ఇంకా ఆంక్షల మధ్యే.. | no change the situation in tundurru | Sakshi
Sakshi News home page

ఇంకా ఆంక్షల మధ్యే..

Published Sun, Oct 23 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

ఇంకా ఆంక్షల మధ్యే..

ఇంకా ఆంక్షల మధ్యే..

144 సెక్షన్‌ ఎత్తివేతపై మీనమేషాలు  
సీఎం ప్రటించినా అమలుకాని వైనం 
ఆక్వాపార్క్‌ బాధిత గ్రామాల్లో దుస్థితి
విపక్షాలపై కొత్తరకం దుష్ప్రచారం 
 
ఆక్వాపార్క్‌ బాధిత గ్రామాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్‌ ఎత్తివేతపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈనెల 17న పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ గ్రామాల్లో 144 సెక్షన్‌ ఎత్తివేస్తామని, కేసుల ఎత్తివేత అంశాన్నీ పరిశీలిస్తామని ప్రకటించారు. అయితే ఆ దిశగా ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదు. దీనిపై ప్రశ్నిస్తే రెవెన్యూ, పోలీసు అధికారులు పొంతనలేని ప్రకటనలు ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఫలితంగా తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం 144 సెక్షన్‌ ఎత్తివేసి, పార్కును సముద్ర తీరానికి తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు. దీనివల్ల సుమారు 40 గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆ ప్రాంతవాసులు పోరాటానికి దిగారు. దీనిని జీర్ణించుకోలేని సర్కారు ఫుడ్‌పార్కు నిర్మితమవుతున్న తుందుర్రు, జొన్నలగరువు, కంసాలిబేతపూడి గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించింది. 600 పోలీసులను మోహరించింది. ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అరెస్ట్‌ చేసి, వారిపై హత్యాయత్నం కేసులు బనాయించింది. నరసాపురం, తణుకు సబ్‌జైలుకు తరలించింది. గ్రామీణులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించింది. పాశవిక చర్యలకు పాల్పడింది.  ఆ తర్వాత పోలీసు బందోబస్తు నడుమ ఫుడ్‌పార్కు నిర్మాణ సామగ్రిని అక్కడికి తరలించింది. ఆ ప్రాంతాన్ని ఇండో–పాక్‌ సరిహద్దులా మార్చేసింది.

ఆ గ్రామాల్లోకి ఎవరన్నా వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ఆధార్‌ కార్డు చూపించాల్సిదేనంటూ పోలీసులు హుకుం జారీ చేసే పరిస్థితిని తీసుకువచ్చింది. ఈ నిర్బంధకాండను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఎం రంగంలోకి దిగాయి. ఆ గ్రామాలకు వెళ్లేందుకు జిల్లాకు వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధితుల పక్షాన పోరాడేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం తరపున మాజీ మంత్రులు కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ ఈ గ్రామాలకు వచ్చారు. ఈ సమయానికి పోలీసులు ఆ గ్రామాల్లో కొంతవరకూ బలగాలను దాదాపుగా ఉపసంహరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహనరెడ్డి బాధితులకు సంఘీభావం ప్రకటించి, ఆ గ్రామాల్లో పర్యటించడంతో పోలీసులు అక్కడ పూర్తిగా బలగాలను ఉపసంహరించారు. అయితే అధికారికంగా 144 సెక్షన్‌ను మాత్రం కొనసాగిస్తున్నారు. పలువురిపై కేసులూ కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ నెల 17న పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆక్వాపార్క్‌ బాధిత గ్రామాల్లో 144 సెక్షన్‌ ఎత్తివేస్తామని ప్రకటించారు. అయినా ఆ దిశగా ప్రయత్నం జరగలేదు. దీంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే రెండుమూడురోజుల్లో ఎత్తివేస్తామని రెవెన్యూ అధికారులు, ఇప్పటికే పూర్తిగా ఎత్తేశామని పోలీసులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు.  ఇప్పటి వరకూ బాధితుల గోడు పట్టించుకోని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఇటీవల వరుసగా రెండుసార్లు ఆక్వాపార్క్‌ బాధిత గ్రామాలను సందర్శించేందుకు యత్నించారు. అయితే బాధితులు తిరస్కరించడంతో ఆయన వెనుకడుగు వేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చి 144 సెక్షన్‌ ఎత్తివేయాలని, ఆక్వాపార్కును సముద్రతీర ప్రాంతానికి తరలించాలని ఆ గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీని ఇక్కడ కట్టడానికి అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు.  
 
కొత్తరకం ప్రచారం 
ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోగా, బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్‌ సీపీపై విమర్శలకు దిగుతోంది. కొత్తరకం వాదనను తెరపైకి తెస్తోంది. గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్కుకు అరెంజ్‌ కేటగిరి ఇచ్చారని, సిమెంట్‌ ఫ్యాక్టరీలకు కాలుష్య నియంత్రణ మండలి రెడ్‌ కేటగిరి ఇస్తుందని, వాటితోపోలిస్తే ఫుడ్‌పార్కు నుంచి తక్కువ స్థాయిలోనే కాలుష్యం వస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే సిమెంట్‌ ఫ్యాక్టరీలను ఎక్కడైనా జనావాసాల మధ్య, పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేశారా అన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు.  పశ్చిమగోదావరి జిల్లాలోనే ఇటువంటి ఆక్వా ప్రాసెసింగ్‌ ప్లాంట్లు 17 ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఓ విషయాన్ని విస్మరిస్తోంది. అదేంటంటే విపక్షాలు ఈ పరిశ్రమలను వద్దనడం లేదు. జనావాసాల మధ్య, పచ్చని పొలాల మధ్య మాత్రం పెట్టవద్దని సూచిస్తున్నాయి. సముద్ర తీరంలో నిర్మించుకుంటే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నాయి.  అయితే సర్కారు ఈ విషయాన్ని  ప్రస్తావించకుండా దీనివల్ల కాలుష్యం ఉండదని మాత్రమే చెబుతోంది.
 
144 సెక్షన్‌ వెంటనే ఎత్తివేయాలి 
తుందుర్రు, జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో 144 సెక్షన్‌ను వెంటనే అధికారికంగా ఎత్తివేయాలి. దీంతోపాటు ఆక్వా ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.  తాము ఆ పరిశ్రమను ప్రజల అభీష్టం మేరకు అక్కడి నుంచి తరలించాలని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కన పెట్టి తాము పరిశ్రమలకు వ్యతిరేకం అన్నట్టు ప్రకటనలు ఇవ్వడం సరికాదు. ఈ ఫ్యాక్టరీ వల్ల  కాలుష్యం లేనప్పుడు ముఖ్యమంత్రి వ్యర్థ జలాలను సముద్రంలో కలిపేలా పైపులైన్‌ వేస్తామని ఎందుకు ప్రకటించారు. అంటే కాలుష్యం వస్తుందని ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నట్లే కదా.  ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం తమ మొండి వైఖరి విడనాడి ఫుడ్‌పార్కును తరలించాలి. 
                                                                                            -ఆళ్ల నాని, వైఎస్సార్‌ సీపీ, జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement