‘తేడా వస్తే సింగపూర్ వెళ్లాల్సిందే’
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వేల కోట్ల విలువైన రాజధాని భూములను బలవంతంగా రైతుల నుంచి లాక్కొని అప్పనంగా సింగపూర్ కంపెనీలకు చంద్రబాబు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అసలు వాటిపై ముఖ్యమంత్రికి అంత ప్రేమ ఎందుకని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ కంపెనీలకు జరిగిన చీకటి ఒప్పందం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
రహస్యంగా ఉంచేందకు ఇది హెరిటేజ్ సంస్థ వ్యవహారం కాదని ప్రజల వ్యవహారమని కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం సింగపూర్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు ఇప్పటివరకూ అమలుకు నోచుకొలేదని, తాజాగా వేరే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తోందని.. గతంలో చేసుకున్న ఒప్పందం సంగతేంటని ప్రశ్నించారు. ఒప్పందాల్లో తేడాలోస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని అన్నారు. పైగా సింగపూర్ కంపెనీలకు భారత చట్టాలు వర్తించవని, ఏమైనా తేడాలు వస్తే సింగపూర్ వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్లు, నచ్చిన వారికి దొచిపెడితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.