Aircraft order
-
IndiGo:ఎయిర్‌బస్ నుంచి 500 విమానాలు ఆర్డర్
సాక్షి,ముంబై: ఎయిరిండియా మెగా డీల్ తరువాత దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వేగం పెంచింది. ఐరోపాలో తన పరిధిని విస్తరించేందుకు టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన భాగస్వామ్యాన్ని శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్ నుండి ఇప్పటికే ఆర్డర్ చేసిన 500 అదనపు విమానాలను అందుకోనున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. ఇండిగో ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ఇండియానుంచి ఇస్తాంబుల్ ,ఐరోపాకు ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడంలో తమ తాజా కొనుగోలు సాయపడుతుందని చెప్పారు. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,800 విమానాలను నడుపుతోందని, వాటిలో 10 శాతం అంతర్జాతీయ రూట్లలో నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యం ఇది మునుపెన్నడూ లేని విధంగా యూరప్‌లోకి చొచ్చుకుపోనున్నట్టు మల్హోత్రా అన్నారు. భారతదేశం లోపల లేదా విదేశాలకు వెళ్లాలని ఆకాంక్షించే ప్రయాణికులకు భారీ అవకాశం ఉంది. ప్రస్తుతం పాస్‌పోర్ట్ ఉన్నవారు దాదాపు 7.3 శాతం అంటే 100 మిలియన్ల కంటే తక్కువ మంది ఉన్నారు. భారతీయ ప్రజలు పాస్‌పోర్ట్‌ను పొందుతున్నందున వారు చేయాలనుకుంటున్న మొదటి పని విదేశాలకు విమానంలో ప్రయాణించడమే. ఈ నేపథ్యంలోవారి ఆకాంక్షల్ని తీర్చేందుకు సరియైన సమయమని భావిస్తున్నామన్నారు. -
ఎయిరిండియా బాటలో ఇతర ఎయిర్‌లైన్స్: ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు!
సాక్షి,ముంబై: టాటా గ్రూపు సొంతమైన విమానయాన సంస్థ ఎయిరిండియా చారిత్రాత్మక 840 ఎయిర్‌బస్, బోయింగ్ విమానాల డీల్ తరువాత మరో కీలక విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేశంలోని ఇతర విమానయాన సంస్థలు రానున్న 24 నెలల్లో మరో 1,200 విమానాలను ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది. (ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు) సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా (సీఏపీఏ ఇండియా) ప్రకారం, ఇండిగో మరో బిగ్‌డీల్ మొదలు అదనంగా 1,000-1,200 విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. దేశంలోని దాదాపు ప్రతి క్యారియర్, ఫ్లీట్ రీప్లేస్మెంట్, గ్రోత్ కోసం రాబోయే రెండేళ్లలో మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆర్డర్ చేయనున్నాయని సీఏపీఏ అంచనా వేసింది. దీంతో ఎయిరిండియా మెగాడీల్‌తో దాదాపు 2 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించనున్నాయనే పరిశ్రమ నిపుణుల అంచనాల మధ్య సీఏపీఏ నివేదిక నిజమైతే ఇక విమానయాన రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనే ఇండిగో సుమారు 300 విమానాల గణనీయమైన ఆర్డర్‌ను సిద్ధం చేసుకుంది. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇపుడు ఈ ప్రణాళికను అమలు చేయవచ్చని, నిజానికి గతంలో ఊహించిన దానికంటే దాదాపు 500 విమానాల వరకు కొనుగోలు చేయనుందని అభిప్రాయపడింది. ఇటీవలి నెలల్లో, ఎయిర్‌ఫ్రేమ్ సిద్ధంగా ఉన్న చోట ఎయిర్‌క్రాఫ్ట్ డెలివరీలు ఆలస్యం అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి, సరఫరా గొలుసు సమస్యల కారణంగా ఇంజిన్లు అందుబాటులో లేవు. 2023-2024 చివరి నాటికి ఇటువంటి కేసులు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే, సరఫరా సవాళ్లు పరిష్కారం తర్వాత కూడా, ఎయిర్‌క్రాఫ్ట్,ఇంజన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు (OEMలు) చాలా ముఖ్యమైన ఆర్డర్ల బ్యాక్‌లాగ్‌లు ఉంటాయని వీటిని పరిష్కరించడానికి సంవత్సరాలు పట్టవచ్చని నివేదిక పేర్కొంది. డిసెంబర్ 31, 2022 నాటికి ఎయిర్‌బస్ , బోయింగ్ సహా 12,669 ఆర్డర్లను డెలివరీ చేయలేకపోయాయనీ ఈ డెలివరీ స్లాట్లు కనీసం రాబోయే రెండేళ్ళ వరకు రావడం చాలా కష్టంమని పేర్కొంది. 2029 వరకు పరిస్థితి కఠినంగా ఉంటుందని సీఏపీఏ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కాగా యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్ ,యుఎస్ బోయింగ్ నుండి 840 కొనుగోలు హక్కులు ఉన్నాయని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ (CCTO) నిపున్ అగర్వాల్ లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు. -
AirIndia Deal: యూకే పీఎం రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోని అగ్ర దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సంస్థలతో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కుదుర్చుకున్న ఒప్పందాలపై ఆయా దేశాల అధినేతలు స్పందించారు. బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్, ఎయిరిండియా మధ్య జరిగిన డీల్ ఓ మైలురాయిలా నిలిచిపోతుందని యూకే ప్రధాని రిషి సుకాక్ అభివర్ణించారు. టాటా నేతృత్వంలోని ఎయిరిండియా అమెరికాకు చెందిన బోయింగ్, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ బస్ సంస్థలతో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. వాటి నుంచి మొత్తం 470 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ నుంచి కూడా ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజిన్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో రిషి సునాక్.. ఎయిరిండియా, ఎయిర్‌బస్, రోల్స్‌రాయిస్‌ల మధ్య జరిగిన డీల్స్ యూకే ఏరోస్పేస్ రంగానికి హద్దులు లేకుండా చేశాయన్నారు. ఎయిర్‌బస్ విమానాల రెక్కలను యూకేలోనే తయారు చేస్తుందని, అలాగే ఏ350 ఎయిర్ క్రాఫ్ట్స్‌కు రోల్స్ రాయిస్ ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజిన్లను సమకూర్చుతుందన్నారు. ఎయిరిండియా డీల్‌తో యూకే ఏరోస్పేస్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే 2050 కల్లా భారత్ ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. (ఇదీ చదవండి: బోయింగ్‌కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ) మరోవైపు ఎయిరిండియా డీల్‌పై యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మైక్రాన్ కూడా స్పందన తెలియజేశారు. ఎయిరిండియాతో ఒప్పందం అమెరికాలో లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని, అదే సమయంలో ఎయిరిండియాకు ట్రాన్స్‌పోర్టేషన్ డిమాండ్లు తీరుతాయని వైట్‌హౌస్ తెలియజేసింది. ఎయిరిండియా-ఎయిర్‌బస్ ఒప్పందం ఇండియా-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయమని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మైక్రాన్ ట్విటర్ ద్వారా అభిప్రాయపడ్డారు. -
వచ్చే 20 ఏళ్లలో 2,400 కొత్త విమానాలు అవసరం
న్యూఢిల్లీ: పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ దృష్యా వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 2,400 నూతన ఎయిర్‌క్రాఫ్ట్స్ అవసరం ఉందని గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజం బోయింగ్ అంచనా వేసింది. వీటిలో 85–90 శాతం వరకు నారో–బాడీ ఎయిర్‌క్రాఫ్ట్స్ (737 సైజ్, సింగిల్–ఏసిల్ విమానాలు) వినియోగం ఉండనుందని సంస్థ మార్కెటింగ్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ డారెన్ హల్ట్స్ అన్నారు. వ్యాపార అభివృద్ధి, మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక వృద్ధి ఆధారంగా ఈ అంచనాను వెల్లడించినట్లు చెప్పారు. ఇక ప్రస్తుత భారత విమానయానంలో 600 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. -
250 ఎయిర్‌బస్ విమానాలకు ఇండిగో ఆర్డరు
న్యూఢిల్లీ: కార్యకలాపాల విస్తరణలో భాగంగా 250 ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాల ఆర్డరుకు సంబంధించి ఇండిగో పూర్తి స్థాయి కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 26.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.72 లక్షల కోట్లు). గతేడాది అక్టోబర్‌లో ఈ ఆర్డరు విషయంలో అవగాహన ఒప్పం దం (ఎంవోయూ) కుదిరింది. తాజా కాంట్రాక్టుతో మొత్తం 530 విమానాల కోసం ఇండిగో ఆర్డరు ఇచ్చినట్లవుతుంది. 2005లో 100 ఏ320లకు, 2011లో మరో 180 ఏ320 నియో విమానాల కోసం కంపెనీ ఆర్డర్లు ఇచ్చింది. 2005 కాంట్రాక్టుకు సంబంధించిన 100 విమానాల డెలివరీ ఇప్పటికే పూర్తయినట్లు ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు. ఇంధనం పొదుపు చేసే ఏ320 నియో విమానాలతో చౌకగా సర్వీసులు కొనసాగించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.