Afghanistan Latest News: What Happens to Panjshir | Read More - Sakshi
Sakshi News home page

Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్‌ గురించి తెలుసా?

Published Mon, Sep 6 2021 4:33 AM | Last Updated on Mon, Sep 6 2021 6:55 PM

Taliban are worried about Panjshir - Sakshi

పంజ్‌షీర్‌.. కొద్ది రోజులుగా ఈ పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. చుట్టూ పర్వతాలే కోట గోడలా రక్షణనిస్తున్న ఆ లోయవైపు ఇన్నాళ్లూ ఎవరూ కన్నెత్తి కూడా చూడలేకపోయారు. ఇప్పుడు తాలిబన్లు ఆ లోయపై పట్టు బిగించాలని చూస్తూ ఉంటే మరోవైపు తాలిబన్‌ వ్యతిరేక శక్తులు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఎందుకీ లోయపై తాలిబన్లకు అంత మక్కువ?  

అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌కు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో హిందుకుష్‌ పర్వత సానువుల్లో పంజ్‌షీర్‌ లోయ ఉంది. దీనిని అయిదు సింహాల లోయ అని కూడా పిలుస్తారు. ఈ లోయకి ఆ పర్వతాలే రక్షణ కవచాల్లా నిలుస్తాయి. ఈ లోయలోకి వెళ్లాలంటే పంజ్‌షీర్‌ నది వల్ల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ఇరుకైన రహదారి మాత్రమే మార్గం. అందుకే అక్కడి స్థానికులకు ఈ లోయను కాపాడుకోవడం అత్యంత సులభంగా మారింది.

భౌగోళికంగా చూస్తే అఫ్గాన్‌తో సంబంధం లేనట్టుగానే ఉంటుంది కానీ దేశంలో ఉన్న 34 ప్రావిన్స్‌లలో పంజ్‌షీర్‌ కూడా ఒకటి. చారిత్రకంగా చూస్తే  పలుమార్లు నిర్ణయాత్మక పాత్రని పోషించింది. మొదట్నుంచి ఎవరికీ తలవంచకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్న  ఈ లోయపై ఆధిపత్యం సాధించడానికి తాలిబన్లు ఈసారి తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు.  

పోరాటాల గడ్డ  
పంజ్‌షీర్‌ అంటే అహ్మద్‌ షా మసూద్‌ గురించి చెప్పుకోవాలి. 1953 సంవత్సరంలో ఈ లోయలో జన్మించిన మసూద్‌ తనకంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇస్లాం మత శక్తులతో  తనలో చివరి ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూ వచ్చారు. పంజ్‌షీర్‌ లోయ స్వతంత్రతని కాపాడారు. 1980 దశకంలో అఫ్గాన్‌ను సోవియెట్‌ యూనియన్‌ దురాక్రమణ చేసినప్పుడు, 1990 నాటి అంతర్యుద్ధం సమయంలో, తాలిబన్లు దేశాన్ని పాలించిన 1996–2001 మధ్య కాలంలో కానీ ఈ లోయ ఎప్పుడూ ఎవరి వశం కాలేదంటే మసూద్‌ పోరాట పటిమే కారణం.

ఆ లోయలో లక్షా 50 వేల మంది వరకు నివసిస్తారు. వారంతా తాజిక్‌ తెగకు చెందిన వారు. మరోవైపు పాస్తూన్‌ తెగ వారు ఎక్కువగా తాలిబన్‌ ముఠాలో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మçసూద్‌ శక్తియుక్తులతో వారు ఆ లోయవైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. పంజ్‌షీర్‌ లోయతో పాటు చైనా, తజికిస్తాన్‌ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య పాకిస్తాన్‌ వరకు ఆయన ప్రభావమే ఉండేది. మసూద్‌కి సంప్రదాయ ఇస్లామ్‌ భావాలు ఉన్నప్పటికీ సమాజంలో మహిళలకు సమాన స్థానం ఇవ్వాలని ఆరాటపడేవారు.

అయితే మసూద్‌ గ్రూప్‌ సభ్యులే ఎక్కువగా మానహక్కుల్ని హరించారన్న విమర్శలు ఉన్నాయి. 2001లో మసూద్‌ని అల్‌ఖాయిదా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అహ్మద్‌ మసూద్‌ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ లోయను నడిపిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మద్‌లు కూడా ఆయనకు సహకరిస్తూ లోయను కాపాడుతున్నారు.  

పచ్చల లోయ  
ఈ లోయలో ఎక్కువగా ఎమరాల్డ్‌ (పచ్చలు) లభిస్తాయి.  ఇప్పటివరకు ఇంకా తవ్వకం చేపట్టని ఎన్నో పచ్చల గనులు ఉన్నాయి. అవే ఈ ప్రాంతానికి  ప్రధాన ఆదాయ వనరు. అమెరికా నాటో దళాలు స్వాదీనంలో అఫ్గాన్‌ ఉన్నప్పుడు ఈ లోయలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. అఫ్గాన్‌లో ఇంధనానికి ఒక హబ్‌గా మారింది. ఎన్నో జలవిద్యుత్‌ ఆనకట్టల్ని ఈ లోయలో నిర్మించారు. విద్యుత్‌లో స్వయంసమృద్ధిని సాధించిన ప్రాంతం ఇదొక్కటే.  పచ్చల గనులతో ఆర్థికంగా పటిష్టంగా ఉండడంతో తాలిబన్లు  ఈ లోయని ఆక్రమించి లబ్ధి పొందాలని చూస్తున్నారు.

పంజ్‌షీర్‌కు ఎదురయ్యే సవాళ్లేంటి ?
పంజ్‌షీర్‌లో పచ్చలు, వెండి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆహారం, వైద్యం అవసరాల కోసం అఫ్గాన్‌లో ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పదు. ప్రస్తుతం ఈ లోయ చుట్టూ తాలిబన్లు తమ కమాండర్లను మోహరించారు. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల సరఫరా నిలిపివేశారు. అయితే  ఆ లోయలో వచ్చే చలికాలం వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరించే ఆ లోయ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా కనిపిస్తోంది. పంజ్‌షీర్‌పై పూటకొక రకమైన వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే.

  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement