ఎండాకాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రిళ్లు చల్లని గాలికోసం ఆరుబయట నిద్రించేవాళ్లు కొందరు. పిల్లలకు పరీక్షలు పూర్తయ్యాయని విహార యాత్రలకు వెళ్లేవారు మరికొందరు. ఉద్యోగ రీత్యా బదిలీలు కావడంతో దంపతుల్లో ఒకరు వారం పాటు కొత్త ప్రదేశాల్లో ఉండాల్సిన పరిస్థితి. కారణం ఏదైనా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చిన్నపాటి అప్రమత్తత అవసరం. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఇంటిపై పోలీసుల నిఘా ఉంటుంది. లేకుంటే దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకుపోతారు.
చిత్తూరు అర్బన్:పోలీసులు కొత్తగా తీసుకువచ్చిన విధానమే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్). స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక నంబర్ వస్తుంది. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు యాప్‌లో రిక్వెస్ట్ ప్రొటెక్షన్‌ను క్లిక్ చేస్తే పోలీసులు ప్రత్యేక సీసీ కెమెరాలను అమరుస్తారు. ఈ కెమెరా యజమాని మొబైల్‌కు, జిల్లా పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానవుతుంది. ఎవరైనా ఇంటి ముందు కనిపించినా, గేటు తీసినా అలారమ్ మోగుతుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను పట్టుకుంటారు.
బయట నిద్రిస్తే..
ఏసీలు, ఫ్యాన్లు ఉన్నా వేసవిలో చల్లటి గాలి కోసం చాలా మంది ఆరుబయట పడుకుంటూ ఉంటారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం టెర్రస్‌పై నిద్రించాలనుకుంటే తలుపులకు తప్పనిసరిగా తాళం వేయాలి. బంగారు ఆభరణాలు ధరించకూడదు. బీరువాలోని లాకర్‌లో భద్రపరచాలి. వీలైనంత వరకు నగలను బ్యాంకుల్లో దాచుకోవాలి. కిటికీల పక్కన చొక్కా, ప్యాంటులను తగిలించరాదు. ఒకవేళ ఉంచినా వాటిలో నగదు పెట్టకూడదు. వీలైనంత వరకు అన్ని కిటీకీలు, తలుపులు మూసివేయాలి. ఇంటి బయట బెడ్ ల్యాంపు వెలుగుతూ ఉండాలి. పడుకునేచోట పక్కనే టార్చిలైటును పెట్టుకోవాలి.
ఉద్యోగస్తులు ఇలా..
ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లోని ఉద్యోగులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మగవారు ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లినప్పుడు మనకు తెలియని వారిని ఇంట్లోకి రానివ్వకూడదు. అపరిచితులు ఎవరైనా వస్తే గేటు బయట నుంచి పంపించేయాలి. తలుపులు తీయకుండానే, గ్రిల్ లోపలి నుంచే సమాధానం చెప్పాలి. పలు రకాల వస్తువులు, గిఫ్ట్ వస్తువులు అంటూ వచ్చే వారితో మాట్లాడకపోవడం ఉత్తమం. వారితో బేరసారాలు చేస్తూ కూర్చోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. మార్కెటింగ్ పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్ని నమ్మకూడదు. ఒకవేళ అపరిచితులు మార్కెటింగ్ పేరుతో విసిగించినా, ఇబ్బంది పెట్టినా తక్షణం 100 నంబర్‌కు ఫోన్ చేయా లి. లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9440900005కు ఇంటి బయట ఉన్న వారి ఫొటో తీసి పంపాలి.
సహకరించండి...
వేసవిలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు పోలీసుశాఖకు సహకరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చోరీలు జరగవు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో మేమే కెమెరాలు పెట్టి దొంగల్ని పట్టుకుంటాం. ఒకవేళ వద్దనుకుంటే కంపెనీలు, సంపన్నులు వాళ్లే సొంతంగా కెమెరా పెట్టుకుని పోలీసుల కంట్రోల్ రూమ్‌కు కాకుండా వాళ్ల ఫోన్‌లకే అనుసంధానం చేసుకోండి. ఊర్లకు, విహారయాత్రలకు వెళ్లాలంటే ఇంట్లో ఒకర్ని ఉంచండి. అలాకాకపోతే తాళం వేసిన ఇంటి బయట రాత్రుళ్లు లైట్లు వెలిగేలా చూడాలి. రెండు, మూడు జత చెప్పులను తలుపు బయట వదిలివెళ్లడం చేయాలి. ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదును పెట్టకండి. సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చి సహకరించండి.– ఐ.రామకృష్ణ, డీఎస్పీ, చిత్తూరు క్రైమ్
Comments
Please login to add a commentAdd a comment