Adjustment charges
-
విద్యుత్ పథకానికి ‘వంద’నం
ఖమ్మం, న్యూస్‌లైన్: పెంచిన విద్యుత్ చార్జీలు, దానికి తోడు సర్‌చార్జీలు, సర్దుబాటు చార్జీలు అంతా తడిసి మోపెడు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి విద్యుత్ బిల్లు అంటేనే షాక్‌కొట్టినట్లవుతోంది. చేసిన కష్టం అంతా విద్యుత్ బిల్లు కట్టడానికే సరిపోతోంది. ఇటువంటి పరిస్థితిలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన ఊరటనిచ్చే విధంగా ఉందన్న చర్చ ప్రజానీకంలో సాగుతోంది. నెలకు 150 యూనిట్లలోపు విద్యుత్ వాడకం చేసుకున్న ప్రతి కుటుంబం రూ.100 బిల్లు చెల్లిస్తే చాలని, మిగిలిన చార్జీ ప్రభుత్వమే భరించే విధంగా పథకం ప్రవేశపెడతామని చెప్పడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం అమలైతే జిల్లాలోని సుమారు 3,35,937 కుటుంబాలకు ఉపయోగం కాగా, జిల్లా వాసులకు సుమారు రూ.8.2కోట్లు ఆదా అవుతాయి. అటువంటి రోజులు ఎప్పుడు వస్తాయో అని, ఆరోజులకోసం ఎదురు చూస్తున్నామని జిల్లా ప్రజలు చెబుతున్నారు. మహానేత మరణం తర్వాత చార్జీల మోత... మహానేత వైఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. అలా చేస్తే వైర్లపై బట్టలు ఆరవేయాల్సి వస్తుందని వెటకారంగా మాట్లాడిన టీడీపీ నాయకుల నోళ్లూ మూయించారు. పేదలపై భారం పడకుండా ఎఫ్ఏసీ చార్జీలను ప్రభుత్వమే భరించి పేదలకు నిరంతర విద్యుత్ సరఫరా చేశారు. అయితే ఆయన మరణానంతరం వచ్చిన రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాలు సర్‌చార్జీలు, సర్దుబాటు చార్జీలు, అదనపు లోడు చార్జీ...ఇలా అనేక ఆంక్షలు పెట్టి బిల్లులు వడ్డించి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరగ్గొట్టాయి. ‘వంద’ పథకంతో లబ్ధిపొందేది ఇలా.. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు సుమారు 8,62,000 మంది ఉన్నారు. ఇందులో గృహ అవసరాలకు విద్యుత్ వినియోగించే కనెక్షన్లు 6,95,598 ఉన్నాయి. ఇందులో నెలకు 150 యూనిట్లలోపు విద్యుత్ వాడకం దారులు 3,35,937 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా నెలకు రూ.300 నుంచి రూ. 600 బిల్లు చెల్లిస్తుంటారు. ‘వంద’ పథకం అమలైతే... 150 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారు నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ లెక్క ప్రకారం ప్రతి కుటుంబం రూ.200 నుంచి 500 వరకు లబ్ధిపొందే అవకాశం ఉంది. జిల్లా ప్రజలకు రూ. 8.2కోట్ల ఆదా రూ. 100 లకే నెలకు విద్యుత్ సరఫరా పథకంతో జిల్లా ప్రజలపై సుమారు రూ. 8.2కోట్ల భారం తగ్గుతుంది. వివిధ విద్యుత్ చార్జీల రూపేణా జిల్లా ప్రజానీకం నెలకు సుమారు రూ.60కోట్లు చెల్లిస్తోంది. ఇందులో కేవలం గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ ద్వారా రూ.13కోట్లు చెల్లిస్తున్నారు. 0నుంచి 50 యూనిట్లు వాడే వినియోగదారులు 70,478 మంది ఒక్కొక్కరు సుమారు నెలకు రూ. 250 మేరకు చెల్లిస్తున్నారు. అదేవిధంగా 0నుంచి 100 యూనిట్ల వరకు విద్యుత్ వాడే వినియోగదారులు 67,112 మంది ఒక్కొక్కరు నెలకు సుమారు రూ.500 మేరకు, 0నుంచి 150 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారు 1,98,347 మంది ఒకొక్కరు నెలకు సుమారు రూ. 600వరకు చెల్లిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రకటన ప్రకారం 150 యూనిట్ల విద్యుత్ వినియోగం వరకు నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. అది మొత్తం 3.36 కోట్లు అవుతుంది. అంతకంటే ఎక్కువ విద్యుత్ చార్జీ చెల్లించే వారితో సహా జిల్లాలో మొత్తం నెలకు రూ. 5కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ. 8.2కోట్ల ప్రభుత్వమే చెల్లిస్తుంది. -
దొడ్డిదారిన బాదేయండి!
