
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకెన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఆయన దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంటారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అమెరికాలో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బ్లింకెన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి భారత్‌కు రానున్నారు. ఈ నెల 28న ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో భేటీ కానున్నారు.
అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆయన ప్రధాని మోదీని సైతం కలవనున్నారు. భారత్–అమెరికాల మధ్య దౌత్య సంబంధాలను ఉన్నత స్థాయిలో బలపరచడంతో పాటు భవిష్యత్తులో అవి మరింత ధృఢంగా కొనసాగేలా చర్చలు జరపనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ చర్చల్లో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా రానున్నాయని తెలిపింది.
కోవిడ్–19 మహమ్మారి ప్రస్తావన కూడా ఇందులో రానున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో ఇండో–పసిఫిక్ ప్రాంతం, అఫ్గానిస్తాన్ వ్యవహారం, ఐక్యరాజ్యసమితిలో సహకారం వంటి అంశాలపై చర్చలు సాగనున్నట్లు కేంద్రం తెలిపింది. భారత పర్యటన అనంతరం బ్లింకెన్ కువైట్ వెళ్లనున్నారు. అక్కడ కూడా దేశస్థాయి అధికారులతో సమావేశాలను నిర్వహించనున్నారు. జూలై 26–29 వరకు భారత్, కువైట్‌లను సందర్శించనున్నారంటూ అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment