చైనా చెట్టు బెరడుతో క్లోమ కేన్సర్‌కు చికిత్స!
వాషింగ్టన్: చైనాలో నొప్పి నివారణిగా ఉపయోగించే ‘అముర్ కార్క్’ చెట్టు బెరడుతో క్లోమ కేన్సర్‌కు చికిత్స చేయవచ్చని ప్రవాసాంధ్ర శాస్త్రవేత్త అద్దంకి ప్రతాప్ కుమార్ నేతృత్వంలోని బృందం కనుగొంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, హెల్త్ సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ అయిన ప్రతాప్ కొన్నేళ్లుగా అముర్ బెరడుతో కేన్సర్‌కు మెరుగైన చికిత్స కోసం పరిశోధనలు చేస్తున్నారు. ఈ చెట్టు బెరడుతో ప్రోస్టేట్ కేన్సర్‌కు చికిత్స చేయవచ్చని 2011లోనే కనుగొన్న ఆయన తాజాగా క్లోమ కేన్సర్‌కూ సమర్థంగా చికిత్స చేయవచ్చని గుర్తించారు. సాధారణంగా క్లోమ కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్‌కు సంబంధించిన కణతులు ఏర్పడినప్పుడు వాటి చుట్టూ కణజాల తంతువులు అధికంగా ఉత్పత్తి అయి పొరలా ఏర్పడుతుంటాయి.
ఫైబ్రోసిస్ అనే ఈ ప్రక్రియ వల్ల కేన్సర్ కణాలను నిర్మూలించాల్సిన మందులు ఆ కణతుల్లోకి చొచ్చుకుపోలేవు. దీంతో కేన్సర్ కణాల నిర్మూలన కష్టం అవుతోంది. అయితే అముర్ చెట్టు బెరడు నుంచి సేకరించిన ఔషధం కేన్సర్ కణతుల చుట్టూ ఫైబ్రోసిస్ ప్రక్రియ జరగకుండా అడ్డుకుంటుందని, దీంతో ఔషధాలు సమర్థంగా పనిచేసి చికిత్స విజయవంతం అవుతుందని ప్రతాప్ వెల్లడించారు. దీనిని క్యాప్సూల్స్ రూపంలోనూ ఉపయోగించవచ్చు కాబట్టి.. దుష్ర్పభావాలు ఏమీ ఉండవని తెలిపారు. ఔషధ పరీక్షల్లో భాగంగా 24 మంది రోగుల్లో ఈ ఔషధాన్ని పరీక్షించగా.. అందరిలోనూ చికిత్స విజయవంతం అయిందని పేర్కొన్నారు. వీరి పరిశోధన వివరాలు ‘క్లినికల్ కేన్సర్ రీసెర్చ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.