ఆఫీసర్లా.. వెళ్లొస్తామంటే కుదరదు
పాఠాలు చెప్పాలి... ఉత్తమ ఫలితాలు సాధించాలి
విద్యార్థుల భవిష్యత్ మీ చేతుల్లోనే కేజీబీవీల ఎస్‌ఓలతో కలెక్టర్ యువరాజ్
మహారాణిపేట (విశాఖపట్నం) : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఉదయం వెళ్లి సాయంత్రం వస్తామంటే కుదరదు.. పాఠాలు భోదించి శతశాతం ఉత్తీర్ణ సాధనకు కృషి చేయండి... జిల్లాలో ఏడు వేల కుటుంబాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.. వీరంతా ఉత్తమ మార్కులు సాధించే విధంగా తీర్చిదిద్దండి... ప్రైవేటు పాఠశాలలకు కేవీలు తక్కువ కాదని నిరూపించండి అంటూ జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ కేజీబీవీల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో కేవీల ప్రత్యేకాధికారులు,ఎస్‌ఎస్‌ఏ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. కేవీల వారీగా సిబ్బంది పనితీరు.. మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తశుద్ధితో పని ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని హితవు పలికారు.
రాంబిల్లి ఎస్‌ఓపై ఆగ్రహం
రాంబిల్లి కేజీబీవీ లో ఇటీవల ఫుడ్‌పాయిజన్ అయి పిల్లలు ఆస్పత్రిపాలు కావడం పై కలెక్టర్ ఎస్‌ఓ ఉమాదేవిని నిలదీశారు. రాల్లు తిన్నా అరిగించుకునే శక్తి పిల్లలకుంటుంది.. అలాంటిది రాళ్ల్లుకన్నా గట్టి భోజనం పెడుతున్నారా మీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సౌకర్యాల కల్పనకు చర్యలు...
అన్ని కేజీబీవీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. మరుగుదొడ్లు, బోరుబావులు లేని చోట తక్షణమే నిర్మించే ఏర్పాటు చేస్తామన్నారు. రక్షణ గోడలులేని కేజీబీవీల్లో కంచెలు ఏర్పాటు చేయాలని ఈఈ రవికుమార్‌కు సూచించారు. సబ్జెక్ట్ టీచర్లు లేని పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామాకాలకు ప్రతిపాదనలు పంపించాలని ఎస్‌ఎస్‌ఏ పీఓ శివరామ్‌ప్రసాద్‌ను ఆదేశించారు. ప్రతి కేజీబీవీలో 200 మంది విద్యార్థులుండేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ ఎం.వెంకటకృష్ణారెడ్డిని ఆదేశించారు. సమావేశంలో జీసీడీఓ డి.వి.వి.ఎస్.దేవి తదితరులు పాల్గొన్నారు.