Ajit Dowell
-
భారత్‌కు అమెరికా విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకెన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఆయన దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంటారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అమెరికాలో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బ్లింకెన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి భారత్‌కు రానున్నారు. ఈ నెల 28న ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో భేటీ కానున్నారు. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆయన ప్రధాని మోదీని సైతం కలవనున్నారు. భారత్–అమెరికాల మధ్య దౌత్య సంబంధాలను ఉన్నత స్థాయిలో బలపరచడంతో పాటు భవిష్యత్తులో అవి మరింత ధృఢంగా కొనసాగేలా చర్చలు జరపనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ చర్చల్లో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా రానున్నాయని తెలిపింది. కోవిడ్–19 మహమ్మారి ప్రస్తావన కూడా ఇందులో రానున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో ఇండో–పసిఫిక్ ప్రాంతం, అఫ్గానిస్తాన్ వ్యవహారం, ఐక్యరాజ్యసమితిలో సహకారం వంటి అంశాలపై చర్చలు సాగనున్నట్లు కేంద్రం తెలిపింది. భారత పర్యటన అనంతరం బ్లింకెన్ కువైట్ వెళ్లనున్నారు. అక్కడ కూడా దేశస్థాయి అధికారులతో సమావేశాలను నిర్వహించనున్నారు. జూలై 26–29 వరకు భారత్, కువైట్‌లను సందర్శించనున్నారంటూ అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. -
భూటాన్‌లో రావత్, దోవల్ రహస్య పర్యటన
న్యూఢిల్లీ: ఈ నెల మొదటి వారంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భూటాన్‌లో రహస్యంగా పర్యటించిన సంగతి ఆలస్యంగా వెలుగుచూసింది. వారు భూటాన్ అధికారులతో డోక్లాంలో భద్రతా పరిస్థితి, చైనా నిర్మిస్తున్న రక్షణ మౌలిక వసతులపై చర్చించినట్లు తెలిసింది. డోక్లాం చుట్టుపక్కలా పెరుగుతున్న చైనా ఆర్మీ ప్రాబల్యం, రక్షణలో భారత్, భూటాన్‌ల మధ్య సహకారాన్ని సమీక్షించారు. ఫిబ్రవరి 6–7 తేదీల్లో ఈ పర్యటన జరిగిందని, సానుకూల ఫలితాలు వెలువడ్డాయని ప్రభుత్వ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాలు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నాయి. భారత్, చైనాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన తరువాత భూటాన్‌లో మన ఉన్నతాధికారులు పర్యటించడం ఇదే తొలిసారి. అంతకు మూడు రోజుల ముందు ప్రధాని మోదీ భూటాన్ ప్రధానితో గువాహటిలో సమావేశవడం గమనార్హం. -
భారత్, చైనాల ‘సరిహద్దు’ చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య 20వ దఫా సరిహద్దు చర్చలు శుక్రవారం జరిగాయి. ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దు అంశంపై తుది తీర్మానానికి రాలేకపోయామని ఉభయ పక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని, ఈ మేరకు అమలుచేయాల్సిన చర్యలపై ఆలోచనలను పంచుకున్నట్లు వెల్లడించాయి. చర్చల్లో వివాదాస్పద అంశమైన డోక్లాం ప్రస్తావన రాకపోవడం గమనార్హం. రోజంతా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా స్టేట్ కౌన్సెలర్ యంగ్ జీచితోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. చర్చలపై చైనా విదేశాంగ ప్రతినిధి స్పందిస్తూ ‘ఇది సరిహద్దు అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశం మాత్రమే కాదు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సమాచార మార్పిడికి సంబంధించిన ప్రధాన వేదిక కూడా’ అని అన్నారు. దోవల్, యంగ్ ఇద్దరూ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చల సారాంశాన్ని వివరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇండియా, చైనా మధ్య బలమైన సంబంధాలు ఉండటం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనకరమని, ఇది ప్రాంతీయంగా, అంతర్జాతీయంగానూ సత్ఫలితాలు ఇస్తుందని అభిప్రాయపడినట్లు భారత విదేశీ శాఖ వెల్లడించింది. భారత్, చైనా మధ్య జూన్ 16న తలెత్తిన డోక్లాం వివాదం ఆగస్టు 28న పరస్పర ఒప్పందంతో సమసింది. భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య రెండున్నర నెలలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
చైనా ఎన్ఎస్ఏతో దోవల్ చర్చలు
బీజింగ్: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా భద్రతా సలహాదారు యాంగ్ జియేచీ గురువారం ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించారని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. డోక్లామ్‌పై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన తరువాత జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ఇదే. డోక్లామ్ను నేరుగా ప్రస్తావించకుండా...ద్వైపాక్షిక సమస్యలపై చైనా ధోరణిని దోవల్‌కు యాంగ్ వివరించారని చైనా విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలు ప్రస్తావనకు వచ్చినట్లు చైనా మీడియా సంస్థ జిన్హువా వెల్లడించింది