జిల్లాలో హై అలెర్ట్
=పజాప్రతినిధుల ఇళ్లకు బందోబస్తు పెంపు
=తిరుపతిలో ఐదు కంపెనీలు, చిత్తూరులో 8 కంపెనీల బలగాలు
సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో ఆందోళనలు జరిగే అవకాశం ఉండడంతో, తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లాల ఎస్పీలు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద బందోబస్తు పెంచారు. చిత్తూరు పరిధిలో రెండు కంపెనీల సీఆర్పీఎఫ్, రెండు కంపెనీల ఏపీ స్పెషల్ పోలీసు, నాలుగు కంపెనీల సాయుధ బలగాలను అదనంగా దింపారు.
అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. చిత్తూరుకు శుక్రవారం అదనపు బలగాలు వస్తున్నట్లు చిత్తూరు రేంజి అదనపు డీజీ ఆదిత్య త్రిపాఠి తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లోనూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
తిరుపతిలో..
తిరుపతిలో ఇప్పటికే పలు విగ్రహాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద 25కు పైగా పికెట్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ ఇంటి వద్ద ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలతో కూడుకున్న ప్రత్యేక బృందాన్ని బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో చింతా మోహన్ పాల్గొనక పోవడంతో ఆయనపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఆయన నివాసానికి అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర బాబు ఁసాక్షిరూ.తో మాట్లాడుతూ తమ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశామన్నారు. తిరుపతి అర్బన్ పరిధిలో ఐదు కంపెనీల సాయుధ బలగాలు ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. మరో రెండు కంపెనీల బలగాలు శుక్రవారం తిరుపతికి చేరుకుంటాయన్నారు. శుక్రవారం నుంచి జిల్లాలో ఆందోళనలు తీవ్రంగా జరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.