Adireddy appa rao
-
జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్
సాక్షి, తూర్పుగోదావరి: జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్స్ డైరెక్టర్లుగా ఉన్న ఆదిరెడ్డి, వాసులను అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి చిట్స్ వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై సీఐడీకి కాకినాడ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడినట్టు, చిట్స్ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్టు, ఫాల్స్ డిక్లరేషన్‌ను అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించారు. 49 సబ్స్కైబర్ల వివరాలను తనిఖీ చేసి ఆధారాలిచ్చారు. డాక్యుమెంట్ల నిర్వహణలోనూ ఆక్రమాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా చిట్‌ఫండ్ నిధులతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించడంతో 1982 చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. దీంతో, జగజ్జనని చిట్‌ఫండ్స్ డైరెక్టర్లు ఆదిరెడ్డి, వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఇక, గత నవంబర్ నుంచి రాష్ట్రంలో చిట్‌ఫండ్ కంపెనీల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలు చేపట్టింది. మార్చి 16న జగజ్జనని చిట్స్ సహా రాష్ట్రంలో పలు చిట్‌ఫండ్ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా సీఐడీకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. ఇది కూడా చదవండి: కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు.. -
గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!
సాక్షి, రాజమహేంద్రవరం: ఇది మల్లెల వేళయని...వెన్నెల మాసమని...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ..విందులు చేసింది...సుఖదుఃఖాలు సినిమాలో దేవులపల్లి రాసిన పాట ఇది.. టీడీపీలో యువ నాయకుడొకరు ఇదే పల్లవి అందుకున్నారు. దీనిపై రాజకీయంగా రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఫలితంగా చాలా కాలంగా పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు మరోసారి తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఆ పార్టీలో ఎప్పుడూ హాట్ సీట్‌గా పేరున్న రాజమహేంద్రవరం సిటీ కోసం ఇప్పటి నుంచే పోరు మొదలైనట్టుగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఈ విషయంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొరుగున అదే పార్టీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రతి ఎన్నికల సందర్భంలో సిటీ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈయనకు పోటీగా ఆదిరెడ్డి అప్పారావు వర్గం టిక్కెట్టు కోసం పోటీ పడుతూ ఉంటుంది. ఇది పార్టీలో సహజ పరిణామంగానే చెప్పుకుంటారు. అటువంటిది సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా రాజమహేంద్రవరం సిటీ నుంచి తానే పోటీ చేస్తానని సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త.. ఆ పార్టీ నాయకుడు వాసు బుధవారం హఠాత్తుగా ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక కారణమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పటి నుంచే టీడీపీలో సీట్ల సిగపట్లు మొదలయ్యాయంటున్నారు. చదవండి: (Atmakur Byelection: బీజేపీ బేజార్.. అభ్యర్థి ఎంపికే మైనస్) ఆధిపత్య పోరు రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్‌లో సిటీ నియోజకవర్గ పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే భర్త వాసు బయటకు వచ్చి మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా ఆ పార్టీలో పరిణామాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే వాతావరణం ఈ ప్రకటనతో కనిపిస్తోంది. గోరంట్ల రూరల్‌కు వెళ్లిపోయినా సిటీపైనే ఆయన దృష్టి ఉంది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని వేరేవారిని ప్రోత్సహించారనే ఆవేదన ఆయనలో మొదటి నుంచి ఉంది. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెళ్లగక్కుతూనే ఉంటారు. ఏడాదిన్నర క్రితం సిటీలో తమ వర్గానికి చెందిన వారికి పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారనే ఆవేదనతో పార్టీ, రాజకీయాలకు దూరమవుతున్నట్టు మీడియాకు తెలియచేసి హైడ్రామా సృష్టించారు. చివరకు పార్టీ పదవులు తమ వారికి సాధించుకుని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. చదవండి: (జనసేన వారు 62 మంది.. టీడీపీ వారు 21 మంది) టీడీపీలో అంతర్యుద్ధం సిటీ నియోజకవర్గంలో తనకంటూ ఉన్న మాజీ కార్పొరేటర్లతో ఆదిరెడ్డి వర్గానికి పోటీగా గోరంట్ల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవన్నీ నడుస్తోన్న క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా సోదరుడు శాంతారామ్ తనయుడు రవిరామ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. అంతటితోనే ఆగకుండా సిటీలో తన పుట్టిన రోజు వేడుకలను విస్తృతంగా నిర్వహించి రాజకీయాలకు తానేమీ దూరం కాలేదని స్పష్టం చేశారు. ఇంతకంటే ముందుగానే గోరంట్ల వైరి పక్షమైన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు కూడా రాజకీయ వారసుడిగా తనయుడు వాసును ప్రకటించడంతో టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి నుంచి చాపకింద నీరులా సాగుతోన్న ఈ రెండు వర్గాల అంతర్గత పోరు వాసు తాజా ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకటన వెనుక వ్యూహం వాసు ప్రకటన వెనుక రాజకీయ దూరాలోచన ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి ఆదిరెడ్డి కుటుంబం నుంచి పోటీకి పెడతారని ఇటీవల ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిని గోరంట్ల వర్గం భుజానకెత్తుకుని చేస్తోందని ఆదిరెడ్డి వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. సిటీ కోసం ఆరాటపడుతోన్న గోరంట్ల వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంలో భాగంగానే వాసు తాజా ప్రకటన అంతరార్థమని తెలుస్తోంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ నుంచే పోటీ చేస్తామని, ఎంపీగా వెళ్లే ప్రసక్తే లేదని వాసు తేల్చి చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భవాని ఉండగా ఆమెను కాదని భర్త వాసు పోటీ చేస్తాననడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమె పనితీరు సమర్థవంతంగా లేదనా, లేక రాజకీయాల్లో రాణించలేక పోతున్నారనా.. వీటిలో ఏ కారణంతో వాసు పోటీకి సై అంటున్నారని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆమెను బలపరిచాను, వచ్చే సారి ఆమె నన్ను బలపరుస్తుంది అని వాసు మీడియా వద్ద ముక్తాయించడం గమనార్హం. దీనిపై గోరంట్ల వర్గం ఏ రకమైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుందో వేచి చూడాల్సిందే. -
మీ కుమ్ములాటలే కొంపముంచుతున్నాయ్
సాక్షి, అమరావతి: పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు, కుమ్ములాటలే టీడీపీ కొంప ముంచుతున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేతల్లో అనైక్యతతోపాటు పోల్ మేనేజ్మెంట్లో వెనుకబడి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కూడగట్టి ఎన్నికలకు వెళ్లకుండా ఇక్కడ మైకులు పట్టుకుని ఏవేవో మాట్లాడుతున్నారని శనివారం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధి నేతలతో నిర్వహించిన ఎన్నికల సమీక్ష సమావేశంలో మండిపడ్డారు. ‘అధికారంలోకి రావాల్సిన మనం మీ అహం, మీ తీరుతో ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు. మీరంతా సమష్టిగా వ్యవహరించకుండా ఇక్కడకు వచ్చి మైకుల్లో ప్రసంగాలు ఇస్తే ప్రయోజనమేంటి? పార్టీలో మీ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక, మీరు చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చా. మీరంతా కలిసి పనిచేస్తే ఈరోజు ఇలా గెలుపుపై ఆలోచించాల్సిన అవసరం వచ్చేది కాదు’అని పార్టీ నేతలతో చంద్రబాబు పేర్కొన్నారు. గోరంట్ల, ఆదిరెడ్డిపై ఆగ్రహం ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. బూత్ స్థాయిలో ఓట్లు వేయించలేని వారు రాష్ట్ర స్థాయి నేతలుగా చలామణి అయిపోతే ఎలా? అని నిలదీశారు. ఇలాంటి నాయకులను పెట్టుకుని నేనేం చేయాలి? అని ప్రశ్నించారు. -
