Agni-I ballistic missile
-
అణు బలం : అగ్ని-1 సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ : స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అగ్ని-1 అణ్వాయుధ క్షిపణి మంగళవారం భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని డా. అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఉదయం 8.30 గంటలకు ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఆపరేషనల్ రెడీనెస్ కోసం భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్(ఎస్ఎఫ్సీ) అగ్ని-1 18వ వెర్షన్ క్షిపణిని ప్రయోగించిందని వివరించింది. ప్రయోగానికి ముందు నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను అగ్ని-1 అందుకున్నట్లు పేర్కొంది. 700 కి.మీ పరిధిలోని లక్ష్యాలను అగ్ని-1 ద్వారా చేధించొచ్చు. స్వదేశీ సాంకేతికతతో తయారైన అగ్ని-1ను 2004లో సర్వీసులో చేరింది. దీన్ని ఉపయోగించి భూమి ఉన్న లక్ష్యాలను అందుకోవచ్చు. అగ్ని-1 తాజా వెర్షన్లో వినియోగించిన ప్రత్యేక నేవిగేషన్ వ్యవస్థ ద్వారా ఎంచుకున్న లక్ష్యాన్ని చేధించితీరుతుంది. అత్యవసర సమయాల్లో అగ్ని-1 ను ప్రయోగించేందుకు అతి తక్కువ సమయం మాత్రమే పడుతుంది. 12 టన్నులు బరువుండే అగ్ని-1 వెయ్యి కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. -
‘అగ్ని-1’ పరీక్ష విజయవంతం
బాలాసోర్ (ఒడిశా): స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని వీలర్ ఐల్యాండ్‌లో గల ఐటీఆర్ ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9:33 గంటలకు నిర్వహించిన ఈ పరీక్ష అన్ని రకాలుగా విజయవంతమైందని ఐటీఆర్ డెరైక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ వెల్లడించారు. సాధారణ వినియోగ పరీక్షల్లో భాగంగా సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల విభాగం ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. మధ్యశ్రేణి రకానికి చెందిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి అణ్వస్త్రాలతో సహా వెయ్యి కిలోల పేలోడ్లను మోసుకుపోగలదు. సుమారు 700 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. పన్నెండు టన్నుల బరువు, 15 మీటర్ల పొడవైన అగ్ని-1లో అత్యాధునిక నావిగేషన్(దిశానిర్దేశ) వ్యవస్థను అమర్చారు. దీనిని హైదరాబాద్‌లోని ‘రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల, పరిశోధక కేంద్రం ఇమారత్’, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లతో కలిసి డీఆర్డీవో ప్రధాన ప్రయోగశాల అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ రూపొందించింది.