వారికి సింగపూర్ బంపర్ ఆఫర్
సింగపూర్ : కరోనా మహమ్మారి సమయంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. ఈ సంక్షోభ సమయంలో బిడ్డను కనబోతున్న తల్లిదండ్రులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వారికి అదనపు సహాయాన్ని అందజేయనున్నామని ఆ దేశ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి హెంగ్ స్వీ కీట్ సోమవారం (అక్టోబర్ 5) వెల్లడించారు. ప్రజల ఆదాయ క్షీణత సంతానోత్పత్తి రేటును మరింత దెబ్బతీసే అవకాశం ఉందనే అంచనాలతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనా వ్యతిరేక పోరాటంలో తాము స్థిరంగా ఉన్నామని ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రకటన విడుదల చేశారు.
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగ తొలగింపులు, వేతన కోతల మధ్య ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం, బిడ్డ కోసం చూస్తున్న తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడానికి సింగపూర్ ఒక్కసారి చెల్లింపును అందించనుంది. ఇది ప్రస్తుతం అమలు చేస్తున్న బేబీ బోనస్‌లకు అదనమని మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. అయితే బేబీ బోనస్ కింద ఇప్పటికే అర్హతగల తల్లిదండ్రులకు 10వేల డాలర్ల వరకు ప్రయోజనాలను అందిస్తున్నసంగతి తెలిసిందే.
కోవిడ్-19 సమయంలో ఉపాధి లేక, ఆదాయాలు క్షీణించడంతో భార్యభర్తలు, పిల్లల్ని కనే ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నారనే నివేదికల మధ్య సింగపూర్ సత్వర చర్యలకు దిగింది. సింగపూర్ సంతానోత్పత్తి రేటు 2018లో ఎనిమిదేళ్ల కనిష్టాన్ని తాకింది. కాగా దేశంలో ఇప్పటివరకు 57 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా మరణించిన వారి సంఖ్య 27.