వద్దనడం లేదు.. తరలించమంటున్నాం | we dont say to stop the acqa park | Sakshi
Sakshi News home page

వద్దనడం లేదు.. తరలించమంటున్నాం

Published Mon, Nov 7 2016 11:02 PM | Last Updated on Tue, Oct 2 2018 6:48 PM

వద్దనడం లేదు.. తరలించమంటున్నాం - Sakshi

వద్దనడం లేదు.. తరలించమంటున్నాం

ఆక్వా పార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధుల మనోగతం
 ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
’తుందుర్రులో తలపెట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ వద్దనడం లేదు. కాలుష్య కారకమైన ఆ పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించమంటున్నాం. మమ్మల్ని అభివృద్ధి నిరోధకులుగా, తీవ్రవాదులుగా చూపించి దమనకాండకు దిగుతున్నారు. మాపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో బంధించారు. అయినా మేం భయపడటం లేదు. ఎన్ని సంవత్సరాలైనా జైళ్లలో మగ్గడానికి సిద్ధమే. మా త్యాగాలు వృథా కావు. మొన్నటివరకూ మూడు గ్రామాల ప్రజలు చేసిన ఉద్యమం ఇప్పుడు 30 గ్రామాల పోరాటంగా మారింది. అందరి నుంచి వచ్చిన మద్దతు ఉత్సాహాన్నిచ్చింది. మరీ ముఖ్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మాకు మద్దతుగా నిలవడం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపగలమన్న మనోధైర్యం వచ్చింది. 
 అరెస్టులు చేసి జైలుకు పంపినా మేం వెనకడుగు వేసేది లేదు. ప్రజల నుంచి. ముఖ్యంగా మా గ్రామాల మహిళల నుంచి వచ్చిన స్ఫూర్తితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా’మని గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు స్పష్టం చేశారు. జైలు నుంచి ఇటీవల విడుదలైన పోరాట కమిటీ నాయకుల మనోగతం వారి మాటల్లోనే..
 
 
 
బెదిరించారు
రెండున్నరేళ్లుగా ఇక్కడ ఇక్కడ నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నన్ను మర్యాదగా డ్రాప్‌ అవ్వమని బెదిరించారు. నేను వినకపోవడంతో అక్రమంగా, అన్యాయంగా హత్యాయత్నం సెక‌్షన్ల కింద కేసులు పెట్టారు. మా నాన్న గారికి అమ్మ ఆపరేషన్‌ చేయించి తీసుకువచ్చింది. ఇంట్లో ఆయనకు సపర్యలు చేస్తూ ఉంది. నన్ను జైలుకు పంపడంతో కుటుంబ సభ్యులంతా ఉద్వేగానికి లోనయ్యారు. నేను జైలులో ఉండగా ఆక్వాపార్క్‌ యాజమాన్యం కొంతమంది మఽధ్యవర్తులను పంపించి కాంప్రమైజ్‌ కోసం ప్రయత్నించింది. నేను ఒప్పుకోకపోవడంతో మా అమ్మను కూడా అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. 307 సెక‌్షన్‌ కేసులో అయినా 14 రోజుల్లో బెయిల్‌ రావాల్సిన మాకు 53 రోజుల వరకూ బెయిల్‌ రాకుండా అడ్డుకున్నారు. విజిటర్స్‌పై కూడా ఆంక్షలు విధించారు. జైలులో ఉన్న వారందరికీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు ఫోన్‌ ఇచ్చేవారు. మాకు మాత్రం ఆ అవకాశం లేకుండా చేశారు.
  ఆరేటి వాసు, కన్వీనర్, ఆక్వా పార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ
 
 
నిద్రలేని రాత్రులు గడిపాను
నా భర్త పేషెంట్‌గా ఉన్నారు. ఆయనను చూసే దిక్కులేదు. పగలూ, రాత్రి నిద్రలేకుండా కాలం వెళ్లదీశాను. ఆయనను ఆసుపత్రికి తీసుకవెళ్లాల్సి ఉంది. నేను, నా కుమారుడు జైలులోనే ఉన్నాం.ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లలేని దుస్థితిలో ఉండిపోయాం. పాలకొల్లులో నిర్వహించిన ధర్నాలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు అరెస్టు చేశారు. గ్రంధి శ్రీనివాస్‌ దగ్గరకి వెళ్లి చెప్పుకునేంత నాయకురాలివి అయిపోయావా అంటూ డొక్కల్లో పొడిచి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. చంద్రబాబుకు ఓటు వేసినందుకు మాకు ఈ తిప్పలా. అడపడుచుల ఉసురుపోసుకుంటాడని చెప్పి జీపు ఎక్కాను. అక్కడికి వెళ్లాక గాజులు తీసేయి, గొలుసులు తీసేయమంటూ వేధించారు. వైఎస్‌ జగన్‌ నా దగ్గరికి వచ్చి ఓదార్చారు. నా పెద్దకొడుకు నా దగ్గరకు వచ్చినట్టు అనిపించి ధైర్యం వచ్చింది. ఫ్యాక్టరీ ఆపివేయిద్దామని ఆయన హామీ ఇచ్చారు. ఒక్క సత్యవతిని అరెస్ట్‌ చేశారు. వేలాది మంది సత్యవతులు రోడ్డెక్కుతారని ఫ్యాక్టరీ యాజమాన్యం ఊహించలేదు.
 ఆరేటి సత్యవతి, ఉద్యమకారిణి
 
 
ఆఫర్లిచ్చారు
 
తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మద్య ఆక్వా పుడ్‌ పార్క్‌ పెట్టడం వల్ల గ్రామాల్లో జల, వాయు కాలుష్యం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడతారని ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. పోరాట కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ప్రభుత్వం మా పట్ల కక్షపూరితంగా వ్యవహరించింది. మా బంధువులను బెదిరించారు. మాకు ఆఫర్లు కూడా ఇచ్చారు. అయినా మేం దేనికీ లొంగలేదు. అందుకే మాపై అక్రమ కేసులు పెట్టారు. 307 కేసు పెట్టడమే కాకుండా మేం బయటకు రాకుండా ఉండటం కోసం పదే పదే పెండింగ్‌ ట్రైల్‌ పేరుతో పీటీ వారెంట్లు వేశారు. బెయిల్‌ ప్రొసీడింగ్స్‌ సమయంలో కూడా ఏడు కేసులు కట్టి పీటీ వారెంట్లు వేయడానికి ప్రయత్నం చేసినా మేజిస్ట్రేట్‌ అంగీకరించకపోవడంతో బయటకు వచ్చాం. ఇప్పుడు కూడా తప్పుడు ఫిర్యాదులతో కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్థాన్‌ బోర్డర్‌ తరహాలో ఇంకా 144 సెక‌్షన్‌ కొనసాగిస్తూనే ఉన్నారు.
  ముచ్చర్ల త్రిమూర్తులు, పోరాట కమిటీ ప్రతినిధి
 
 
ఈ ప్రభుత్వ పతనం తప్పదు
నేను కంసాలి బేతపూడి గ్రామ పెద్దగా ఉన్నాను. నీటి సంఘం డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. ఈ కంపెనీ పెట్టడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతుంది. అసలే మాది శివారు గ్రామం. నీరు పూర్తిగా రాదు. ఇటువంటి పరిస్థితిలో ఫ్యాక్టరీ వద్దని కోరాం. నేను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుటి నుంచి అందులోనే పని చేస్తున్నాను. నరసాపురం నియోజకవర్గంలో ఎక్కడా రానంత మెజారిటీ మా గ్రామం నుంచి ఇచ్చాం. విశ్వనాథరాజు భార్య, రంగరాజు భార్య కనీసం ఓటు వేయడానికి కూడా రారు. అటువంటి వారికి మద్దతు ఇచ్చి, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే మమ్మల్ని అరెస్టు చేయడానికి కూడా వెనుకాడలేదు. నా తమ్ముడి కూమారుడి పెళ్లి. కనీసం వధూవరులను ఆశీర్వదించే అవకాశం లేకుండా చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలు నెగ్గారంటే మేం పనిచేయబట్టే. మమ్మల్ని బయటకు రాకుండా హింస పెట్టారు. మీ ఉద్యమం ఎంత, మీరెంత అంటూ పోలీసులు దారుణంగా మాట్లాడారు. అన్నం పెట్టిన చేతిని కరిచినట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. ఇంకా ఆ ఫ్యాక్టరీని కట్టాలనుకుంటే, ముందుగా నన్ను కాల్చి చంపి కట్టుకోండి.
 సముద్రాల వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్‌ నేత
 
 
పనికి వెళ్తుంటే అరెస్ట్‌ చేశారు
మాది జొన్నలగరువు దళితపేట. మా ఇంటి ఎదురుగానే ఫ్యాక్టరీ కడుతున్నారు. అందుకే వద్దన్నాం. నేను యూత్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నాను. పనికి వెళ్తేగాని పొట్టగడవని పరిస్థితి. ఆ రోజు భీమవరంలో పనికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. నన్ను అరెస్టు చేశామన్నారు. ఏఎస్సైకి ఫోన్‌ చేసి నా పేరు చెప్పగా, కేసులో పేరు లేదన్నారు. అయినా పోలీసులు వినకుండా నన్ను అరెస్ట్‌ చేసి లోపల వేశారు. ఽఅక్రమ కేసు బనాయించారు. నా భార్య జైలుకు వచ్చి చాలా ఏడ్చింది. మూడు రోజులు భోజనం కూడా చేయలేదు. నేను జైలులో ఉన్నన్ని రోజులు కుటుంబం గడవక నా భార్య, ఇద్దరు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు.
 కొయ్యే మహేష్, జొన్నలగరువు
 
బాధ లేదు.. భయపడుతున్నాం
మేం చేసేది న్యాయమైన పోరాటం. అందుకే బాధపడటం లేదు. అయితే మళ్లీ అరెస్టులు చేస్తారన్న భయం వెంటాడుతోంది. పిల్లల్ని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నా ఆధార్‌ కార్డు అడిగారు. ఇంతకంటే దారుణం మరేమైనా ఉంటుందా. మా వారిని జైలులో పెట్టినప్పుడు మేం పడిన బాధ అంతాఇంతా కాదు. ఇద్దరు చంటిబిడ్డలతో ఎన్నో అవస్థలు పడ్డాను. తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
 కొయ్యే కీర్తన, మహేష్‌ భార్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement