ఆమెది చల్లని మనసు..
అక్షయ ఫ్రిడ్జ్
మినూ పాలిన్ది చల్లని మనసు. కోచిలో రెస్టారెంట్ నిర్వహించే ఆమెకు ఆహారం విలువే కాదు, అన్నార్తుల ఆకలి బాధ కూడా తెలుసు. మూడేళ్ల కిందట ఆమె ‘పాప్పడవడ’ పేరిట రెస్టారెంట్ ప్రారంభించింది. ఒక్కొక్కసారి రెస్టారెంట్లో వండిన ఆహారం వృథా అవుతుండటాన్ని గమనించి, దీనిని ఎలాగైనా అరికట్టాలని అనుకుంది. ఆహారాన్ని వృథాగా పారేసే బదులు కొంతమంది ఆకలి తీర్చగలిగినా బాగుంటుందని ఆలోచించింది. అన్నార్తుల ఆకలిని చల్లార్చేందుకు తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా తన రెస్టారెంట్ బయట అన్నార్తుల కోసం ఒక ఫ్రిజ్ ఏర్పాటు చేసింది. ఎవరైనా ఇందులో మిగిలిపోయిన ఆహారాన్ని ఉంచవచ్చు. ఆకలితో ఉన్న ఎవరైనా ఇందులో అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చునని ప్రకటించింది.
కోచి వాసుల నుంచి ఈ పనికి మంచి స్పందన లభిస్తోంది. ఎవరికి వారే స్వచ్ఛందంగా ఆహారాన్ని తీసుకొచ్చి ఈ ఫ్రిజ్‌లో ఉంచుతున్నారు. ఒకవేళ ఫ్రిజ్‌లోకి తగినంత ఆహారం చేరకపోయినా, ఇందులో నిరంతరం ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా మినూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఫ్రిజ్ ఖాళీ అవుతున్నట్లనిపిస్తే రెస్టారెంట్లో వండిన ఆహారాన్ని అందులో ఉంచుతోంది. అన్నార్తులు ఇందులోని ఆహారాన్ని తీసుకుంటూ తృప్తిగా భోంచేస్తున్నారు. ఫ్రిజ్ ఏర్పాటు చేసిన మినూను వారు తమ పాలిట అన్నపూర్ణగా అభివర్ణిస్తూ ఆమెను మనసారా దీవిస్తున్నారు.