‘గౌతమి’ని నిలిపేసిన ప్రయాణికులు
- అదనపు బోగీల కోసం ఆందోళన
- కాకినాడలో గంటపాటు పట్టాలపై బైఠాయింపు
కాకినాడ, న్యూస్‌లైన్: అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి కాకినాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలు ముందు ప్రయాణికులు బైఠాయించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సాంబమూర్తినగర్ పోర్టు రైల్వే స్టేషన్ వద్ద ఈ సంఘటన జరిగింది. సీమాంధ్రలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి జిల్లా వాసులు వేలాదిగా వచ్చారు. వారంతా గురువారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. స్టేషన్ సిబ్బంది టిక్కెట్లు అధికంగా ఇవ్వడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది.
దీంతో ఉన్న బోగీలు కిక్కిరిసిపోయాయి. దీంతో మిగిలినవారంతా అదనపు బోగీలు ఏర్పాటు చేయాలంటూ సుమారు గంటపాటు రైలును నిలిపేశారు. ఓటు వేసేందుకు వచ్చిన తాము తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గౌతమి ఎక్స్‌ప్రెస్‌కు 24 బోగీలున్నాయని, వీటిలో 3 మాత్రమే సెకండ్ క్లాస్ బోగీలని రైల్వే అధికారి మురళీకృష్ణ తెలిపారు. అదనపు బోగీల ఏర్పాటు తమ పరిధిలో లేదన్నారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే అధికారులతో మాట్లాడామని, ప్రయాణికులను రిజర్వేషన్ బోగీల్లో తరలించేందుకు అనుమతించారని చెప్పారు. చివరకు రైలు బయలుదేరడంతో కొంతమంది కిక్కిరిసిన బోగీల్లోనే ప్రయాణించగా, మరికొందరు వెనుదిరిగారు.