కల్తీకేది కాదు అనర్హం..!
♦ నగరంలో కల్తీ శనగపిండి తయారీ గుట్టురట్టు
హైదరాబాద్: నగరంలో కల్తీ దందా రోజుకో కొత్త రూపం దాల్చుకొంటుంది. కల్తీకేది కాదు అనర్హం! అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. కల్తీ రాయుళ్లు. చివరికి పిండిని సైతం కల్తీ చేయడం నగరంలో కలకలం రేపింది. తాజాగా కర్మన్‌ఘాట్‌లో కల్తీ శనగ పిండి, పుట్నాల పిండి తయారీ గుట్టురట్టైంది.
స్థానిక రోడ్ నెంబర్ 1, ప్లాట్ నెంబర్4 జానకి ఎన్ క్లేవ్లో కల్తీ శనగ పిండి, పుట్నాల పిండి తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్వోటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించి శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు రూ. 6.5 లక్షల విలువైన కల్తీ సరుకు(నూకలు, శనగపప్పు, కెమికల్ఫుడ్ కలర్)ను స్వాధీనం చేసుకున్నారు. ఏవి కల్తీ ఏవి మంచివో తెలియడం లేదని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.