Administrative Officers
-
రాజ్యసభ, విధాన్ పరిషత్ ఎన్నికలు.. సీఎం కీలక ఆదేశాలు
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, అధికారులు, కిందిస్ధాయి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జూన్ 30వ తేదీ వరకు నిలిపివేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్ధేశించారు. అందుకు సంబంధించిన సర్క్యులర్ సామాన్య పరిపాలన విభాగం జారీ చేసింది. త్వరలో రాజ్యసభ, విధాన్ పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల కారణంగా ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురికావద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి బదిలీ ప్రక్రియ నిలిపివేసి ఉండవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. ఏటా వేసవి సెలవులు వచ్చాయంటే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్, మేలో ఈ బదిలీ ప్రక్రియ ప్రారంభమై మే 31 వరకు కొనసాగుతుంది. కొందరు ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం బదిలీకాగా, మరికొందరు అనేక సంవత్సరాల నుంచి ఒకేచోట తిష్టవేయడంవల్ల అటోమేటిక్‌గా బదిలీ అవుతుంది. మరికొందరు వివిధ కారణాలు చూపుతూ తమను బదిలీ చేయాలని దరఖాస్తు పెట్టుకుంటారు. మంత్రులు, ఉన్నతాధికారులతో పైరవీలు చేయించుకుంటారు. ముఖ్యంగా అధిక శాతం ఉద్యోగులు పీడబ్ల్యూడీ, జలవనరులు, ఆర్థిక, గ్రామాభివృద్ధి, గృహనిర్మాణ, రవాణ, వ్యవసాయ తదితర కీలక శాఖల్లో తమను బదిలీ చేయాలని భారీ స్ధాయిలో లాబీయింగ్ చేస్తుంటారు. వీటన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఏటా మే 31 వరకు బదిలీల ప్రకియ పూర్తి చేస్తారు. కానీ ఈ ఏడాది అకస్మాత్తుగా సామాన్య పరిపాలన విభాగం బదిలీ ప్రక్రియ జూన్ 30వ తేదీ వరకు నిలిపి వేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేయడం ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మూడు భాగస్వామ్య పార్టీలతో కూడిన మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం నడుస్తోంది. మూడు పార్టీల ప్రభుత్వం కావడంతో అధికారులు, ఉద్యోగుల బదిలీలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జూన్ 30వ వరకు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. చదవండి: అత్యంత ఖరీదైన వెజిటేబుల్ ఇదే...ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే అసంతృప్తి ఎదురుకావద్దనే... ఇదిలాఉండగా ఆరు రాజ్యసభ స్ధానాలకు, 10 విధాన్ పరిషత్ స్ధానాలకు జూన్ 20వ తేదీ వరకు ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపే ప్రభుత్వ ఉన్నతాధికారుల బదిలీ అయితే ఎమ్మెల్యేల నుంచి అనేక ఫిర్యాదులు వస్తాయి. తమకు ఫలానా తహసీల్దార్ కావాలని, ఫలానా బీడీఓ కావాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం మే 31లోపు బదిలీ ప్రక్రియ పూర్తిచేస్తే ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజ్యసభ, విధాన్ పరిషత్ స్ధానాలను ఎమ్మెల్యేలే గెలిపించాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురికాకూడదన్న ఉద్దేశంతో బదిలీలు వాయిదా వేయాలని గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై మూడు పార్టీల మంత్రులు సైతం సానుకూలత ప్రదర్శించారని విశ్వసనీయ సమాచారం. -
AP: సరికొత్త పాలనకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: చరిత్రాత్మకంగా ఏర్పాటైన కొత్త జిల్లాల్లో నేటి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 9.05 గంటలకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మిగిలిన శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత జిల్లా కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాలకు కేటాయించిన ఉద్యోగులకు ఇప్పటికే ఆర్డర్ టు సెర్వ్ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు కూడా నేటి ఉదయం విధుల్లో చేరనున్నారు. 9.45 గంటలలోపు అధికారులు, ఉద్యోగులు కొత్త జిల్లా కేంద్రాల్లో విధుల్లోకి రానున్నారు. ఇందుకోసం పాత జిల్లా కేంద్రాలు, కొత్తగా ఏర్పడుతున్న 13 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలు, ఇతర జిల్లా కార్యాలయాలు ముస్తాబయ్యాయి. 70% కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట మాత్రమే ప్రైవేట్ భవనాలు ఎంపిక చేశారు. విజయవాడలో సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్. అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రాలైన అనకాపల్లి, భీమవరంలో ప్రభుత్వ భవనాలు ఒక్కటీ అందుబాటులో లేకపోవడంతో అక్కడ కలెక్టరేట్ సహా అన్నింటినీ ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటవుతున్న సత్యసాయి జిల్లాలో ఎస్పీ క్యాంపు కార్యాలయం మినహా మిగిలిన ముఖ్య కార్యాలయాలు సత్యసాయి ట్రస్ట్ భవనాల్లో పెడుతున్నారు. రాయచోటి కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న అన్నమయ్య జిల్లాలోనూ ఎక్కువగా ప్రైవేటు భవనాలనే ఎంపిక చేశారు. నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటు కానున్న పల్నాడు, తిరుపతి కేంద్రంగా ఏర్పాటవుతున్న బాలాజీ, నంద్యాల కేంద్రంగా ఉండే నంద్యాల, పార్వతీపురం కేంద్రంగా ఏర్పడుతున్న పార్వతీపురం మన్యం, రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటయ్యే తూర్పుగోదావరి, విజయవాడ కేంద్రంగా ఏర్పడుతున్న ఎన్టీఆర్ జిల్లాల్లో పూర్తిగా ప్రభుత్వ భవనాల్లోనే ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రెండు, మూడు చోట్ల తప్ప ఆర్డీవో కార్యాలయాలన్నింటికీ ప్రభుత్వ భవనాలే ఎంపిక చేశారు. ఈ కార్యాలయాల్లో అవసరమైన సివిల్, విద్యుత్ మరమ్మతు పనులు పూర్తవడంతోపాటు ఫర్నిచర్ సమకూర్చారు. విజయవాడలో సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్. కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్ కార్లు, ఫర్నీచర్ విభజన పూర్తి ప్రస్తుత జిల్లా కేంద్రంలో ఉన్న కార్లు, ఇతర వాహనాలు, ఫర్నిచర్, స్టోరేజి ర్యాకుల విభజన చాలా వరకు పూర్తయింది. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అవసరమైన వాటిని అక్కడే ఉంచి మిగిలిన వాటిని కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలకు ఇచ్చారు. ఆ జిల్లాలకు అవి చాలకపోతే, అవసరమైన మేరకు కొత్తగా సమకూర్చుకుంటున్నారు. కంప్యూటర్లు, ఇతర విడిభాగాలు, వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్.. తదితర వాటి విభజన కూడా పూర్తయింది. పునర్వ్యవస్థీకరణను బట్టి జిల్లాల్లో ఫైళ్ల విభజన వేగంగా జరుగుతోంది. కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే రెవెన్యూ డివిజన్లు, మండలాలను బట్టి ఈ విభజన చేస్తున్నారు. ఇటీవల ఎక్కువగా ఈ–ఫైల్స్ వ్యవస్థ నడుస్తుండడంతో ఈ పనికి పెద్దగా ఇబ్బంది లేదని చెబుతున్నారు. -
ఆఫీసర్లా.. వెళ్లొస్తామంటే కుదరదు
పాఠాలు చెప్పాలి... ఉత్తమ ఫలితాలు సాధించాలి విద్యార్థుల భవిష్యత్ మీ చేతుల్లోనే కేజీబీవీల ఎస్ఓలతో కలెక్టర్ యువరాజ్ మహారాణిపేట (విశాఖపట్నం) : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఉదయం వెళ్లి సాయంత్రం వస్తామంటే కుదరదు.. పాఠాలు భోదించి శతశాతం ఉత్తీర్ణ సాధనకు కృషి చేయండి... జిల్లాలో ఏడు వేల కుటుంబాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.. వీరంతా ఉత్తమ మార్కులు సాధించే విధంగా తీర్చిదిద్దండి... ప్రైవేటు పాఠశాలలకు కేవీలు తక్కువ కాదని నిరూపించండి అంటూ జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ కేజీబీవీల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో కేవీల ప్రత్యేకాధికారులు,ఎస్ఎస్ఏ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. కేవీల వారీగా సిబ్బంది పనితీరు.. మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తశుద్ధితో పని ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని హితవు పలికారు. రాంబిల్లి ఎస్ఓపై ఆగ్రహం రాంబిల్లి కేజీబీవీ లో ఇటీవల ఫుడ్‌పాయిజన్ అయి పిల్లలు ఆస్పత్రిపాలు కావడం పై కలెక్టర్ ఎస్ఓ ఉమాదేవిని నిలదీశారు. రాల్లు తిన్నా అరిగించుకునే శక్తి పిల్లలకుంటుంది.. అలాంటిది రాళ్ల్లుకన్నా గట్టి భోజనం పెడుతున్నారా మీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాల కల్పనకు చర్యలు... అన్ని కేజీబీవీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. మరుగుదొడ్లు, బోరుబావులు లేని చోట తక్షణమే నిర్మించే ఏర్పాటు చేస్తామన్నారు. రక్షణ గోడలులేని కేజీబీవీల్లో కంచెలు ఏర్పాటు చేయాలని ఈఈ రవికుమార్‌కు సూచించారు. సబ్జెక్ట్ టీచర్లు లేని పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామాకాలకు ప్రతిపాదనలు పంపించాలని ఎస్ఎస్ఏ పీఓ శివరామ్‌ప్రసాద్‌ను ఆదేశించారు. ప్రతి కేజీబీవీలో 200 మంది విద్యార్థులుండేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ ఎం.వెంకటకృష్ణారెడ్డిని ఆదేశించారు. సమావేశంలో జీసీడీఓ డి.వి.వి.ఎస్.దేవి తదితరులు పాల్గొన్నారు.