ఆదిరెడ్డీ.. ఎమ్మెల్సీ మా భిక్షే
రాజమహేంద్రవరం సిటీ : ‘ఆదిరెడ్డి అప్పారావుకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే మా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి భిక్షే. ఆ పదవిని అనుభవిస్తూ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తూ మహిళలను దూషిస్తూ, చులకన చేసి మాట్లాడుతున్నారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ బడ్జెట్ అంకెల గారడీ. అభివృద్ధిని ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు’అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అంకెల గారడీగా ఉన్న నగర పాలకసంస్థ బడ్జెట్‌కు మేయర్ రజనీశేషసాయి.. సభ్యులతో మమ అనిపించారన్నారు. ప్రారంభ, ముగింపు నిల్వల్లో కనీసం ఐదు శాతం నిధులు లేకుండానే బడ్జెట్ తయారైందని, తొమ్మిది రూపాయల లోటు చూపించారన్నారు. గతేడాది బడ్జెట్ కన్నా ఈ ఏడాది పెరగాల్సిన ఆదాయం చూపలేదన్నారు. ప్రజలపై పన్నుల భారం పెంచిన తరువాత కూడా ఆదాయం కనిపించలేదాని ఆమె ప్రశ్నించారు. నిధులు తెచ్చుకోవడంలో జీరో అయ్యారు మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు కార్పొరేషన్‌కు నిధులు తెచ్చుకోవడంలో జీరోలు అయిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. సంస్థకు వచ్చే గ్రాంటులు రూ.13.22 కోట్లు మాటేమిటన్నారు. నగరాభివృద్ధికి తీసుకురావాల్సిన నిధుల విషయంలో అధికార పార్టీ డీలా పడిందన్నారు. మేయర్‌కు ఎందుకీ పక్షపాతం? బడ్జెట్ సమావేశం సమయంలో పింఛన్ల విషయం మాట్లాడవద్దని మేయర్ అన్నారని, వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న డివిజన్ల్లో పేదలకు పింఛన్లు అందక అవస్ధలు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. తన డివిజన్లో 95 పింఛన్లు దరఖాస్తుల్లో 25 మంజూరు కాలేదన్నారు. నగరంలోని 50 డివిజన్ల్లో చాలామంది పేదలున్నారని, ఒక్క మేయర్ డివిజన్‌లోనే లేరన్నారు. పుష్కర నిధులు ఏమయ్యాయి? నగరానికి పుష్కరాల్లో రూ.240 కోట్లు మంజూరైతే రూ.120 కోట్లు మాత్రమే వచ్చాయని మిగిలిన నిధులు ఏమయ్యాయోనని, రావాల్సిన నిధులపై కౌన్సిల్లో ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. నిధుల విషయంలో టీడీపీ ఫ్లోర్‌లీడర్ వర్రే కార్పొరేషన్‌కు రాసిన లేఖకు సమాధానం రావాల్సి ఉందన్నారు. పుష్కర నిధులపై ప్రశ్నిస్తే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మహిళలను దూషిస్తూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆ రూ.120 కోట్లలో రూ.60 కోట్లు మాత్రమే ఇంజనీరింగ్ అధికారులు ఖర్చు చేశారని ఆమె తెలిపారు. సన్ ఆఫ్ ఎమ్మెల్సీ.. కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు సన్ ఆఫ్ ఎమ్మెల్సీ మాదిరిగా అధికారిక కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని 4వ డివిజన్ కార్పొరేటర్, నగర ఇంజినీరింగ్ కమిటీ చైర్మన్ బొంతా శ్రీహరి విమర్శించారు. దీనిపై అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. టీడీపీ సొంత రాజ్యాంగం రాసుకుని పాలన చేస్తోందని, ఫ్లోర్ లీడర్ వర్రే బయటకు పొండని అంటున్నారని, ఇక చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పార్టీ అధినేత పాదయాత్రను వర్రే శ్రీనివాస్ విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణి, పార్టీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు, కొమ్ము జిగ్లర్, ఆనంద్, శ్యాంబాబు, బాలకృష్ణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుదగ్గర మార్కుల కోసమే.. సీఎం చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేందుకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మహిళలను చులకనగా.. ఏకవచనంతో మాట్లాడారని ఆమె ఆరోపించారు. గతంలో మాతో పాటు అవినీతిపై పోరాటం చేసిన ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడడం దారుణమన్నారు. -