2013-14 సర్దుబాటు చార్జీలు కొత్త చార్జీల్లో కలిపేయండి తన ప్రకటనకు, ఈఆర్సీ ఆదేశాలకు భిన్నంగా సీఎం సూచన! రూ. 1,250 కోట్ల వసూలుకు డిస్కంలు సిద్ధం సాక్షి, హైదరాబాద్: 2013-14 ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చార్జీలను వసూలు చేయం. - విద్యుత్ చార్జీల పెంపు సందర్భంగా గత ఏడాది ఏప్రిల్‌లో సీఎం కిరణ్ 2013-14 సర్దుబాటు చార్జీల వసూలు రద్దు. - ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కానీ ముఖ్యమంత్రి తన ప్రకటనకే విరుద్ధంగా సూచనలిచ్చారు. ఈఆర్సీ ఆదేశాలను ధిక్కరించి దొడ్డిదారిన 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలను వసూలు చేసేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా పెంచనున్న రెగ్యులర్ చార్జీల్లోనే 2013-14 సర్దుబాటు చార్జీలను కూడా కలిపేయూలని సీఎం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే 2014-15కు ఏకంగా రూ. 5 వేల మేరకు విద్యుత్ చార్జీలను పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. ముఖ్యమంత్రి తన ప్రకటనకు, ఈఆర్సీ ఆదేశాలకు కట్టుబడితే ప్రజలకు వచ్చే ఏప్రిల్ నుంచి పొంచి ఉన్న భారం రూ. 1,250 కోట్ల మేరకు తగ్గేది. ఇంధన సరఫరాలో వ్యత్యాసాల వల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చులు మారుతూ ఉంటాయి. తక్కువ ధరకు ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ తగ్గి.. బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరిగితే విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఆ మేరకు పెరుగుతుంది. దేశీయ బొగ్గు అందుబాటులో లేని కారణంగా అధిక ధరకు విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్నందువల్ల కూడా విద్యుత్ ఉత్పత్తికి అదనపు వ్యయం అవుతుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి అదనంగా వెచ్చించిన మొత్తాన్ని ప్రజల నుంచే ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఎస్ఏ) పేరిట వసూలు చేస్తారు. 2013-14లో ప్రభుత్వం రూ. 5,500 కోట్ల మేరకు రెగ్యులర్ చార్జీలను పెంచింది. ఆ సమయంలో ఈ సంవత్సరానికి సర్దుబాటు చార్జీలను వసూలు చేయబోమని సీఎం హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈఆర్సీ కూడా సర్దుబాటు చార్జీలను రద్దు చేసింది. కాగా రెండురోజుల క్రితం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో 2013-14 నాటి సర్దుబాటు చార్జీల గురించి డిస్కంలు ప్రస్తావించారుు. సుమారు రూ. 1,250 కోట్ల మేరకు వసూలు చేయాల్సి ఉందని, అరుుతే రద్దు చేస్తున్నట్టు ప్రకటించినందున సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరించాలని కోరాయి. ఇందుకు సీఎం ససేమిరా అన్నారు. అంతేకాదు రెగ్యులర్ చార్జీలతో వీటిని కలిపేసి ఆ రకంగా వసూలు చేసుకోవాల్సిందిగా సూచించినట్టు ఇంధనశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలనే డిస్కంలు బుధవారం ఈఆర్సీకి సమర్పించనున్నాయి. 2013-14 సర్దుబాటు చార్జీల రద్దుకు ఆదేశించిన ఈఆర్సీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది. నేడు పెంపు ప్రతిపాదనలు! విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల సమర్పణ బుధవారానికి వారుుదా పడింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను మంగళవారం ఏపీఈఆర్సీకి సమర్పించాలని డిస్కంలు తొలుత భావించాయి. అయితే ఇదేరోజు రాష్ట్ర కేబినెట్ కూడా భేటీ కావడం ఇందుకు అడ్డంకిగా మారింది. 2013-14కు చార్జీల పెంపు సమయంలో మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. కేబినెట్‌కు సమాచారం లేకుండా చార్జీలను ఎలా పెంచుతారని గత ఏడాది వారు సీఎంను నిలదీశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే తాజాగా సుమారు రూ.5 వేల కోట్ల మేరకు ప్రజలపై భారం వేసే విధంగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను మంగళవారం సమర్పించేందుకు ప్రభుత్వం జంకినట్టు సమాచారం. కేబినెట్ సమావేశం రోజే భారీయెత్తున చార్జీలు పెంచుతూ ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పిస్తే, టీవీల ద్వారా విషయం బయటకు వెల్లడై కేబినెట్లో తీవ్ర నిరసన ఎదుర్కొనక తప్పదని ముఖ్యమంత్రి భావించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపాదనల సమర్పణ బుధవారానికి వాయిదా పడినట్టు సమాచారం.