ఎస్వీయూ కొరడా
► వసతులు లేకుండా కాలేజీల నిర్వహణ
► 66 కళాశాలలకే అనుబంధం
► 150 కళాశాలలకు నిరాకరణ
► గుర్తింపు కళాశాలలకూ ‘నో’
యూనివర్సిటీక్యాంపస్: కనీస సౌకర్యాలు లేని అనుబంధ కళాశాలలపై ఎస్వీయూనివర్సిటీ కొరడా ఝుళిపించింది. ఈ విద్యాసంవత్సరానికి 150 కళాశాలలకు అనుబంధాన్ని నిరాకరించింది. తొలివిడతలో 66 కళాశాలలకు మాత్రమే అనుమతించారు. ఈ కళాశాలల జాబితాను బుధవారం యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చారు. ఎస్వీయూ పరిధిలో 220 కళాశాలలున్నాయి. ఇందులో 143 డిగ్రీ, 31 బీఈడీ, 4 బీపీడీ, 6 న్యా యకళాశాలలు, 27 ఎంబీఏ, ఎంసీఏ, 4 ఎంఈడీతో పాటు 5 ఎస్వీయూ క్యాంపస్ కళాశాలలు ఉన్నాయి. వీటికి 2017–18 విద్యాసంవత్సరానికి అనుబంధం కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. 210 కళాశాలలు దరఖాస్తు చేశాయి.
గతనెలలో 171 కళాశాలలను ఎస్వీయూనివర్సిటీ అఫిలియేషన్ కమిటీ తనిఖీలు చేసింది. పలు చోట్ల వసతులు కొరవడ్డాయని గుర్తించింది. సౌకర్యాలున్న 66 కళాశాలలను గుర్తించి బుధవారం తొలిజాబితాను ప్రకటించింది. చాలా కళాశాలలకు కనీస సౌకర్యాలు లేవు. 10 సంవత్సరాల్లో సొంత భవనాలు ఏర్పాటు చేసుకోవాలి. సొంత భవనాలులేని 23 కళాశాలలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటీసులు సైతం పంపింది. కొన్ని చోట్ల ఒకే ఆవరణలో డిగ్రీ, ఇంటర్, డీఎడ్, పాఠశాలలు నిర్వహిస్తున్నారు. కనీస ప్రయోగశాలలు, గ్రంథాలయాలు లేవు. నాణ్యత కల్గిన సిబ్బంది లేరు. ఒకచోట అనుమతి పొంది మరోచోట కళాశాలలు నిర్వహిస్తున్నారు.
కొన్ని కళాశాలలు కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఉన్నాయి. పార్కింగ్, క్రీడాసౌకర్యాలు లేవు. ఈ అంశాలను పరిశీలించిన కమిటీ సిఫార్సులను అకడమిక్ విభాగానికి సమర్పించింది. దీనిపై స్పందించిన ఎస్వీయూ అధికారులు పలు కళాశాలలకు అఫిలియేషన్‌ను ఇవ్వలేదు. గుర్తింపు పొందిన కళాశాలలు కూడా అఫిలియేషన్ జాబితాలో లేకపోవడం విశేషం.
తిరుపతిలో అఫిలియేషన్ కళాశాలలు
అకార్డ్ బిజినెస్ స్కూల్, ఏటీఎన్స్, కృష్ణతేజ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్సీరెడ్డి, ఎమరాల్డ్స్, గేట్, గాయత్రి, రామరాజ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రామరాజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రిమ్స్, రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్సీఆర్, సహాయ ఎంబీఏ కళాశాల, శ్రీరామ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్,ఎస్డీహెచ్ఆర్, సీకాం, పద్మావతి కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏఈఆర్ లా కళాశాల, ఎంబీఏ కళాశాల.