ఏడీ కార్యాలయం తనిఖీ
మహబూబ్‌నగర్ న్యూటౌన్: భూ కొలతలు, రికార్డుల శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర సర్వే సెటిల్మెంటు, భూ రికార్డుల శాఖ కమిషనర్ శశిధర్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఏడి శ్యాంసుందర్‌రెడ్డి కృష్ణా పుష్కరాల విధులు నిర్వహిస్తున్నారని సర్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి కమిషనర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా పలు శాఖా పరమైన విషయాలపై చర్చించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెలుగు, ఉర్దూ, మరాఠీలలో ఉన్న పాత రికార్డులను పరిశీలించారు. బౌండ్రీ వివాదాలు, సబ్‌డివిజన్ సమస్యల పరిష్కారంలో అవలంబిస్తున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని పాత రికార్డులు పరిశీలించి మరాఠీ బాషలో అంకెలు ఉండటానికి కారణాలు తెలుసుకున్నారు. సేత్వార్, టీపన్లు పరిశీలించారు. టీపన్లు అందుబాటులో లేని పక్షంలో సర్వే ఎలా నిర్వహిస్తారని సర్వేయర్లను ఆరా తీశారు. పక్కా బుక్, గ్రామ నక్షా ఆధారంగా సర్వే చేస్తామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఏడీ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు.