని కారణంగా భీమవరం పరిసర ప్రాంతాలు ప్రాంతాలు కలుషితమై దుర్వాసన వెదజల్లుతున్నాయని, పంటలు సైతం పండని పరిస్థితి నెలకొందన్నారు. గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం చేపడితే గొంతేరు డ్రెయిన్ కూడా ఇలాగే కలుషితం అవుతుందని స్థానికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. సముద్ర తీరాన్ని ఆనుకుని ఆక్వా పార్క్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్నో గ్రామాలకు చెందిన ప్రజలు వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు సర్కారు ఉసురు పోసుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కాలుష్యం ఉండదని చెబుతూనే మరోవైపు ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలను పైపులైన్ ద్వారా సముద్రంలోకి మళ్లిస్తామని చెబుతూ.. కాలుష్యం ఉంటుందనే వాస్తవాన్ని చంద్రబాబు ఒప్పుకుంటున్నారన్నారు. రోజుకు 3 వేల టన్నుల రొయ్యలను రసాయనాలతో కడిగి కోల్ట్‌స్టోరేజీలో ఉంచుతారని, దీనివల్ల కాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం పైపులైన్ ఏర్పాటు చేయడం ఏమిటని నిలదీశారు. పైపులైన్ నిర్మిస్తే స్థల సేకరణకు, దాని నిర్మాణానికి రూ.25 కోట్లు అవుతుందన్నారు. ప్రై వేటు సంస్థకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. ఒకవేళ పైపులైన్లు ఏర్పాటు చేస్తే అవి ఎక్కడైనా లీకేజీలు ఉంటే ఆ ప్రాంతంలోని పొలాలు సర్వనాశనం అవుతాయన్నారు. దీనిద్వారా మత్స్యకారులు, రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఆక్వా పార్క్‌ను తక్షణమే సముద్ర తీరప్రాంతానికి తరలించాలని కోరారు. గత రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ముందుకెళుతుండటం సమంజసం కాదన్నారు. సముద్ర తీరంలో ఆక్వా పార్క్ యాజమాన్యానికి 350 ఎకరాల సొంత భూములు ఉన్నాయని, ప్రాజెక్ట్‌ను అక్కడికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అందరి సహకారం ఉంటుందని చెప్పారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ముఖ్య నాయకులు వంకా రవీంద్రనాథ్, కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, కవురు శ్రీనివాస్, రాష్ట్ర ప్రోగామింగ్ కమిటీ కన్వినర్ తలశిల రఘురామ్ తదితరులు ఉన్నారు. -
బాబూ.. డ్రామాలు కట్టిపెట్టు
– చంద్రబాబుకు అబద్ధాలు ఫ్యాషన్ అయిపోయింది.. – బలవంతపు భూసేకరణ వద్దంటే అభివద్ధి నిరోధకులు అంటావు – చంద్రబాబు.. అభివృద్ధి నిరోధకుడివి నువ్వా? మేమా? – ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? – కాలుష్య ఫ్యాక్టరీ వద్దంటే హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెడతారా? – బాబూ డ్రామాలు కట్టిపెట్టి పద్ధతి మార్చుకో.. ప్రజల కోసం పనిచేయడం నేర్చుకో – గ్రామాల మధ్యలో ఫ్యాక్టరీ తొలగించి తీర ప్రాంతంలో పెట్టుకోవాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నా – అలా కాదని చంద్రబాబు మాట వింటే ఆయనతోపాటే బంగాళాఖాతంలో కలిసిపోతారు – ప్రజల కోసం అవసరమైతే ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కోర్టుకు వెళతాం – అక్వా ఫుడ్ పార్క్ బాధితుల సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, భీమవరం : ‘అయ్యా.. చంద్రబాబూ మీకు అబద్ధాలు ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలు ఒప్పుకోకపోయినా బందరు పోర్టుకు వేల ఎకరాలు భూ సేకరణ చేస్తారు. అమరావతిలో బలవంతంగా భూములు లాక్కుంటావు. భోగాపురం విమానాశ్రయానికి కూడా భూములు బలవంతంగా తీసుకుంటావు. ఇప్పుడు తుందుర్రులో కనీసం ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చేస్తావు. అదేమని ప్రశ్నించే ప్రజలపై హత్యాయత్నం కేసులు పెడతావు. జైళ్లకు పంపుతావు. ప్రజలను భయపెట్టి దారికి తెచ్చుకోవాలనుకుంటావు. ఇది సరైంది కాదని ఎదిరించి చంద్రబాబు ఆగడాల్ని అడ్డుకుంటే అభివద్ధి నిరోధకులుగా ముద్రవేస్తాడు. అయ్యా.. చంద్రబాబు అభివద్ధి నిరోధకుడు నీవా? మేమా? చంద్రబాబు ఇవన్నీ మార్చుకో. రాష్ట్రం కోసం పనిచేయడం నేర్చుకో’ అంటూ ప్రధా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా మెగా ఫుడ్ పార్క్ కాలుష్యం వల్ల ఇబ్బందులు పడతామని వ్యతిరేకిçస్తున్న ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టి వారిని జైలుకు పంపడం, గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి పోలీసు వేధింపులకు దిగడంతో బాధితులకు అండగా ఉంటానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పర్యటించారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో తణుకు వెళ్లి అక్కడ సబ్‌జైలులో ఉన్న తుందుర్రు చెందిన ఆరేటి సత్యవతిని పరామర్శించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం తణుకు నుంచి రేలంగి, అత్తిలి, భీమవరం మీదుగా తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అక్వా ఫుడ్‌పార్క్ బాధితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం అబద్ధాలు ఆడినట్టే చివరకు ఫ్యాక్టరీ విషయంలోనూ అబద్ధాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల నుంచి చంద్రబాబు అబద్ధాలే చెబుతున్నాడు ‘ఎన్నికల సందర్భంలో ఎన్నెన్నో అబద్ధాలు చెప్పాడు. ఎన్నికల్లో ఓట్ల కోసం అనేక అబద్ధాలతో ప్రజలను మోసం చేశాడు. రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం అప్పులు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు రద్దు చేస్తానన్నాడు. చివరికి చదువుకున్న పిల్లల్ని కూడా వదల్లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. జాబు రాకపోతే నిరుద్యోగ భతి ఇస్తానని అబద్ధాలు చెప్పి ఏ ఒక్కటి సక్రమంగా చేయలేదు. ఇప్పుడు ఫ్యాక్టరీని ప్రజలు అడ్డుకుంటుంటే మళ్లీ మోసం చేయడానికి పైపులైన్ వేస్తానని అబద్ధాలు చెబుతున్నాడు. ప్రై వేటు సంస్థకు చెందిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే రూ.20 కోట్ల నుంచి 25 కోట్లు ఖర్చుపెట్టి షెడ్లు వేసుకున్నట్టు చెబుతున్నారు. అలాంటి ప్రై వేటు సంస్థకు చెందిన ఫ్యాక్టరీకి ప్రభుత్వ నిధులతో ఎలా పైపులైన్ వేస్తారు. ఒక పక్కన ఆ ఫ్యాక్టరీ వల్ల జీరో పర్సంట్ కాలుష్యం అని చెబుతున్న చంద్రబాబు ఫ్యాక్టరీ కలుషిత వ్యర్థాలను సముద్రంలోకి పంపించేలా పైపులైన్ వేస్తానని చెబుతున్నారు. అంటే ముడుపుల కోసం ఏ పని చేసేందుకైనా చంద్రబాబు వెనుకాడడు. లేదంటే ప్రజలను మోసం చేయడానికి పైపులైన్ వేస్తానని కొత్త డ్రామాలు అడుతున్నాడు. చంద్రబాబు గారూ.. పైపులైన్ డ్రామాలు కట్టిపెట్టండి’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. సీఫుడ్ ఫ్యాక్టరీ కాలుష్యం అని తెలీదా? ‘ఈ ఫ్యాక్టరీలో రోజుకు 3 వేల టన్నుల రొయ్యలు, చేపలను శుద్ధి చేసినప్పుడు ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఎలా ఉంటుంది. కాలుష్య నియంత్రణ చట్టం సెక్షన్ 8 ప్రకారం సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆరంజ్ కేటగిరీలో ఉందని, ఇది కాలుష్య కారకమని చంద్రబాబు తెలీదా? కాలుష్యం ఉందని మీకు తెలుసు కాబట్టే పైపులైను పేరుతో మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇదే ఫ్యాక్టరీని పది కిలోమీటర్ల దూరంలోని మారిస్తే అక్కడ మనుషులు ఉండరు. సముంద్ర తీరంలో ఇదే ప్యాక్టరీ యజమానులకు 350 ఎకరాలు ఉన్నాయి. వాటిలో కొంత భూమిని ఫ్యాక్టరీకి కేటాయిస్తే సముద్రతీరం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా దాని వల్ల ఇన్ని కిలోమీటర్లు పైపులైను వేసేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది. ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు కాస్తాకూస్తో వస్తాయి కాబట్టి సరేనన్నామని కొందరు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే విపరీతమైన దుర్గదం వస్తుంది. కాలువలు కలుషితం అయిపోవడం వల్ల చేను బతకదు, పొలాలు మీద ఆధారపడిన కూలీలు కూడా బతికే పరిస్థితి ఉండదు. బాబును నమ్ముకుంటే బంగాళాఖాతమే..! పరిశ్రమలు రాకూడదని ఎవరూ అనుకోరు. నిజంగా ఫ్యాక్టరీ వస్తే కొద్దోగొప్పో ఉద్యోగాలు వస్తాయి కాబటిట పర్వాలేదు గానీ ఇక్కడైతే వీళ్ల పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒక్కటే. ఏదైనా ఫ్యాక్టరీని పెట్టాలంటే 50 ఏళ్ల వరకు దూరదష్టితో ఉండాలి. ఫ్యాక్టరీ పెట్టిన తరువాత ఏ ఇబ్బంది ఉండకూడదని చూడాలి. వీళ్ల లెక్కల ప్రకారం 15–20 కోట్లు పెట్టామంటున్నారు. ఈ షెడ్లును ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుకోవచ్చు. మహా అయితే పునాది పనులకు పెట్టిన ఐదు కోట్ల ఖర్చు మాత్రమే నష్టం కావచ్చు. ఫ్యాక్టరీ స్థలం మొత్తం పూర్తిగా పోలీసులతో నింపేసి, అక్కడ యుద్దవాతావరణం సష్టించారు. ఊళ్లో 144 సెక్షన్ పెట్టారు. యాజమాన్యాన్ని కోరుతున్నా ప్రజల అభిష్టం మరకు దీన్ని ఇక్కడి నుంచి తరలించండి. ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలేదు. ఫ్యాక్టరీ పెడతామని భూములు కొనలేదు. వీటన్నింటి దష్టిలో పెట్టుకుని పెద్ద మనస్సుతో ఆలోచించి ఇక్కడి నుంచి తరలించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కాదు కూడదు అని చంద్రబాబు మాటను నమ్ముకుంటే ఆయనతోపాటు బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే. ఫ్యాక్టరీని తరలించకుంటే ప్రజల కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తామని జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్ల తరువాత మన ప్రభుత్వమే వస్తుంది.. చంద్రబాబు పాలన ఇక కేవలం రెండేళ్లు మాత్రమే అని గుర్తుపెట్టుకోంది. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. అప్పుడు ప్రజల అభిష్టం మేరకు ఏం కావాలో అది మాత్రమే చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా ఫుడ్‌పార్క్ బాధితులకు భరోసా ఇచ్చారు. సభలో పార్టీ నాయకులు, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారధి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వంకా రవీంధ్రనాథ్, గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు -
పచ్చని సీమలో పోలీస్ రాజ్యం
– ఆక్వా పార్క్ ఉద్యమంపై సర్కారు ఉక్కుపాదం – ప్రాణాలు పోయినా కట్టనిచ్చేది లేదంటున్న గ్రామీణ జనం – పైపులైన్ వేస్తారంటే కాలుష్యం ఉన్నట్టే కదా అని నిలదీత – పరిశ్రమను తుందుర్రు నుంచి సముద్ర తీరానికి తరలించాలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. గత నెల 12 నుంచి భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, నరసాపురం మండలం కంసాలి బేతపూడి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేస్తోంది. ప్రజలను ఇళ్లనుంచి బయటకు రానివ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వాపార్క్ కారణంగా తమ భవితవ్యం అంధకారం అవుతుందన్న భయంతో దానిని వ్యతిరేకించడమే ఆ ప్రాంత ప్రజలు చేసిన తప్పిదమన్నట్టుగా ప్రభుత్వం వారిపై దమనకాండకు దిగుతోంది. గోదావరి మెగా అక్వాఫుడ్పార్క్ వల్ల భూగర్బ జలాలు కలుషితం అవుతాయని, ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా గొంతేరు డ్రెయిన్ కలుషితం అవుతుందని తుందుర్రు, సమీపంలోని 30 గ్రామాల ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వం అణచివేత ధోరణిని ఎంచుకుంది. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టింది. 37 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, ఏడుగురిని గత నెల 12న జైళ్లకు తరలించింది. వారికి ఇప్పటికీ బెయిల్ రాకుండా అడ్డుకోవడంతో వారంతా జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం తుందుర్రు రానున్నారు. ఆయన రాక నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుందని భయపడిన ముఖ్యమంత్రి గడచిన రెండు రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యతను వారిపై పెట్టారు. కాలుష్యం రాకుండా ఆక్వా పార్క్‌లో కలుషిత నీటిని శుద్ధి చేసి పైపులైన్ ద్వారా సముద్రం వరకూ తరలించాలని ఆదేశించారు. ముందుగా పైపులైన్ పనులను ప్రారంభించి గ్రామస్తులకు నచ్చచెప్పాలని ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. అయితే తమ ప్రాంతంలో అక్వా పార్క్‌ను ఎట్టిపరిస్థితిల్లో కట్టనివ్వమని, అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. నిన్నటివరకూ ఆ పరిశ్రమ నుంచి సున్నా శాతం (జీరో పర్సంట్) కాలుష్యం మాత్రమే వెలువడుతుందని చెప్పి, ఇప్పుడు పైప్‌లైన్ వేస్తామంటున్నారంటే కాలుష్యం ఉన్నట్టే కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమ నేపథ్యమిదీ కేంద్ర ప్రభుత్వ రాయితీతో భీమవరం మండలం తుందుర్రులో రూ.150 కోట్ల వ్యయంతో గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని 2014లో ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు 3 టన్నుల చేపలు, రొయ్యలు, పీతలు వంటి ఆక్వా ఉత్పత్తులను ప్రాసెస్ చేసి శీతలీకరణ చేసేందుకు వీలుగా దీని నిర్మాణం చేపట్టారు. తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామాల పరిధిలోని సుమారు 70 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. చేపల చెరువుల కోసమని చెప్పి భూములు కొన్న యాజమాన్యం ఆ తర్వాత మెగా ఫుడ్‌పార్క్ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడ ఆక్వా పార్క్ నిర్మిస్తే ఏడాదికి మూడు పంటలతో సస్యశ్యామలంగా ఉన్న ఆ పల్లెలు బీడువారతాయని, తాము అక్కడి నుంచి పొట్ట చేత్తో పట్టుకుని వలస వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన తుందుర్రు, పరిసరాల్లోని 30 గ్రామాల్లో వ్యక్తం అవుతోంది. కాలుష్యాన్ని వెదజల్లే ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని, సముద్ర తీరంలో ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ ప్రజలంతా రోడ్డెక్కారు. ఆక్వా పార్క్ నిర్మించవద్దంటూ 21 గ్రామ పంచాయతీలు తీర్మానం కూడా చేశాయి. ఎందుకీ ఆందోళన మెగా ఆక్వాఫుడ్ పార్క్ దుష్పరిమాణాలు ఐదు మండలాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయని ఆందోళనకారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 3 వేల టన్నుల చేపలు, రొయ్యలు, పీతల శుద్ధి, నిల్వ చేసే సామర్ధ్యంతో ఇది పని చేస్తుంది. దీనికోసం నిత్యం ఫ్యాక్టరీలో అమోనియం నిల్వలను భారీగా ఉంచాల్సి వస్తుంది. అమోనియా గ్యాస్ ప్రమాదకరమైనదని, ఇది పొరపాటున లీక్ అయితే ప్రజల ప్రాణాలకు ఇబ్బంది అన్న భయం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని మున్నంగి సీఫుడ్స్ ఫ్యాక్టరీలో కొద్దిమొత్తంలో అమోనియా గ్యాస్ లీకై 20 మంది ఆసుపత్రి పాలైన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను సమీపంలోని గొంతేరు కాలువలోకి వదులుతారని, దీనివల్ల నరసాపురం, పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, మొగల్తూరు మండలాల్లోని 20 గ్రామాల్లో 30 వేల ఎకరాల ఆయకట్టుకు కాలుష్యం ముంపు ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నరసాపురం, భీమవరం, మొగల్తూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఉప్పుటేరులను ఆధారం చేసుకుని అనేక మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. పార్క్ నుంచి వెలువడే కాలుష్యం వల్ల మత్స్య సంపద పూర్తిగా క్షీణిస్తుంది. ఈ మండలాల్లో సుమారు 20 వేల మంది మత్స్యకారులు గొంతేరు కాలువపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల తమకు జీవనోపాధి పోతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కాలువల ద్వారా చేలకు చేరాల్సిన సాగునీటిలో రోజు 1.50 లక్షల లీటర్ల నీటిని ఫ్యాక్టరీ అవసరాలకు తరలించాల్సి ఉంటుంది. దీనివల్ల అటు కాలుష్యంతోపాటు ఇటు రైతులకు చేరాల్సిన సాగునీరు దుర్వినియోగం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఆక్వాపార్క్ నిర్మాణం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుందని, దీనివల్ల తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడి తదితర గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతారని ఆందోళన వ్యక్తం చేసున్నారు. ‘యనమదుర్రు’ గతే ఆక్వా పార్క్ నిర్మిస్తే యనమదుర్రు డ్రెయిన్‌కు పట్టిన గతే గొంతేరు కాలువకు పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భీమవరం పట్టణం మధ్యనుంచి ప్రవహించే యనమదుర్రు డ్రెయిన్ నీరు ఒకప్పుడు సాగునీటికి, తాగునీటికి ఉపయోగపడేది. ఈ డ్రెయిన్ మీద వేలాది మంది మత్య్సకార కుటుంబాలు ఉపాధి పొందేవి. 40 ఏళ్ల క్రితం పాలకోడేరు మండలం వేండ్రలో డెల్టా పేపర్ మిల్ ఏర్పాటైంది. దానినుంచి వెలువడే వ్యర్థాలన్నిటినీ యనమదుర్రు డ్రెయిన్‌లో వదలడం మొదలుపెట్టారు. ఆ తరువాత డ్రెయిన్‌ను ఆనుకుని అనేక పరిశ్రమలు వచ్చాయి. దీంతో కాలుష్యం పెరిగిపోయింది. ఇప్పుడు యనమదుర్రు డ్రెయిన్ దుర్వాసన వెదజల్లే మురుగు కాలువగా మారిపోయింది. తాజాగా నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల గొంతేరు కూడా నిర్జీవంగా మారుతుందనే భయం గొంతేరు కాలువ ఆయకట్టుదారుల్లో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు యనమదుర్రు డ్రెయిన్‌ను ప్రక్షాళన చేస్తామని తాజాగా ప్రకటించారు. ఆక్వా పార్క్ నుంచి వచ్చే వ్యర్థ జలాలను నేరుగా సముద్రంలో కలిసేలా పైపులైన్ వేయాలని ఆదేశించారు. ఒకపక్కన యాజమాన్యం అసలు కాలుష్యం రాదని, ఇప్పటివరకూ వాదిస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం పైప్‌లైన్ గురించి మాట్లాడుతోంది. దీంతో ప్రజల్లో ఈ ఫ్యాక్టరీపై అనుమానాలు మరింత పెరిగాయి. ఈ ప్రకటనతో తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఇక్కడ ఫ్యాక్టరీని అనుమతించేది లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం తుందుర్రు పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది -
ఆక్వాపార్క్ ఏర్పాటుతో మా పొట్ట కొట్టొద్దు
– చింతరేవులో మహిళలు వినూత్న నిరసన మొగల్తూరు : తుందుర్రులో ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేసి తమ పొట్ట కొట్టవద్దంటూ మంగళవారం చింతరేవుకు చెందిన మహిళలు ఉరికి వేలాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి గొంతేరు డ్రెయిన్‌పై ఆధారపడి వేటే జీవనాధారంగా జీవిస్తున్నామన్నారు. తల్లిలాంటి గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యం బారిన పడవేసేందుకు తుందుర్రు ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారన్నారు. పరిశ్రమ నుంచి ఏర్పడే రసాయనాల కారణంగా మత్స్య సంపదను కోల్పోయి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. ఆక్వా పరిశ్రమ పనులు తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి అనంతలక్ష్మి, మంగ, సన్యాసమ్మ, మొగదారమ్మ, చంద్రకళ,పెద్దింట్లమ్మ, వాటాల అనసూయ, కొల్లాటి కష్ణమూర్తి, బర్రి ధనలక్ష్మి, కొప్పాడ నాగలక్ష్మి, బర్రి వెంకటేశ్వర్లు, పోతాబత్తుల కష్ణమూర్తి, వాటాల నర్సింహరావు, వాటాల బాలకష్ణ, గంగరాజు పాల్గొన్నారు.