రాజమహేంద్రవరం కౌన్సిల్ సమావేశంలో దూషించుకుంటున్న ఆదిరెడ్డి, గోరంట్ల (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరూ తరచుగా పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగుతూ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అటు పార్టీ శ్రేణులు, ఇటు నగర వాసులు నివ్వెరపోయేలా వీరిద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగడం చర్చనీయాంశమవుతోంది.
గత అక్టోబర్ 26న జరిగిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఎంపీ మాగంటి మురళీమోహన్ సాక్షిగా ఎమ్మెల్సీఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరంలో జరిగిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని గోరంట్ల రాకుండానే ఆదిరెడ్డి ప్రారంభించేశారు. దీనిపై గోరంట్ల నిలదీయడంతో ‘నీకు నగరంలో పనేంటి?’ అంటూ ఆదిరెడ్డి గట్టిగా నిలదీశారు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నారు.
తాజాగా ఈ నెల ఆరో తేదీన ఆదిరెడ్డి, గోరంట్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈసారి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వేదికగా ఘర్షణ చోటు చేసుకుంది. వ్యక్తిగత దూషణలు పతాక స్థాయికి చేరాయి. పరస్పరం వాగ్వాదానికి దిగడంతో కార్పొరేటర్లు, అధికారులు ప్రేక్షకులయ్యారు. శాప్ నిధులు తీసుకొచ్చింది తానేనంటూ అంతకు నాలుగు రోజుల క్రితం ఆదిరెడ్డి ప్రకటించడమే ఈ వివాదానికి దారి తీసింది. చేసిందేమి లేకపోయినా గొప్పలు చెప్పుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం సరికాదని ఆదిరెడ్డిపై గోరంట్ల వ్యాఖ్యానించి అగ్గి రాజేశారు. ‘‘ఎమ్మెల్యేలమైన మేము చవటలమనుకుంటున్నావా? అంతా నువ్వే చేశావని చెప్పుకుంటున్నావు?’’ అంటూ ఏకవచనంతో గోరంట్ల ఫైర్ అవ్వడంతో వివాదం పరాకాష్టకు చేరింది. ‘‘ఎప్పుడో లెటర్ ఇచ్చాను అంటున్నారు. అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో!’’ అంటూ ఆదిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆదిరెడ్డి ఘాటుగా విరుచుకుపడ్డారు. ఎవరేమిటో అందరికీ తెలుసని, వేషాలు వేయొద్దని మండిపడ్డారు. ‘‘నా నిజాయితీ అందరికీ తెలుసు. నీ సంగతి కూడా ప్రజలకు తెలుసు’’ అని అన్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన గోరంట్ల ‘‘కోస్తా, ఉంటే ఉండు లేకపోతే బయటకు ఫో’’ అంటూ శివాలెత్తారు.
ఆది నుంచీ విభేదాలే..
ఆదిరెడ్డి, గోరంట్ల మధ్య విభేదాలు ఇప్పటివి కావు. ఆదిరెడ్డి భార్య వీరరాఘవమ్మ రాజమహేంద్రవరం మేయర్‌గా ఉన్నప్పటి నుంచీ ఉన్నాయి. అప్పట్లో కార్పొరేషన్‌లో గోరంట్ల జోక్యం చేసుకోవడాన్ని ఆదిరెడ్డి తప్పు పట్టేవారు. అప్పట్లో వారిమధ్య వాగ్వాదాలు జరిగాయి. ఆ తర్వాత ఆదిరెడ్డి పార్టీ మారారు. అయితే, తరువాత ఆయన నమ్మి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన వైఎస్సార్ సీపీని వంచించి, టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో గోరంట్ల, ఆదిరెడ్డి మధ్య విభేదాలకు మళ్లీ ఆజ్యం పోసినట్టయ్యింది. ఇటీవల కాలంలో కూడా రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో గోరంట్ల జోక్యాన్ని ఆదిరెడ్డి తప్పు పడుతున్నట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఎన్నికలే లక్ష్యంగా కుమ్ములాటలు
తాజాగా వీరి మధ్య గొడవలు చోటు చేసుకోవడానికి మాత్రం 2019లో జరగనున్న ఎన్నికలే కారణమని తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో గోరంట్ల రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తన కుమారుడు ఆదిరెడ్డి వాసును కూడా అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఎత్తుగడలో ఆదిరెడ్డి అప్పారావు ఉన్నారు. దీంతో వీరి మధ్య ఆధిపత్య పోరు చోటు చేసుకుంటోంది. సిటీలోకి గోరంట్ల ప్రవేశించడం ఆదిరెడ్డికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆయనొస్తే తన అవకాశాలకు గండి పడతాయనే అభిప్రాయంతో ఆదిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఏదో ఒకవిధంగా గోరంట్ల అడ్డు తొలగించుకోవాలనే లక్ష్యంతో ఆయన ప్రత్యేక గ్రూపును కూడా నడుపుతున్నారు. గోరంట్లకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ద్వారా టిక్కెట్ తమకే దక్కుతుందన్న ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు.
ఇక గోరంట్ల కూడా వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఈసారి సిటీలోనే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తన వర్గీయులకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఆదిరెడ్డిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం. మొక్క దశలోనే ఆదిరెడ్డిని తొలగించుకోవాలనే అభిప్రాయంతో ఆధిపత్య పోరుకు తెర లేపినట్టు తెలుస్తోంది. ఆదిరెడ్డిపై తనదే పైచేయి కావాలనే ధోరణితో పావులు కదుపుతున్నారు. సీనియారిటీతోపాటు, పార్టీలో తమ సామాజికవర్గానికి పట్టు ఉన్న నేపథ్యంలో తనకే సీటు దక్కుతుందని, ఆదిరెడ్డి తనకేమాత్రం పోటీ కాదని సంకేతాలు పంపిస్తున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరినొకరు అడ్డు తొలగించుకునేందుకు, పైచేయి సాధించేందుకు, ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు తరచూ వాగ్వాదాలకు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదో ఒకటి ఇప్పుడే తేలిపోవాలన్న యోచనతో ఇద్దరూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ రచ్చకెక్కుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment