కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం.. 'అదిరిందయ్యా చంద్రం'
హైదరాబాద్: చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. టీడీపీ మహానాడు అని కాకుండా దగానాడు అని పెట్టుకుంటే బాగుండేదని ఆయన సూచించారు. చంద్రబాబు ఏడాది పాలనపై వ్యంగ్యంగా రూపొందించిన 'అదిరిందయ్యా చంద్రం' సీడీని ఇందిరాభవన్ లో బుధవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబుపై తమ పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. ఈ సీడీలను టీడీపీ కార్యాలయానికి పంపుతున్నామని చెప్పారు. మహానాడుకు హాజరయ్యే 60 వేల మందికి ఈ సీడీని చూపించాలన్నారు. మాట తప్పుతున్న చంద్రబాబుకు ఎన్నికల హామీలను గుర్తు చేసేందుకే ఈ సీడీనీ రూపొందించామన్నారు. తమ లేఖ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చంద్రబాబుకు నిజాయితీ ఉంటే ఇదే అంశంపై మహానాడులో తీర్మానం పెట్టాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.