ఫారెస్ట్ ఆఫీసర్ కావాలనుకున్నా..
ఐఎఫ్ఎస్ నా లక్ష్యం
రూ.ఆరువేలు లేక ఎంబీబీఎస్ సీటు వదులుకున్నా
ఇంగ్లిష్‌లో గ్రిప్లేక లక్ష్య ఛేద నలో వెనుకబడ్డా
జమానత్ సీతారాం అనే పిలుపు గర్వంగా ఉండేది
అతి తక్కువ ఖర్చుతో గెలిచింది దేశంలో నేనొక్కడినే
నా చదువులో నానమ్మది కీలకపాత్ర
నా ప్రతి అడుగులో భార్య సహకారం ఉంది
ఆటలంటే ఎంతో ఇష్టం
హరిత తెలంగాణ సాధనకు నా వంతు కృషి చేస్తా
మానుకోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్
సాక్షిప్రతినిధి, వరంగల్: మాది వెంకటాపురం మండలంలోని మల్లయ్యపల్లి. నారాయణపురం గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం. నాన్న అజ్మీరా లక్ష్మణ్, అమ్మ మంగమ్మ. ముగ్గురం అన్నదమ్ములం. నేనే పెద్దోడిని. ఇద్దరు చెల్లెళ్లు. వ్యవసాయ కుటుంబం. మా తాతలప్పుడు 50 ఎకరాల వరకు ఉండేది. అన్నదమ్ములు పంచుకోగా కొంత తగ్గింది. ఇంటి నిర్వహణ విషయంలో మా నానమ్మ పాపమ్మ గ్రేట్. నా చదువులో ఆమెది కీలకపాత్ర. 1957 ఆగస్టు 20న పుట్టాను. డిగ్రీలో ఉన్నప్పుడే పెళ్లయింది. భార్య పేరు శారద. కుమార్తె పల్లవి, కాకతీయ వర్సిటీలో బయోటెక్నాలజీ ఎమ్మెస్సీ ఫస్ట్ బ్యాచ్. అల్లుడు బూక్యా లచ్చిరాంనాయక్, ఐఆర్ఎస్ అధికారి. కాజీపేట రైల్వే డివిజన్ సీనియర్ మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు రాకేశ్, ఎంఎస్(ఆర్థోపెడిక్) పూర్తిచేశాడు. చిన్నోడు రాజేశ్, ఎంటెక్. ప్రస్తుతం కేయూలోనే అకడమిక్ కన్సల్టెంట్గానూ పనిచేస్తున్నాడు. నా జీవిత పయనంలో వృత్తిపరంగా, కుటుంబపరంగా నా భార్య సహకారమే ఎక్కువ. చదువుకునే రోజుల్లో, ఉద్యోగ సమయంలో, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. ఈ విషయంలో నా భార్య ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. ఇంటి నిర్వహణ ఆమే చూసుకుంటుంది. పిల్లల సెటిల్మెంట్ ఘనత పూర్తిగా ఆమెదే. ఎన్నికల సమయంలోనూ కీలకంగా వ్యవహరించింది.
జమానత్ సీతారాం..
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులోనే పెద్ద కుట్ర ఉన్నది. ఎస్టీ, ఎస్సీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా అన్యాయం జరిగింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికపరంగానూ ఈ వర్గాలే ఎక్కువ నష్టపోయాయి. ఆంధ్రరాష్ట్రం, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన 1956 నుంచి మాకు(లంబాడీ) ఎస్టీగా రిజర్వేషన్లు లేవు. అదే ఆంధ్ర ప్రాంతంలోని లంబాడీలు ఎస్టీల్లో ఉండేవారు. 1976లో తెలంగాణ ప్రాంతంలోని లంబాడీలను ఎస్టీల్లో చేర్చారు. ఇలాంటి వాటితో ఎంతోమంది విద్యావంతులు నష్టపోయారు. ఎంబీబీఎస్ సీటు విషయంలో నాకు ఇదే అనుభవం ఉంది. ఇలా ఎన్నో అన్యాయాలు. ఇవన్నీ చూసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నా వంతుగా ప్రయత్నించా. ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ సమన్వయకర్తగా ఉన్న పరిచయాలతో తెలంగాణ యూనివర్సిటీల గిరిజన అధ్యాపకుల సంఘం(తుటా)ను ఏర్పాటు చేశాను. 2009లో కేసీఆర్ నిరహార దీక్ష తర్వాత ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ పాత్ర చెప్పలేనిది. పోలీసు నిర్బంధంతో విద్యార్థులపై దాడులకు తెంపు ఉండేది కాదు. ఉద్యమం కేసుల పేరిట పగలు, రాత్రి తేడాలేకుండా పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసేవారు. నేను వెళ్లి వారికి జమానత్ ఇచ్చేవాడిని. దీంతో ఒకసారి జడ్డి... ఎంతమందికని జమానత్ ఇస్తరు. మీపై అధికారులకు లెటర్ రాస్తా అన్నారు. ‘నేను దేశద్రోహులకు, ఉగ్రవాదులకు జమానత్ ఇస్తలేను. నా జీతం కట్ అయినా పర్వాలేదు’ అని చెప్పాను. ఉద్యమం కీలక సమయంలో నన్ను జమానత్ సీతారాం అనేవారు. అలా పిలవడం నాకు గర్వంగా అనిపించేది.
ఎన్ఎస్ఎస్తో గుర్తింపు..
ఎన్ఎస్ఎస్లో పనిచేయడం అదృష్టంగా భావిస్తా. సమాజంలో అనేక సమస్యలను తెలుసుకునే అవకాశం దీంతోనే వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులతో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలను నిర్వహించా. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాం. మంచిర్యాలలో ఉన్నప్పుడే ఎన్ఎస్ఎస్ జిల్లా సమన్వకర్తగా, వరంగల్‌కు వచ్చాకా జిల్లాస్థాయి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల అధికారిగా పనిచేశా. సామాజిక, రక్తదానం కార్యక్రమాలు నిర్వహించా. మేడారం జాతర సమయాల్లో మూడుసార్లు మెగాక్యాంపులు విజయవంతంగా నిర్వహించాం. 17 రాష్ట్రాల విద్యార్థులతో ములుగులో క్యాంప్ నిర్వహించా. క్యాంపులో ఉన్నప్పుడే కాకతీయ యూనివర్సిటీలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వచ్చాయి. 50 వేల యూనిట్ల రక్తం సేకరించాం. రెడ్‌క్రాస్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యా. రెండుసార్లు యూనివర్సిటీకి గవర్నర్ సుర్జిత్‌సింగ్ బర్నాలాను తీసుకువచ్చా. 35 గిరిజన తెగలకు పరిశోధన చేశా. గుల్బార్గా, మిథిలా వర్సిటీలతోపాటు అమెరికా, నేపాల్, థాయ్‌లాండ్‌లో అంతర్జాతీయ సదస్సులో పరిశోధనాపత్రాలను సమర్పించా. అవార్డులూ వచ్చాయి. సీతారాంనాయక్‌కు గుర్తింపు తెచ్చింది ఎన్ఎస్ఎస్ అని గట్టిగా చెబుతాను. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన హరిత తెలంగాణకు నా వంతుగా కృషి చేస్తాను. మనిషి పుట్టుక నుంచి జీవితాంతంలోనూ చెట్టు ప్రాధాన్యతను వివరించేలా ఉన్న ‘చెట్టమ్మ.. చెట్టు’ పాటతో పచ్చదనం ప్రాధాన్యతను వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. నాకు మొదటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం. కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్ ఆడేవాడిని.
ఎన్నికల్లో నాది రికార్డు
సామాజిక కార్యక్రమాలపై నాకు మొదటి నుంచి ఆసక్తి. వీటి వల్లే రాజకీయాలపైనా ఇష్టం ఏర్పడింది. యూనివర్సిటీలో ఉన్నప్పుడు పీడీఎస్‌యూ, ఆర్ఎస్యూ బలంగా ఉండేవి. అంతా ఖమ్మం వాళ్ల డామినేషన్ నడిచేది. వరంగల్ లోకల్ ఫీలింగ్‌తో కొందరు మిత్రులతో కలిసి నేను విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీచేశా. సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేస్తే ప్రత్యర్థి సోమిరెడ్డి గెలిచారు. డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా ఉన్నప్పుడే ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు పరిశీలనలో ఉన్నట్లు పత్రికల్లోనే వార్తలు వచ్చేవి. 2004, 2009 ఎన్నికల్లో ఒక జాతీయ పార్టీ టిక్కెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలించింది. డబ్బులు లేవనో, మధ్యవర్తులు లేకనో నాకు అవకాశం రాలేదు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎస్టీల స్వయంపాలన కోసం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతామన్నారు. అందుకే నేను టీఆర్ఎస్లో చేరా. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిచి టికెట్ ఇచ్చారు. ఎంపీగా పోటీచేస్తావా? ఎమ్మెల్యే టికెట్ కావాలా? నీ ఇష్టం అన్నారు. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి నన్ను సన్నిహితులు ఎంపీగారు అనేవారు. నేను దానికే ఫిక్సయ్యా. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో ఖమ్మంలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా నాకు ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో కేసీఆర్‌గారు ఎమ్మెల్యే టెకెట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మానుకోట ప్రజలను నన్ను ఎంపీగా గెలిపించారు. ఎన్నికల్లో సాధారణ రవాణా, ప్రచారం కోసమే ఖర్చు చేశా. ఓట్ల కోసం ఒక్క రూపాయీ ఇయ్యలేదు. దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో ఎంపీగా గెలిచింది నేనేనని గర్వంగా చెబుతా. 13 ఏళ్లపాటు కేయూలో పనిచేశాను. అడ్మిషన్ల డెరైక్టరుగా, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా, ఆర్ట్స్ కాలేజీ ఇన్చార్జ్గా, కేయూ పాలకమండలి సభ్యుడిగా పదవులు నిర్వహించా. రెండుసార్లు వర్సిటీ బడ్జెట్ ప్రవేశపెట్టా. యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహం, ఎస్టీలపై బుక్‌బ్యాంక్, పరిపాలన భవనం ఎదుట ఎన్ఎస్ఎస్ మార్గ్ ఏర్పాటు, చెక్‌డ్యాం నిర్మాణం తృప్తి కలిగించాయి. ఒక్క విమర్శ, ఆరోపణ లేకుండా 13 ఏళ్లపాటు యూనివర్సిటీలో పనిచేశా. రాజకీయాల్లోనూ ఇలాగే ఉండాలని నా ఉద్దేశం.
ఇంగ్లిష్‌లో పట్టులేక..
వ్యక్తి అభివృద్ధికి చదువే మూలం. ఇందుకు నేనే నిదర్శనం. మా చిన్నాన్న వెంకట్రాం 1950ల్లోనే తొమ్మిదో తరగతి వరకు చదివారు. నా చిన్నప్పుడు వ్యాపారం చేసుకునేందుకు మా ఊరొచ్చిన ఓ వైశ్య కుటుంబం మా ఇంట్లోనే ఉండేది. వారు మా నాన్నను, నానమ్మను ఒత్తిడి చేయడంతో నన్ను స్కూలుకు పంపించారు. నాలుగో తరగతి వరకు నారాయణపురంలో చదివాను. నాలుగు నుంచి ఆరు వరకు గుర్రంపేటలో, ఆరు నుంచి తొమ్మిది వరకు ఘణపురం(ఎం) ప్రభుత్వ పాఠశాలలో చదివాను. పదో తరగతి కోసం హన్మకొండ మర్కజీ స్కూల్లో చేరాను. హాస్టల్ సీటు కోసం మా ఊరి దగ్గర్లోని లక్ష్మీదేవిపేటకు చెందిన సూర్యనేని రాజేశ్వరరావు.. సంక్షేమ అధికారితో మాట్లాడారు. అయితే మర్కజీ స్కూల్‌కు వెళ్లలేదు. తర్వాత పరకాల స్కూళ్లో చేరా. ఎందుకో ఉండబుద్ధి కాకపోయేది. చిన్నప్పటి నుంచి ఫస్ట్ లేదా సెకండ్ ర్యాంక్‌లో ఉండేవాడిని. 1969 తెలంగాణ ఉద్యమంతో చదువులో కొంత వెనుకబడ్డా. 50 శాతం మార్కులతో పాసయ్యా. హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్‌లో చదువుకున్నా. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీలో చేరా. అప్పుడు కాకతీయ డిగ్రీ కాలేజీనీ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ రోజుల్లోనే మంత్రి చాంబర్ ఎదుట నిరసన తెలిపాం. డిగ్రీ నుంచి నా చదువు బాగా మెరుగయ్యింది. మెరిట్ వచ్చింది. కేయూలో బాటనీలో ఎమ్మెస్సీ పూర్తిచేశా. 1982లో ఎమ్మెస్సీ అయ్యింది. అటవీ ప్రాంతంతో ఉన్న అనుబంధం వల్ల కావచ్చ.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు(ఐఎఫ్ఎస్) అధికారి కావాలని లక్ష్యంగా ఉండేది. అందుకే బైపీసీ చదివా. ఎంబీబీఎస్ రాశాను. అప్పుడు సీటు రాలేదు. రూ.ఆరు వేలు ఫీజు కడితే సీటు వస్తుందన్నారు. అంత కట్టలేక డిగ్రీలో చేరాను. ఫారెస్ట్ శాఖలో ఉద్యోగం, లేకుంటే గెజిటెడ్స్థాయిలో ఉండే ఉద్యోగం చేయాలని అనుకునేవాడిని. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలు, చదువులకు దేనికి దరఖాస్తు చేయాలన్నా గెజిటెడ్ సంతకం తప్పనిసరి. దీనికోసం గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చేది. ఆ నిరీక్షణ చూసి నేను గెజిటెడ్‌స్థాయి ఉద్యోగం చేయాలని అనుకునేవాడిని. ఐఎఫ్ఎస్ అనేది బాగా మనసులో ఉండేది. డిగ్రీ పూర్తి కాగానే ఐఎఫ్ఎస్ రాశాను. ఇంగ్లిషులో గ్రిప్ లేకపోవడం వల్ల రాలేదు. పీహెచ్డీ పూర్తి కాకముందే డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. పీహెచ్‌డీకి ఇబ్బంది లేకుండా మంచిర్యాలలో పోస్టింగ్ వచ్చింది. ఈ విషయంలో మేచినేని కిషన్‌రావుగారు సహకరించారు. 1984 నుంచి 1995 వరకు అక్కడే పనిచేశా. తర్వాత 2001 వరకు కాకతీయ డిగ్రీ కాలేజీ. 2001 నుంచి ఇటీవలి వరకు కేయూలో రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశా.
కాలం మారింది
మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులంటే ఎంతో గౌరవం ఉండేది. ఇద్దరి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది కనిపించడంలేదు. జగన్మోహన్రావు, సుబ్బారావు, తిరుపతిరావు, రామ్మోహన్రావు ఇప్పటికీ నాకు చాలా గుర్తు. పీహెచ్డీ గైడ్‌గా దిగంబరరావు సార్ ఉండె. ఉన్నత విద్య అనేది వ్యక్తుల జీవితాలకు, జీతాలకు కాకుండా సమాజానికి ఉపయోపడాలని చెప్పేవారు. వల్లంపట్ల నాగేశ్వర్రావు నాకు పరకాల నుంచీ మిత్రుడే. ఎందుకో తెలియదుగానీ సబ్జెక్టు పరంగా మన కంటే మెరుగైన వాళ్లతో స్నేహం చేయాలని నాకు మొదటి నుంచి ఉండేది. అది కెరియర్ పరంగా నాకు బాగా ఉపయోగపడింది. భగవాన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, విజయాకర్, దేవదాసు, నేను బాగా కలిసి ఉండేవాళ్లం. అప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకు వెళ్లేవాడిని. సినిమా అనేది పవర్ఫుల్ మీడియా. ఇప్పుటి సినిమాల్లో విలువలే ఉండడం లేదు. హీరోల పేరుతో కొందరు చేసే చేష్టలు చూస్తేనే వికారం వస్తుంది.