Ahmad Shah
-
Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్ గురించి తెలుసా?
పంజ్‌షీర్.. కొద్ది రోజులుగా ఈ పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. చుట్టూ పర్వతాలే కోట గోడలా రక్షణనిస్తున్న ఆ లోయవైపు ఇన్నాళ్లూ ఎవరూ కన్నెత్తి కూడా చూడలేకపోయారు. ఇప్పుడు తాలిబన్లు ఆ లోయపై పట్టు బిగించాలని చూస్తూ ఉంటే మరోవైపు తాలిబన్ వ్యతిరేక శక్తులు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఎందుకీ లోయపై తాలిబన్లకు అంత మక్కువ? అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌కు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో హిందుకుష్ పర్వత సానువుల్లో పంజ్‌షీర్ లోయ ఉంది. దీనిని అయిదు సింహాల లోయ అని కూడా పిలుస్తారు. ఈ లోయకి ఆ పర్వతాలే రక్షణ కవచాల్లా నిలుస్తాయి. ఈ లోయలోకి వెళ్లాలంటే పంజ్‌షీర్ నది వల్ల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ఇరుకైన రహదారి మాత్రమే మార్గం. అందుకే అక్కడి స్థానికులకు ఈ లోయను కాపాడుకోవడం అత్యంత సులభంగా మారింది. భౌగోళికంగా చూస్తే అఫ్గాన్‌తో సంబంధం లేనట్టుగానే ఉంటుంది కానీ దేశంలో ఉన్న 34 ప్రావిన్స్‌లలో పంజ్‌షీర్ కూడా ఒకటి. చారిత్రకంగా చూస్తే పలుమార్లు నిర్ణయాత్మక పాత్రని పోషించింది. మొదట్నుంచి ఎవరికీ తలవంచకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈ లోయపై ఆధిపత్యం సాధించడానికి తాలిబన్లు ఈసారి తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. పోరాటాల గడ్డ పంజ్‌షీర్ అంటే అహ్మద్ షా మసూద్ గురించి చెప్పుకోవాలి. 1953 సంవత్సరంలో ఈ లోయలో జన్మించిన మసూద్ తనకంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇస్లాం మత శక్తులతో తనలో చివరి ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూ వచ్చారు. పంజ్‌షీర్ లోయ స్వతంత్రతని కాపాడారు. 1980 దశకంలో అఫ్గాన్‌ను సోవియెట్ యూనియన్ దురాక్రమణ చేసినప్పుడు, 1990 నాటి అంతర్యుద్ధం సమయంలో, తాలిబన్లు దేశాన్ని పాలించిన 1996–2001 మధ్య కాలంలో కానీ ఈ లోయ ఎప్పుడూ ఎవరి వశం కాలేదంటే మసూద్ పోరాట పటిమే కారణం. ఆ లోయలో లక్షా 50 వేల మంది వరకు నివసిస్తారు. వారంతా తాజిక్ తెగకు చెందిన వారు. మరోవైపు పాస్తూన్ తెగ వారు ఎక్కువగా తాలిబన్ ముఠాలో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మçసూద్ శక్తియుక్తులతో వారు ఆ లోయవైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. పంజ్‌షీర్ లోయతో పాటు చైనా, తజికిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య పాకిస్తాన్ వరకు ఆయన ప్రభావమే ఉండేది. మసూద్‌కి సంప్రదాయ ఇస్లామ్ భావాలు ఉన్నప్పటికీ సమాజంలో మహిళలకు సమాన స్థానం ఇవ్వాలని ఆరాటపడేవారు. అయితే మసూద్ గ్రూప్ సభ్యులే ఎక్కువగా మానహక్కుల్ని హరించారన్న విమర్శలు ఉన్నాయి. 2001లో మసూద్‌ని అల్‌ఖాయిదా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ లోయను నడిపిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మద్‌లు కూడా ఆయనకు సహకరిస్తూ లోయను కాపాడుతున్నారు. పచ్చల లోయ ఈ లోయలో ఎక్కువగా ఎమరాల్డ్ (పచ్చలు) లభిస్తాయి. ఇప్పటివరకు ఇంకా తవ్వకం చేపట్టని ఎన్నో పచ్చల గనులు ఉన్నాయి. అవే ఈ ప్రాంతానికి ప్రధాన ఆదాయ వనరు. అమెరికా నాటో దళాలు స్వాదీనంలో అఫ్గాన్ ఉన్నప్పుడు ఈ లోయలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. అఫ్గాన్‌లో ఇంధనానికి ఒక హబ్‌గా మారింది. ఎన్నో జలవిద్యుత్ ఆనకట్టల్ని ఈ లోయలో నిర్మించారు. విద్యుత్‌లో స్వయంసమృద్ధిని సాధించిన ప్రాంతం ఇదొక్కటే. పచ్చల గనులతో ఆర్థికంగా పటిష్టంగా ఉండడంతో తాలిబన్లు ఈ లోయని ఆక్రమించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. పంజ్‌షీర్‌కు ఎదురయ్యే సవాళ్లేంటి ? పంజ్‌షీర్‌లో పచ్చలు, వెండి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆహారం, వైద్యం అవసరాల కోసం అఫ్గాన్‌లో ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పదు. ప్రస్తుతం ఈ లోయ చుట్టూ తాలిబన్లు తమ కమాండర్లను మోహరించారు. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల సరఫరా నిలిపివేశారు. అయితే ఆ లోయలో వచ్చే చలికాలం వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరించే ఆ లోయ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా కనిపిస్తోంది. పంజ్‌షీర్‌పై పూటకొక రకమైన వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Afghanistan: 300 మంది తాలిబన్లు హతం..!
