పల్లెలపై ప్రతాపం
పల్లెలపై ప్రతాపం
Published Sat, Jul 22 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM
తుందుర్రు పరిసర గ్రామాల్లో
పోలీసుల దమనకాండ
భారీగా మోహరింపు
144 సెక‌్షన్ కొనసాగింపు
ఇంటికో పోలీస్
భయం గుప్పెట ప్రజలు
గడపదాటేందుకూ వణుకు
ఎక్కడ చూసినా ఖాకీలే
ఆక్వా ఫుడ్‌పార్క్‌కు నిర్మాణ సామగ్రి తరలింపు కోసం తుందుర్రు పరిసర గ్రామాల్లో శుక్రవారం పోలీసులు భయోత్పాతం సృష్టించారు. లాఠీలు, తుపాకులు చేతబట్టి ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. బూటుచప్పుళ్లతో భీతావహ వాతావరణాన్ని తలపించారు. ప్రజలను బయటకు రాకుండా ఇళ్లలోనే నిర్బంధించారు. ఫలితంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే మగ్గారు. యుద్ధసామగ్రి తరలింపును తలపించేలా ఆక్వాఫుడ్‌పార్క్‌కు కంటెయినర్లలో సామగ్రిని దగ్గరుండి భారీబందోబస్తు మధ్య తరలించారు.
నరసాపురం, నరసాపురం రూరల్ /భీమవరం :
నరసాపురం మండలం కె.బేతపూడి, భీమవరం మండలం తుందుర్రు గ్రామాల మధ్యలో ఉన్న పల్లెల్లో శుక్రవారం పోలీసులు బీభత్సం సృష్టించారు. ప్రతి ఇంటి వద్దా మోహరించారు. ప్రజలను గడపదాటనివ్వలేదు. తుందుర్రులోని ఆక్వా ఫుడ్‌ఫ్యాక్టరీకి సామగ్రి తరలింపును దగ్గరుండి పర్యవేక్షించారు. గురువారం జరిగిన పోలీసుల దమనకాండకు నిరసనగా ప్రదర్శనకు పిలుపునిచ్చిన ప్రజాసంఘాలపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. నిర్ధాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో కుక్కి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 144 సెక‌్షన్, 30 యాక్ట్ అమల్లో ఉందంటూ భయోత్పాతం సృష్టించారు. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే నిలబడి కంటెయినర్ల తరలింపును చూస్తూ ఉండిపోయారు.
యుద్ధ యంత్రాలు తరలించినట్టుగా..
ఉదయం 11 గంటల నుంచీ యంత్రాలతో కంటెయినర్లు తుందుర్రు ఫ్యాక్టరీ వైపు బయలుదేరాయి. వీటిని భారీ బందోబస్తు మద్య పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేర్చారు. మత్స్యపురి నుంచి తుందుర్రు వరకూ భారీగా మొహరించారు. ఒక్కో కంటైనర్ వెనుకా ఓ డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. మొత్తం వంద మంది సిబ్బంది కంటెయినర్ల తరలింపులో నిమగ్నమయ్యారు. వీరుకాక అడుగడుగునా మోహరించేందుకు 800 మంది సిబ్బందిని వినియోగించినట్టు సమాచారం.వీరిని రాజధాని, అమరావతి, కృష్ణాజిల్లా నుంచి రప్పించినట్టు తెలుస్తోంది. ఇదంతా యుద్ధ సామగ్రి తరలింపు ప్రక్రియను తలపించింది. వీరవాసరం, మత్స్యపురి మీదుగా ఈ కంటెయినర్లను తరలించారు.
అడుగడుగునా తనిఖీలు
కంటెయినర్ల తరలింపు సందర్భంగా పోలీసులు గ్రామాల్లో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగించారు. దీంతో పనులపై బయలుదేరిన వారు వాయిదాలు వేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు.
నిరసనపైనా ఉక్కుపాదం..
గురువారం నాటి పరిణామాలకు నిరసనగా శుక్రవారం నరసాపురం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో సీపీఎం నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు మంతెన సీతారామ్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ సెంటర్‌లో ఆందోళన చేసే యత్నం చేశారు. అయితే అక్కడికి సిబ్బందితో కలిసి చేరుకున్న టౌన్ ఎస్సై కె.చంద్రశేఖర్ ఆందోళన విరమించాలని సూచించారు. దీనికి నిరసనకారులు అంగీకరించకపోవడంతో సీతారామ్‌తోపాటుగా తెలగంశెట్టి సత్యనారాయణ , బూడిద జోగేశ్వరరావు తదితరులను పోలీసులు లాక్కెళ్లి జీపులో పడేసి స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు ఉదయంపూట ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ, సీపీఎం నాయకుడు పొన్నాడ రాములను ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు.
పక్కా పోలీస్ వ్యూహం
యంత్రాలను ఫ్యాక్టరీలోకి తరలించడానికి పోలీసులు పక్కా వ్యూహంతో పని చేసినట్టుగా తెలుస్తోంది. బుధవారం నుంచే ఫుడ్‌పార్కు నిర్మాణ వ్యతిరేక కమిటీ నాయకులను, ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. వీరిని నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే మరికొంత మంది ముఖ్య నాయకులు పోలీసులకు చిక్కలేదు. దీంతో ఆ నాయకుల ఆధ్వర్యంలో గురువారం యంత్రాల తరలించే సమయంలో ఆందోళన జరిగింది. తోపులాటల్లో కొందరు కారం చల్లడం, కిరోసిన్ క్యాన్‌లు తీసుకురావడంతో సీన్ మారిపోయింది. దీనిని బూతద్దంలో చూపించి పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారనే విమర్శలు ఉన్నాయి. ఉద్యమకారులు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని పోలీసులు 353, 307, 143, 149, 108 తదితర బలమైన సెక‌్షన్లతో 14 మంది కీలక నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో మరికొంతమందిని చేర్చడానికి రంగం సిద్ధం చేశారు. ఇక ముందు జాగ్రత్త చర్యగా ఒకరోజు ముందు అదుపులోకి తీసుకున్న వారిపైనా పలు సెక్షన్‌లపై కేసులు నమోదు చేశారు. ఇలా బయట నాయకులు లేకుండా చేసి, ప్రజలను భయాందోళనకు గురిచేయడం ద్వారా ఫ్యాక్టరీలోకి యంత్రాలను పంపగలిగారు.
Advertisement
Advertisement