ఉప్పు.. నిప్పు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరూ తరచుగా పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగుతూ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అటు పార్టీ శ్రేణులు, ఇటు నగర వాసులు నివ్వెరపోయేలా వీరిద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగడం చర్చనీయాంశమవుతోంది. గత అక్టోబర్ 26న జరిగిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఎంపీ మాగంటి మురళీమోహన్ సాక్షిగా ఎమ్మెల్సీఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరంలో జరిగిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని గోరంట్ల రాకుండానే ఆదిరెడ్డి ప్రారంభించేశారు. దీనిపై గోరంట్ల నిలదీయడంతో ‘నీకు నగరంలో పనేంటి?’ అంటూ ఆదిరెడ్డి గట్టిగా నిలదీశారు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నారు. తాజాగా ఈ నెల ఆరో తేదీన ఆదిరెడ్డి, గోరంట్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈసారి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వేదికగా ఘర్షణ చోటు చేసుకుంది. వ్యక్తిగత దూషణలు పతాక స్థాయికి చేరాయి. పరస్పరం వాగ్వాదానికి దిగడంతో కార్పొరేటర్లు, అధికారులు ప్రేక్షకులయ్యారు. శాప్ నిధులు తీసుకొచ్చింది తానేనంటూ అంతకు నాలుగు రోజుల క్రితం ఆదిరెడ్డి ప్రకటించడమే ఈ వివాదానికి దారి తీసింది. చేసిందేమి లేకపోయినా గొప్పలు చెప్పుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం సరికాదని ఆదిరెడ్డిపై గోరంట్ల వ్యాఖ్యానించి అగ్గి రాజేశారు. ‘‘ఎమ్మెల్యేలమైన మేము చవటలమనుకుంటున్నావా? అంతా నువ్వే చేశావని చెప్పుకుంటున్నావు?’’ అంటూ ఏకవచనంతో గోరంట్ల ఫైర్ అవ్వడంతో వివాదం పరాకాష్టకు చేరింది. ‘‘ఎప్పుడో లెటర్ ఇచ్చాను అంటున్నారు. అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో!’’ అంటూ ఆదిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆదిరెడ్డి ఘాటుగా విరుచుకుపడ్డారు. ఎవరేమిటో అందరికీ తెలుసని, వేషాలు వేయొద్దని మండిపడ్డారు. ‘‘నా నిజాయితీ అందరికీ తెలుసు. నీ సంగతి కూడా ప్రజలకు తెలుసు’’ అని అన్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన గోరంట్ల ‘‘కోస్తా, ఉంటే ఉండు లేకపోతే బయటకు ఫో’’ అంటూ శివాలెత్తారు. ఆది నుంచీ విభేదాలే.. ఆదిరెడ్డి, గోరంట్ల మధ్య విభేదాలు ఇప్పటివి కావు. ఆదిరెడ్డి భార్య వీరరాఘవమ్మ రాజమహేంద్రవరం మేయర్‌గా ఉన్నప్పటి నుంచీ ఉన్నాయి. అప్పట్లో కార్పొరేషన్లో గోరంట్ల జోక్యం చేసుకోవడాన్ని ఆదిరెడ్డి తప్పు పట్టేవారు. అప్పట్లో వారిమధ్య వాగ్వాదాలు జరిగాయి. ఆ తర్వాత ఆదిరెడ్డి పార్టీ మారారు. అయితే, తరువాత ఆయన నమ్మి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన వైఎస్సార్ సీపీని వంచించి, టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో గోరంట్ల, ఆదిరెడ్డి మధ్య విభేదాలకు మళ్లీ ఆజ్యం పోసినట్టయ్యింది. ఇటీవల కాలంలో కూడా రాజమహేంద్రవరం కార్పొరేషన్లో గోరంట్ల జోక్యాన్ని ఆదిరెడ్డి తప్పు పడుతున్నట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్నికలే లక్ష్యంగా కుమ్ములాటలు తాజాగా వీరి మధ్య గొడవలు చోటు చేసుకోవడానికి మాత్రం 2019లో జరగనున్న ఎన్నికలే కారణమని తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో గోరంట్ల రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తన కుమారుడు ఆదిరెడ్డి వాసును కూడా అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఎత్తుగడలో ఆదిరెడ్డి అప్పారావు ఉన్నారు. దీంతో వీరి మధ్య ఆధిపత్య పోరు చోటు చేసుకుంటోంది. సిటీలోకి గోరంట్ల ప్రవేశించడం ఆదిరెడ్డికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆయనొస్తే తన అవకాశాలకు గండి పడతాయనే అభిప్రాయంతో ఆదిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఏదో ఒకవిధంగా గోరంట్ల అడ్డు తొలగించుకోవాలనే లక్ష్యంతో ఆయన ప్రత్యేక గ్రూపును కూడా నడుపుతున్నారు. గోరంట్లకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ద్వారా టిక్కెట్ తమకే దక్కుతుందన్న ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇక గోరంట్ల కూడా వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఈసారి సిటీలోనే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తన వర్గీయులకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఆదిరెడ్డిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం. మొక్క దశలోనే ఆదిరెడ్డిని తొలగించుకోవాలనే అభిప్రాయంతో ఆధిపత్య పోరుకు తెర లేపినట్టు తెలుస్తోంది. ఆదిరెడ్డిపై తనదే పైచేయి కావాలనే ధోరణితో పావులు కదుపుతున్నారు. సీనియారిటీతోపాటు, పార్టీలో తమ సామాజికవర్గానికి పట్టు ఉన్న నేపథ్యంలో తనకే సీటు దక్కుతుందని, ఆదిరెడ్డి తనకేమాత్రం పోటీ కాదని సంకేతాలు పంపిస్తున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరినొకరు అడ్డు తొలగించుకునేందుకు, పైచేయి సాధించేందుకు, ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు తరచూ వాగ్వాదాలకు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదో ఒకటి ఇప్పుడే తేలిపోవాలన్న యోచనతో ఇద్దరూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ రచ్చకెక్కుతున్నట్టు తెలుస్తోంది. -
మండలిలో నినాదాల హోరు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సోమవారం కొనసాగిన కొద్దిసేపూ సభ్యుల సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో మార్మోగిపోరుుంది. ఉదయం 10కి సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో ఐదు నిమిషాల్లోనే సభ వాయిదా పడింది. 12 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. పోడియంను చుట్టుముట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, దేవగుడి నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకరరావు తదితరులు సమైక్య తీర్మానం చేయూలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో చైర్మన్ చక్రపాణి సభను మళ్లీ వాయిదా వేశారు. సభ మధ్యాహ్నం 1.45కి మళ్లీ ప్రారంభమైనా నినాదాలు కొనసాగడంతో మండలి మంగళవారానికి వాయిదా పడింది. నోటీసులు తిరస్కరించండి: వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన నోటీసును తిరస్కరించినట్టే సీఎం, మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసులను కూడా తిరస్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ కోరారు. ఆయన సోమవారం మండలి మీడియూ పారుుంట్‌లో సోమవారం మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ రూల్ 77 కింద నోటీసు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, విద్రోహచర్య అని అన్నారు. మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి కాదు: రామచంద్రయ్య పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ, మండలి తిరస్కరించాలని ప్రభుత్వం తరఫున నోటీసులివ్వడానికి మంత్రివర్గం ఆమోదం తీసుకోవాలన్న నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని మండలిలో సభా నాయకుడు, మంత్రి రామచంద్రయ్య అన్నారు. మంత్రివర్గం నాయకుడిగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. నోటీసులివ్వడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదన్నారు.