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న నాటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడే దేశం విడిచి పారిపోయాడంటే అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అఫ్గన్ సైన్యం ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. తాలిబన్ల రాక్షస పాలన గురించి తెలిసిన ఆ దేశ ప్రజలు.. అక్కడ నుంచి విదేశాలకు వలస వెళ్తున్నారు. అఫ్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం కలవరపెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆక్రమణకు యత్నించిన తాలిబన్లను.. పంజ్‌షీర్ సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్ సైన్యం ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. బాగ్లాన్, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇక తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు సమాచారం. అంతేకాక పలువురు తాలిబన్లను అరెస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.(చదవండి: Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్ హీరో ఇతడే..!) అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్ ప్రజలు ప్రకటించారు. పంజ్‌షీర్ లోయలోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా ఏర్పాటు చేశారు. తాలిబన్లను ఎదుర్కొని.. వారిని ఢీకొడుతున్న పంజ్‌షీర్ ప్రావిన్స్ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గన్‌ను విముక్తి చేసేది అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని పంజ్‌షీర్ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! Update from the Anti-Taliban resistance - they tell me: Taliban ambushed in Andarab of Baghlan province. At least 300 Taliban fighters were killed. The group is lead by #AhmadMassoud & @AmrullahSaleh2 #Afghanistan pic.twitter.com/uJD1VEcHY1 — Yalda Hakim (@BBCYaldaHakim) August 22, 2021 -
Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్ హీరో ఇతడే..!
Ahmad Massoud History In Telugu: తాలిబన్లు.. రాక్షసత్వానికి మారు పేరు. వాళ్ల పేరు చెబితే అఫ్గాన్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వెన్నులో వణుకు పుడుతుంది. తాలిబన్ల అరాచకాలు ఒకటా..? రెండా..? ఎన్నో ఎన్నెనో..! అయితే తాలిబన్ల దురాక్రమణపై సింహంలా గర్జిస్తున్న ప్రాంతం పంజ్‌షిర్. ఒకప్పుడు అక్కడ గెరిల్లా పోరాటంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడే అహ్మద్ షా మసూద్. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు. కానీ ఆయన నాటిన విత్తనాలు పంజ్‌షిర్ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఆయన కొడుకు అహ్మద్ మసూద్ ప్రపంచ దేశాల మద్దతుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబూల్: అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్(32) తన బలమైన కోటైన పంజ్‌షిర్ లోయ నుంచి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం అఫ్గాన్ మిలిటరీ సభ్యులు, కొంతమంది ప్రత్యేక దళ సభ్యులతో కలిసి పోరాడనున్నట్లు మసూద్ తెలిపారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే గుర్తించి తన తండ్రి ఉన్నప్పుడే మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను భద్రపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. తాలిబన్లు తమ పై దాడి చేస్తే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారని హెచ్చరించారు. అయితే పాశ్చాత్య దేశాల సహాయం లేకుండా తమ దళాలు నిలవలేవని, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు ఇచ్చి, అవసరమైన వాటిని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య కేవలం అఫ్గాన్ ప్రజలది మాత్రమే కాదన్నారు. తాలిబన్ల నియంత్రణలో నిస్సందేహంగా అఫ్గాన్‌లో పెను విధ్వంసం సృష్టిస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్యాలకు వ్యతిరేకంగా మరోసారి బాటలు పరుస్తుందని అహ్మద్ మసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అహ్మద్ షా మసూద్ ఎవరు? హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్ ప్రావిన్స్ ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షిర్ ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. అక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని మరింతగా నింపిన నాయకుడు అహ్మద్ షా మసూద్. ఆయన మార్గదర్శకత్వంలో పంజ్‌షిర్ ప్రజలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1970-80లలో సోవియట్ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంతో పాటు.. 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంత పోరాటం జరిపిన యోధుల్లో అహ్మద్ షా పాత్ర కీలకమైనది. ఆయన కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు.. మిలటరీ కమాండర్ కూడా. 2001లో యూరప్‌ను సందర్శించి తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు. తాలిబన్ పాలనలో అఫ్గాన్ ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, మానవతా దృక్పథంతో సాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాగా తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ.. 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. చదవండి: Afghanistan: విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది -
తాలిబన్ల కాల్పుల్లో 29 మంది సిబ్బంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. 1980ల్లో సోవియట్ యూనియన్ ఆక్రమణకు, 1996–2001 మధ్య తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు అహ్మద్ షా మసూద్ 17వ వర్ధంతి సందర్భంగా తాలిబన్లు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 29 మంది సిబ్బంది మరణించారు. మరోవైపు మసూద్ మద్దతు దారులు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయుధాలను చేతపట్టి వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తుండగా, ఆ వాహన శ్రేణి వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకోవడంతో ఏడుగురు మరణించారు. ఆత్మాహుతి దాడికి యత్నిస్తున్న మరో ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భద్రతా దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 50 మందికిపైగా తాలిబన్ ఉగ్రవాదులు మరణించారని అఫ్గాన్ అధికారులు చెప్పారు. -
ఎమ్హెచ్ 370 గల్లంతు : పైలట్ ఆత్మహత్యే కారణమా?
మలేసియా: ఎమ్హెచ్ 370 విమానం గల్లంతుపై ఆరు నెలలు గడిచిపోయింది. ఇంతవరకు ఆ విమానం ఆచూకీ తెలియకపోవడంతో రోజుకో పుకారు షికారు చేస్తుంది. అంతేకాకుండా ఆ విమానం గల్లంతుపై పుస్తకాలు వెలువడుతున్నాయి. అయితే తాజాగా కివీ ఎయిర్ లైన్స్ స్థాపకుడు, న్యూజిలాండ్‌లో విమాన ప్రమాదాలపై విచారణాధికారి ఇవాన్ విల్సన్ 'గుడ్ నైట్ మలేసియా 370: ద ట్రూత్ బిహైండ్ ద లాస్ ఆఫ్ ఫ్లైట్ 370' పేరిట ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఎమ్హెచ్ 370 విమానం దుర్ఘటనతోపాటు గత 30 ఏళ్లలో చోటు చేసుకున్న విమాన ప్రమాదాలను ప్రస్తావించారు. కాగా ఎమ్హెచ్ 370 పైలట్ కెప్టెన్ జహీర్ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకున్నాడని అందువల్లే విమానం గల్లంతైందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాకుండా అతడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని... ఈ నేపథ్యంలో అతడు విమానంలోని ప్రతి ఒక్కరు మరణించాలని భావించాడని తెలిపారు. అందుకే పైలట్ గుడ్‌నైట్ అని మలేసియా విమానాశ్రయ అధికారులకు సందేశం పంపిన కొద్ది సేపటికే విమానం గల్లంతైందంటూ మరీ ఉదాహరణ చూపారు. అయితే రచయిత పుస్తకంలోని వ్యాఖ్యలను మలేసియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అనీఫ్ అమన్ ఖండించారు. అవి సత్య దూరాలని ఆరోపించారు. పుస్తకంలోని వ్యాఖ్యల వల్లే ప్రయాణికుల బంధువుల్లో ఇప్పటికే పడుతున్న ఆందోళన మరింత తీవ్రం అవుతుందన్నారు. విమానం గల్లంతుపై త్వరలో వార్త దొరికే అవకాశం ఉందని అన్నారు. అంతేకాకుండా ఆ విమాన పైలేట్ కెప్టెన్‌గా 1990వ సంవత్సరంలో మొదట్లో ఉద్యోగంలో చేరారని... దాదాపు 33 ఏళ్ల విమాన పైలట్‌గా కొనసాగారని చెప్పారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరింది. ఆ విమానంలో బయలుదేరిన కొద్ది సేపటికే గల్లంతైంది. ఆ విమాన ఆచూకీ కోసం ప్రపంచ దేశాలు కలసి జల్లెడ పట్టిన ఇప్పటి వరకు వీసమెత్తు ఆచూకీ కూడా కనుక్కోలేకపోయారు. దీంతో ప్రయాణికుల బంధువులు మలేసియా ప్రభుత్వంపై ఇప్పటికే నిప్పులు చెరుగుతున్నారు. కాగా రకరకాల పుకార్లు, ఇలాంటి పుస్తకాలుతో ప్రయాణికుల కోపానికి ఆజ్యం పోసినట్లు అవుతుందని మలేసియా ప్రభుత్వం భావిస్తుంది.