కొత్త రిజిస్ట్రార్‌కు పెనుసవాళ్లు
రెండేళ్లుగా అస్తవ్యస్త పాలన
అనుభవం లేని కొత్త రిజిస్ట్రార్
వర్సిటీకి నిధుల వరద పారనుందా?
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీనూతన రిజి స్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన కొత్త దేవరాజులునాయుడు ఎదుట అనేక సవాళ్లు ఉన్నారుు. బాధ్యతలు స్వీకరించిన నూతన రిజిస్ట్రార్‌పై యూనివర్సిటీలోని అన్ని వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి.
అస్తవ్యస్త పాలన
ఎస్వీయూలో ఇప్పటివరకు పనిచేసిన అధికారుల హయాంలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. సంవత్సరకాలంగా వర్సిటీలో లెక్కలేనన్ని ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. గత విద్యా సంవత్సరమంతా బంద్‌లతోనే సరి పోయింది. ఒక వైపు సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతుంటే, మరోవైపు అంతకు మించిన ఉద్యమాలు క్యాంపస్‌లో నడిచాయి.
2013-14 విద్యా సంవత్సర ఆరంభంలోనే మహిళా హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలన్న అంశంపై మొదలైన ఆందోళనలు ఏడాది పొడవునా కొనసాగాయి. విభాగాల విలీనంతో ఈ ఆందోళనలు ఎక్కువయ్యాయి. అనంతరం అధ్యాపక పోస్టుల భర్తీ అంశంలో చోటు చేసుకున్న వివాదాలు, అధికారులపై వచ్చిన ఆరోపణల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని చంద్రబాబునాయుడే గవర్నర్‌కు లేఖ రాశారు.
అనుభవ లేమి
ఎస్వీయూ నూతన రిజిస్ట్రార్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన దేవరాజులుకు ఎలాంటి పరిపాలన అనుభవమూ లేదు. కనీసం విభాగాధిపతిగా కూడా పనిచేయలేదు. ఈయనకు క్యాంపస్‌లో పెద్దగా ప్రజాసంబంధాలు లేవు. విద్యార్థులతో, సంఘాలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎదుర్కొన్న సందర్భాలు లేవు. కేవలం సామాజిక బలం, ప్రభుత్వ ఆశీస్సులు ఉన్నాయి.
నిధుల వరద పారిస్తారా?
ఎస్వీయూ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. వర్సిటీని నడపాలంటే ఏడాదికి సుమారు 300 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వం రూ.100 కోట్లు మాత్రమే గత ఏడాది ఇచ్చింది. ఈ ఏడాదికి రూ.265 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఈ ఆర్థిక లోటును వర్సిటీయే సొంతంగా సమకూర్చుకోవాల్సిందే. కొత్త రిజిస్ట్రార్ ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు తెస్తారో వేచి చూడాలి.
వేతనాలు పెరిగేనా?
ఎస్వీ యూనివర్సిటీలో ఎన్ఎంఆర్ ఉద్యోగులు, ఫుడ్‌బేసిక్ వర్కర్లు, అకడమిక్ కన్సల్టెంట్లు, అరకొర వేతనాలతో పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో కొత్త అధికారులు రావడంతో తమ వేతనాలు పెరుగుతాయని, తమకు మంచి జరుగుతుందని ఆశతో ఉన్నారు. రిజిస్ట్రార్ వారి ఆశలను ఏ మేరకు తీర్చగలరో వేచిచూడాలి.
కోర్టు కేసులు
ఎస్వీయూకు సంబంధించి అనేక కోర్టు కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వీటికోసం తరచూ హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రార్ ఒక వైపు పాలన, మరో వైపు కోర్టు వ్యవహారాలు చక్క పెట్టాల్సి ఉంది. ఈ సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.