విద్యుత్ పథకానికి ‘వంద’నం | elation of district people on ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

విద్యుత్ పథకానికి ‘వంద’నం

Published Fri, Apr 11 2014 2:41 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

elation of district people on ys jagan mohan reddy

ఖమ్మం, న్యూస్‌లైన్: పెంచిన విద్యుత్ చార్జీలు, దానికి తోడు సర్‌చార్జీలు, సర్దుబాటు చార్జీలు అంతా తడిసి మోపెడు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి విద్యుత్ బిల్లు అంటేనే షాక్‌కొట్టినట్లవుతోంది. చేసిన కష్టం అంతా విద్యుత్ బిల్లు కట్టడానికే సరిపోతోంది. ఇటువంటి పరిస్థితిలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన ఊరటనిచ్చే విధంగా ఉందన్న చర్చ ప్రజానీకంలో సాగుతోంది.

 నెలకు 150 యూనిట్లలోపు విద్యుత్ వాడకం చేసుకున్న ప్రతి కుటుంబం రూ.100 బిల్లు చెల్లిస్తే చాలని, మిగిలిన చార్జీ ప్రభుత్వమే భరించే విధంగా పథకం ప్రవేశపెడతామని చెప్పడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం అమలైతే జిల్లాలోని సుమారు 3,35,937 కుటుంబాలకు ఉపయోగం కాగా, జిల్లా వాసులకు సుమారు రూ.8.2కోట్లు  ఆదా అవుతాయి. అటువంటి రోజులు ఎప్పుడు వస్తాయో అని, ఆరోజులకోసం ఎదురు చూస్తున్నామని జిల్లా ప్రజలు చెబుతున్నారు.

 మహానేత మరణం తర్వాత చార్జీల మోత...
  మహానేత వైఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. అలా చేస్తే వైర్లపై బట్టలు ఆరవేయాల్సి వస్తుందని వెటకారంగా మాట్లాడిన టీడీపీ నాయకుల నోళ్లూ మూయించారు. పేదలపై భారం పడకుండా ఎఫ్‌ఏసీ చార్జీలను ప్రభుత్వమే భరించి పేదలకు నిరంతర విద్యుత్ సరఫరా చేశారు. అయితే ఆయన మరణానంతరం వచ్చిన రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాలు సర్‌చార్జీలు, సర్దుబాటు చార్జీలు, అదనపు లోడు చార్జీ...ఇలా అనేక ఆంక్షలు పెట్టి బిల్లులు వడ్డించి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరగ్గొట్టాయి.

  ‘వంద’ పథకంతో లబ్ధిపొందేది ఇలా..
 జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు సుమారు 8,62,000 మంది ఉన్నారు. ఇందులో గృహ అవసరాలకు విద్యుత్ వినియోగించే కనెక్షన్లు 6,95,598 ఉన్నాయి.

 ఇందులో  నెలకు 150 యూనిట్లలోపు విద్యుత్ వాడకం దారులు 3,35,937 మంది ఉన్నారు.

 వీరిలో అత్యధికంగా నెలకు రూ.300 నుంచి రూ. 600 బిల్లు చెల్లిస్తుంటారు.

 ‘వంద’ పథకం అమలైతే... 150 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారు నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ లెక్క ప్రకారం ప్రతి కుటుంబం రూ.200 నుంచి 500 వరకు లబ్ధిపొందే అవకాశం ఉంది.

 జిల్లా ప్రజలకు రూ. 8.2కోట్ల ఆదా
  రూ. 100 లకే నెలకు విద్యుత్ సరఫరా పథకంతో జిల్లా ప్రజలపై సుమారు రూ. 8.2కోట్ల భారం తగ్గుతుంది.  వివిధ విద్యుత్ చార్జీల రూపేణా జిల్లా ప్రజానీకం   నెలకు సుమారు రూ.60కోట్లు చెల్లిస్తోంది. ఇందులో కేవలం గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ ద్వారా రూ.13కోట్లు చెల్లిస్తున్నారు. 0నుంచి 50 యూనిట్లు వాడే వినియోగదారులు 70,478 మంది ఒక్కొక్కరు సుమారు నెలకు రూ. 250 మేరకు చెల్లిస్తున్నారు. అదేవిధంగా 0నుంచి 100 యూనిట్ల వరకు విద్యుత్ వాడే వినియోగదారులు 67,112 మంది ఒక్కొక్కరు నెలకు సుమారు రూ.500 మేరకు, 0నుంచి 150 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారు 1,98,347 మంది ఒకొక్కరు నెలకు సుమారు రూ. 600వరకు చెల్లిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన ప్రకారం 150 యూనిట్ల విద్యుత్ వినియోగం వరకు నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. అది మొత్తం 3.36 కోట్లు అవుతుంది. అంతకంటే ఎక్కువ విద్యుత్ చార్జీ చెల్లించే వారితో సహా జిల్లాలో మొత్తం  నెలకు రూ. 5కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ. 8.2కోట్ల ప్రభుత్వమే చెల్లిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement