అది ఆవు మాంసం కాదు మేకమాంసమే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూశాయి. మహమ్మద్ అఖ్లాక్ ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో ఉన్నది మేకమాంసమే కానీ ఆవు మాంసం కాదని పశువైద్యాధికారుల నివేదికలో తేలింది. ఆవుమాంసం కలిగి ఉన్నాడని ఆరోపణలపై మహమ్మద్ అఖ్లాక్ నివాసంపై ఓ వర్గానికి చెందిన మూక దాడి చేసి.. ఆయనను కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. కుటుంబసభ్యులు తమ ఇంట్లో ఆవుమాంసం లేదని, తాము గోమాంసాన్ని భుజించలేనది చెప్తున్నా వినకుండా కోపోద్రిక్త మూకలు అఖ్లాక్ను, ఆయన కొడుకును ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి దాడి చేశారు.
అఖ్లాక్ కుటుంబం ఓ ఆవుదూడను కోసేసి.. దాని ఆహారాన్ని తిన్నారంటూ స్థానికంగా ఉన్న ఓ ఆలయంలోని మైకుల్లో వెలువడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు 12మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. కేసులు నమోదైన వారిలో స్థానిక బీజేపీ నేత కొడుకు కూడా ఉన్నాడు. అఖ్లాక్ నివాసంలో దొరికింది మేకమాంసమే కానీ ఆవుమాంసం కాదని యూపీ పశువైద్యశాఖ తన నివేదికలో స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించిన ఫొరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది.