యూపీ సిఫారసులు ఇక్కడొద్దు..
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో ఐపీఎస్‌ల కేటాయింపుపై అగర్వాల్ కమిటీ చేసిన సిఫారసులను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజనకు వర్తింపచేయవద్దని పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యుష్ సిన్హా కమిటీని కోరారు. రాష్ట్రంలోని 258 ఐపీఎస్ పోస్టుల్లో 51 ఖాళీగా ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు 151 పోస్టులు (58.37 శాతం), తెలంగాణకు 107 పోస్టులు (41.63 శాతం) కేటాయించాలి.
సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రతి వంద ఐపీఎస్ పోస్టులకు గాను ఐపీఎస్ కన్ఫర్మేషన్ పొందినవారు 33 మంది ఉండాలి. మిగతా పోస్టుల్లోనూ 2/3 వంతు రాష్ట్రేతరులు, 1/3 వంతు సొంత రాష్ట్రం వారు ఉంటారు. అగర్వాల్ కమిటీ సిఫారసులను అమలు చేస్తే డెరైక్ట్ ఐపీఎస్‌లను స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఐపీఎస్‌గా కన్ఫర్డ్ అధికారులను నాన్లోకల్స్గా పరిగణిస్తారు.
వీరి కేటాయింపులో మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ విధానాన్ని అవలంబిస్తారు. దీంతో తెలంగాణ, సీమాంధ్రలకు చెందినవారు అటూఇటూ మారవచ్చు. ఇది ఇబ్బందికరంగా తయారవుతుందని, వారిని కూడా డెరైక్ట్ ఐపీఎస్‌ల మాదిరిగానే కేటాయించాలని ప్రత్యూష్ సిన్హా కమిటీకి అధికారులు విజ్ఞప్తి చేశారు.