సాక్షి,ముంబై: టాటా గ్రూపు సొంతమైన విమానయాన సంస్థ ఎయిరిండియా చారిత్రాత్మక 840 ఎయిర్‌బస్, బోయింగ్ విమానాల డీల్ తరువాత మరో కీలక విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేశంలోని ఇతర విమానయాన సంస్థలు రానున్న 24 నెలల్లో మరో 1,200 విమానాలను ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది. (ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు)
సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా (సీఏపీఏ ఇండియా) ప్రకారం, ఇండిగో మరో బిగ్‌డీల్ మొదలు అదనంగా 1,000-1,200 విమానాల కోసం ఆర్డర్‌లు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. దేశంలోని దాదాపు ప్రతి క్యారియర్, ఫ్లీట్ రీప్లేస్‌మెంట్, గ్రోత్ కోసం రాబోయే రెండేళ్లలో మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆర్డర్ చేయనున్నాయని సీఏపీఏ అంచనా వేసింది. దీంతో ఎయిరిండియా మెగాడీల్‌తో దాదాపు 2 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించనున్నాయనే పరిశ్రమ నిపుణుల అంచనాల మధ్య సీఏపీఏ నివేదిక నిజమైతే ఇక విమానయాన రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలోనే ఇండిగో సుమారు 300 విమానాల గణనీయమైన ఆర్డర్‌ను సిద్ధం చేసుకుంది. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇపుడు ఈ ప్రణాళికను అమలు చేయవచ్చని, నిజానికి గతంలో ఊహించిన దానికంటే దాదాపు 500 విమానాల వరకు కొనుగోలు చేయనుందని అభిప్రాయపడింది. ఇటీవలి నెలల్లో, ఎయిర్‌ఫ్రేమ్ సిద్ధంగా ఉన్న చోట ఎయిర్‌క్రాఫ్ట్ డెలివరీలు ఆలస్యం అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి, సరఫరా గొలుసు సమస్యల కారణంగా ఇంజిన్‌లు అందుబాటులో లేవు. 2023-2024 చివరి నాటికి ఇటువంటి కేసులు తగ్గుతాయని భావిస్తున్నారు.
అయితే, సరఫరా సవాళ్లు పరిష్కారం తర్వాత కూడా, ఎయిర్‌క్రాఫ్ట్,ఇంజన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులకు (OEMలు) చాలా ముఖ్యమైన ఆర్డర్‌ల బ్యాక్‌లాగ్‌లు ఉంటాయని వీటిని పరిష్కరించడానికి సంవత్సరాలు పట్టవచ్చని నివేదిక పేర్కొంది. డిసెంబర్ 31, 2022 నాటికి ఎయిర్‌బస్ , బోయింగ్ సహా 12,669 ఆర్డర్‌లను డెలివరీ చేయలేకపోయాయనీ ఈ డెలివరీ స్లాట్‌లు కనీసం రాబోయే రెండేళ్ళ వరకు రావడం చాలా కష్టంమని పేర్కొంది. 2029 వరకు పరిస్థితి కఠినంగా ఉంటుందని సీఏపీఏ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కాగా యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్ ,యుఎస్ బోయింగ్ నుండి 840 కొనుగోలు హక్కులు ఉన్నాయని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ (CCTO) నిపున్ అగర్వాల్ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment