గిలానీ మద్దతుదారుల ఆందోళన..ఉద్రిక్తం
జమ్ము కశ్మీర్: జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేర్పాటు వాద హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీషా గిలానీని గృహనిర్భంధం చేయడంపై ఆయన ఆనుచరులు ఆందోళన చేపట్టారు. గిలానీ ఇంటి ఎదుట ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ క్రమంలో మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వాటర్‌కెనాన్, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య చర్చల ప్రతిష్టంభన నేపథ్యంలో శనివారం సయ్యద్ అలీషా గిలానీనీ గృహనిర్బంధం చేశారు. ఇరుదేశాల మధ్య చర్చలకంటే ముందు దేశంలోని తీవ్ర వాదనేతలతో పాక్ సంప్రదింపులకు దిగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా సలహాదారుల స్థాయి సమావేశానికి అంగీకరించి మళ్లీ హురియత్ నేతల్ని విందుకు ఆహ్వానించడంలో పాక్ ఆంతర్యాన్ని భారత్ ప్రశ్నించింది.
కాగా జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనాలంటూ కశ్మీర్ వేర్పాటువాదులకు పాక్ జాతీయ భద్రతా సలహాదారుడు సర్తాజ్ అజీజ్ పిలపునిచ్చారు. ఇరుదేశాల భేటీకంటే ముందు ఆయనతో సమావేశమయ్యేందుకు హురియత్ నేతలు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం గ్రహించిన భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా గురువారం హౌస్ అరెస్ట్ చేసి, వెంటనే ఎందుకు విడుదల చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ద్వారా ఈ చర్యను తప్పుబట్టారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో భద్రతా సిబ్బంది వెనక్కి తగ్గారు. హురియత్ నేతలను గృహ నిర్బంధం నుంచి విడుదల చేశారు. అయితే వారి కదలికలపై కన్నేసిన పోలీసులు శ్రీనగర్‌ను విడిచి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.