2013-14 సర్దుబాటు చార్జీలు కొత్త చార్జీల్లో కలిపేయండి
తన ప్రకటనకు, ఈఆర్‌సీ ఆదేశాలకు భిన్నంగా సీఎం సూచన!
రూ. 1,250 కోట్ల వసూలుకు డిస్కంలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: 2013-14 ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చార్జీలను వసూలు చేయం.
- విద్యుత్ చార్జీల పెంపు సందర్భంగా గత ఏడాది ఏప్రిల్‌లో సీఎం కిరణ్
2013-14 సర్దుబాటు చార్జీల వసూలు రద్దు.
- ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి
కానీ ముఖ్యమంత్రి తన ప్రకటనకే విరుద్ధంగా సూచనలిచ్చారు. ఈఆర్‌సీ ఆదేశాలను ధిక్కరించి దొడ్డిదారిన 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలను వసూలు చేసేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా పెంచనున్న రెగ్యులర్ చార్జీల్లోనే 2013-14 సర్దుబాటు చార్జీలను కూడా కలిపేయూలని సీఎం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే 2014-15కు ఏకంగా రూ. 5 వేల మేరకు విద్యుత్ చార్జీలను పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. ముఖ్యమంత్రి తన ప్రకటనకు, ఈఆర్‌సీ ఆదేశాలకు కట్టుబడితే ప్రజలకు వచ్చే ఏప్రిల్ నుంచి పొంచి ఉన్న భారం రూ. 1,250 కోట్ల మేరకు తగ్గేది. ఇంధన సరఫరాలో వ్యత్యాసాల వల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చులు మారుతూ ఉంటాయి. తక్కువ ధరకు ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ తగ్గి.. బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరిగితే విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఆ మేరకు పెరుగుతుంది.
దేశీయ బొగ్గు అందుబాటులో లేని కారణంగా అధిక ధరకు విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్నందువల్ల కూడా విద్యుత్ ఉత్పత్తికి అదనపు వ్యయం అవుతుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి అదనంగా వెచ్చించిన మొత్తాన్ని ప్రజల నుంచే ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) పేరిట వసూలు చేస్తారు. 2013-14లో ప్రభుత్వం రూ. 5,500 కోట్ల మేరకు రెగ్యులర్ చార్జీలను పెంచింది. ఆ సమయంలో ఈ సంవత్సరానికి సర్దుబాటు చార్జీలను వసూలు చేయబోమని సీఎం హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈఆర్‌సీ కూడా సర్దుబాటు చార్జీలను రద్దు చేసింది. కాగా రెండురోజుల క్రితం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో 2013-14 నాటి సర్దుబాటు చార్జీల గురించి డిస్కంలు ప్రస్తావించారుు. సుమారు రూ. 1,250 కోట్ల మేరకు వసూలు చేయాల్సి ఉందని, అరుుతే రద్దు చేస్తున్నట్టు ప్రకటించినందున సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరించాలని కోరాయి. ఇందుకు సీఎం ససేమిరా అన్నారు. అంతేకాదు రెగ్యులర్ చార్జీలతో వీటిని కలిపేసి ఆ రకంగా వసూలు చేసుకోవాల్సిందిగా సూచించినట్టు ఇంధనశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలనే డిస్కంలు బుధవారం ఈఆర్‌సీకి సమర్పించనున్నాయి. 2013-14 సర్దుబాటు చార్జీల రద్దుకు ఆదేశించిన ఈఆర్‌సీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది.
నేడు పెంపు ప్రతిపాదనలు!
విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల సమర్పణ బుధవారానికి వారుుదా పడింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను మంగళవారం ఏపీఈఆర్‌సీకి సమర్పించాలని డిస్కంలు తొలుత భావించాయి. అయితే ఇదేరోజు రాష్ట్ర కేబినెట్ కూడా భేటీ కావడం ఇందుకు అడ్డంకిగా మారింది. 2013-14కు చార్జీల పెంపు సమయంలో మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. కేబినెట్‌కు సమాచారం లేకుండా చార్జీలను ఎలా పెంచుతారని గత ఏడాది వారు సీఎంను నిలదీశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే తాజాగా సుమారు రూ.5 వేల కోట్ల మేరకు ప్రజలపై భారం వేసే విధంగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను మంగళవారం సమర్పించేందుకు ప్రభుత్వం జంకినట్టు సమాచారం. కేబినెట్ సమావేశం రోజే భారీయెత్తున చార్జీలు పెంచుతూ ప్రతిపాదనలు ఈఆర్‌సీకి సమర్పిస్తే, టీవీల ద్వారా విషయం బయటకు వెల్లడై కేబినెట్‌లో తీవ్ర నిరసన ఎదుర్కొనక తప్పదని ముఖ్యమంత్రి భావించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపాదనల సమర్పణ బుధవారానికి వాయిదా పడినట్టు సమాచారం.