పచ్చని సీమలో పోలీస్ రాజ్యం
గోదావరి మెగా అక్వాఫుడ్‌పార్క్ వల్ల భూగర్బ జలాలు కలుషితం అవుతాయని, ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా గొంతేరు డ్రెయిన్ కలుషితం అవుతుందని తుందుర్రు, సమీపంలోని 30 గ్రామాల ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వం అణచివేత ధోరణిని ఎంచుకుంది. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టింది. 37 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, ఏడుగురిని గత నెల 12న జైళ్లకు తరలించింది. వారికి ఇప్పటికీ బెయిల్ రాకుండా అడ్డుకోవడంతో వారంతా జైళ్లలోనే మగ్గుతున్నారు.
ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి బుధవారం తుందుర్రు రానున్నారు. ఆయన రాక నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుందని భయపడిన ముఖ్యమంత్రి గడచిన రెండు రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యతను వారిపై పెట్టారు. కాలుష్యం రాకుండా ఆక్వా పార్క్‌లో కలుషిత నీటిని శుద్ధి చేసి పైపులైన్ ద్వారా సముద్రం వరకూ తరలించాలని ఆదేశించారు. ముందుగా పైపులైన్ పనులను ప్రారంభించి గ్రామస్తులకు నచ్చచెప్పాలని ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. అయితే తమ ప్రాంతంలో అక్వా పార్క్‌ను ఎట్టిపరిస్థితిల్లో కట్టనివ్వమని, అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. నిన్నటివరకూ ఆ పరిశ్రమ నుంచి సున్నా శాతం (జీరో పర్సంట్) కాలుష్యం మాత్రమే వెలువడుతుందని చెప్పి, ఇప్పుడు పైప్‌లైన్ వేస్తామంటున్నారంటే కాలుష్యం ఉన్నట్టే కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చేపల చెరువుల కోసమని చెప్పి భూములు కొన్న యాజమాన్యం ఆ తర్వాత మెగా ఫుడ్‌పార్క్ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడ ఆక్వా పార్క్ నిర్మిస్తే ఏడాదికి మూడు పంటలతో సస్యశ్యామలంగా ఉన్న ఆ పల్లెలు బీడువారతాయని, తాము అక్కడి నుంచి పొట్ట చేత్తో పట్టుకుని వలస వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన తుందుర్రు, పరిసరాల్లోని 30 గ్రామాల్లో వ్యక్తం అవుతోంది. కాలుష్యాన్ని వెదజల్లే ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని, సముద్ర తీరంలో ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ ప్రజలంతా రోడ్డెక్కారు. ఆక్వా పార్క్ నిర్మించవద్దంటూ 21 గ్రామ పంచాయతీలు తీర్మానం కూడా చేశాయి.
ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను సమీపంలోని గొంతేరు కాలువలోకి వదులుతారని, దీనివల్ల నరసాపురం, పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, మొగల్తూరు మండలాల్లోని 20 గ్రామాల్లో 30 వేల ఎకరాల ఆయకట్టుకు కాలుష్యం ముంపు ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నరసాపురం, భీమవరం, మొగల్తూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఉప్పుటేరులను ఆధారం చేసుకుని అనేక మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. పార్క్ నుంచి వెలువడే కాలుష్యం వల్ల మత్స్య సంపద పూర్తిగా క్షీణిస్తుంది. ఈ మండలాల్లో సుమారు 20 వేల మంది మత్స్యకారులు గొంతేరు కాలువపై ఆధారపడి జీవిస్తున్నారు.
ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల తమకు జీవనోపాధి పోతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కాలువల ద్వారా చేలకు చేరాల్సిన సాగునీటిలో రోజు 1.50 లక్షల లీటర్ల నీటిని ఫ్యాక్టరీ అవసరాలకు తరలించాల్సి ఉంటుంది. దీనివల్ల అటు కాలుష్యంతోపాటు ఇటు రైతులకు చేరాల్సిన సాగునీరు దుర్వినియోగం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఆక్వాపార్క్ నిర్మాణం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుందని, దీనివల్ల తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడి తదితర గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతారని ఆందోళన వ్యక్తం చేసున్నారు.
తాజాగా నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల గొంతేరు కూడా నిర్జీవంగా మారుతుందనే భయం గొంతేరు కాలువ ఆయకట్టుదారుల్లో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు యనమదుర్రు డ్రెయిన్‌ను ప్రక్షాళన చేస్తామని తాజాగా ప్రకటించారు. ఆక్వా పార్క్ నుంచి వచ్చే వ్యర్థ జలాలను నేరుగా సముద్రంలో కలిసేలా పైపులైన్ వేయాలని ఆదేశించారు. ఒకపక్కన యాజమాన్యం అసలు కాలుష్యం రాదని, ఇప్పటివరకూ వాదిస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం పైప్‌లైన్ గురించి మాట్లాడుతోంది. దీంతో ప్రజల్లో ఈ ఫ్యాక్టరీపై అనుమానాలు మరింత పెరిగాయి. ఈ ప్రకటనతో తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఇక్కడ ఫ్యాక్టరీని అనుమతించేది లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి బుధవారం తుందుర్రు పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది