‘ఆత్మనిర్భర్ భారత్‌కు డిఫెన్స్, ఏరోస్పేస్ కీలక పిల్లర్స్’
గాంధీనగర్: ఆత్మనిర్భర్ భారత్‌కు రక్షణ, ఏరోస్పేస్ రంగాలు ముఖ్యమైన పిల్లర్స్ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. వడోదరలో సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ.22వేల కోట్ల వ్యయంతో టాటాల భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ సంస్థ చేపడుతోంది. విమానయాన రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మోదీ పేర్కొన్నారు.
‘భారత్‌ను ఆత్మనిర్భర్‌గా తీర్చిదిద్దటంలో డిఫెన్స్, ఏరోస్పెస్ రంగాలు ముఖ్యమైన రెండు పిల్లర్స్‌గా మారనున్నాయి. 2025 నాటికి దేశ రక్షణ రంగ తయారీ 25బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులో ఏర్పాటు చేసిన డిఫెన్స్ కారిడార్లు అందుకు దోహదపడుతాయి. భారత రక్షణ ఏరోస్పేస్ రంగంలో ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. బీజేపీ అధికారంలోకి వచ్చాక కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. దానివల్లే తయారీ రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. విమానయాన రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మూడు దేశాల్లో త్వరలోనే భారత్ చోటు సంపాదిస్తుంది.’అని మోదీ వెల్లడించారు.
ఐరోపాకు చెందిన ఎయిర్‌బస్ సంస్థ ఇతర దేశాల్లో సీ-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి. భారత వాయుసేనలో సేవలందిస్తున్న అవ్రో-748 రవాణా విమానాల స్థానంలో, ఎయిర్‌బస్‌కు చెందిన సీ-295 రవాణా విమానాలను ప్రవేశపెట్టాలని గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలు అందించేందుకు ఎయిర్‌బస్‌తో రూ.21,935 కోట్లతో ఒప్పందం కుదిరింది. 2023 సెప్టెంబరు నుంచి 2025 ఆగస్టు మధ్య 16 విమానాలను ఫ్లై-అవే కండీషన్లో ఎయిర్‌బస్ భారత్‌కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాల తయారీ, అసెంబ్లింగ్‌ను టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దేశీయంగా చేపడుతుంది. తొలి దేశీయ తయారీ రవాణా విమానం 2026 సెప్టెంబరులో అందుబాటులోకి రావొచ్చని సమాచారం.
ఇదీ చదవండి: గుజరాత్లో రూ.22వేల కోట్ల మెగా ప్రాజెక్ట్.. ఎయిర్‌బస్ సీ-295 తయారీ