akunuri murali
-
రేపే నారాయణమూర్తి యూనివర్సిటీ
‘‘యూనివర్సిటీ’ విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు చూడాల్సిన సినిమా’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆర్. నారాయణమూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ‘యూనివర్సిటీ’ ప్రివ్యూ వేశారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ– ‘‘దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి. అప్పుడే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ ఉండదు’ అనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా గట్టిగా చెప్పారు నారాయణమూర్తి’’ అన్నారు. ‘‘నిరుద్యోగ సమస్య దేశాన్ని ఎంత పట్టి పీడిస్తోందో ఈ చిత్రంలో బాగా చెప్పారు’’ అన్నారు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ‘‘పరీక్షల మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. -
కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన ప్రవర్తనను పలువురు సీనియర్ అధికారులు తప్పుబడుతున్నారు. పదవుల కోసం ఇంతగా దిగజారతారా అంటూ ఆక్షేపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? తెలంగాణలో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌కు వచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్‌కు పాద నమస్కారం చేశారు. అక్కడితో ఆగకుండా మరోసారి ముఖ్యమంత్రి కాళ్లుమొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. శ్రీనివాసరావు వ్యవహార శైలిని పలువురు అధికారులు ఆక్షేపించారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పరువు తీస్తున్నారు: ఆకునూరి మురళి శ్రీనివాసరావు కొత్తగూడెం అసెంబ్లీ టిక్కెట్ కోసమే కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. ‘మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూశాను టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే. పదవిని దుర్వినియోగం చేస్తూ కొత్తగూడెంలో ఏదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నార’ని ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. కేసీఆర్‌కు శ్రీనివాసరావు కాళ్లు మొక్కిన వీడియోను కూడా షేర్ చేశారు. శ్రీనివాసరావు కోరిక నెరవేరుతుందా? టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే టిక్కెట్ కోసం డాక్టర్ శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కొత్తగూడెం టికెట్ పొత్తుల్లో భాగంగా సిపిఐ కి వెళ్తుందన్న ప్రచారం స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్ కోసం ఇప్పటినుంచే అన్ని ప్రయత్నాలు ప్రారంభించేశారట. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కోరిక ఫలిస్తుందో, లేదో చూడాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. (క్లిక్ చేయండి: శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి అభినందన) -
నూతన వ్యవస్థ కోసం పార్టీ స్థాపిస్తాం
సింగరేణి(కొత్తగూడెం): రాష్ట్రంలో రాజకీయాలు వ్యాపారంలా మారాయని సోషల్ డెమోక్రటిక్ ఫోరం నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వ్యాఖ్యానించారు. ఉద్యమం పేరుతో ప్రజాభిమానాన్ని చూరగొని.. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో అందలమెక్కిన టీఆర్ఎస్ హయాంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. ఇలాంటి సమాజంలో మార్పు తీసుకురావడమే కాకుండా నూతన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిస్వార్థపరులు, వీఆర్ఎస్ తీసుకున్న అధికారులు, మేధావులతో కలిసి త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తామని మురళి వెల్లడించారు. గురువారం కొత్తగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీకి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతీనెల డీఈఓలు, ఎంఈఓలతో సమీక్షిస్తుండగా తెలంగాణలో కనీసం గంటసేపు కూడా సమీక్షించిన నాథులే లేరని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.7,268 కోట్లతో మన ఊరు – మన బడి పథకాన్ని మొదలుపెట్టినా నేటికీ అతీగతీ లేకుండా పోయిందన్నారు. 2014 నుంచి కేంద్రప్రభుత్వం సుమారు రూ.10 లక్షల కోట్ల మేర బడా కంపెనీలు, వ్యాపారుల రుణాలను మాఫీ చేసిందని.. ఇందులో దేశంలోని 10 లక్షల పాఠశాలలకు రూ.కోటి చొప్పున కేటాయించినా అద్భుతమైన ఫలితాలు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. -
అధ్వానంగా విద్యా వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా తయారైందని సోషల్ డెమొక్రటిక్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్య తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫోరం ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నీతి ఆయోగ్ 2020–21 నివేదిక ప్రకారం, ఆర్థికాభివృద్ధిలో తొలి 5 స్థానాల్లో ఉన్న తెలంగాణ.. నాణ్యమైన విద్యలో 10 స్థానం, ఆరోగ్య సూచికల్లో 18వ స్థానం, మహిళా సాధికారతలో 23వ స్థానం, పేదరిక నిర్మూలనలో 15వ స్థానం, ఆకలి నిర్మూలన, ఆహార భద్రత, పోషకాహారం లభ్యతలో 17వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికేడాది రాష్ట్ర ఆర్థిక వనరులు పెరుగుతుండగా, విద్యకు బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా తగ్గిస్తున్నారన్నారు. 2014–15లో రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 10.89 శాతం నిధులు కేటాయించగా, 2021–22 నాటికి 5.89 శాతానికి తగ్గించారని తప్పుబట్టారు. ఇప్పటికైనా సమీక్ష జరిపి పరిస్థితులను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాసమస్యలపై గతంలో మేధావులు మాట్లాడేవారని, ప్రస్తుతం రాష్ట్రంలో మాట్లాడేవారు కరువయ్యారనే డెవలప్మెంట్ ఫోరం పురుడు పోసుకుందని మురళి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫోరం కో–కన్వీనర్లు వెంకట్‌రెడ్డి, డాక్టర్ రమ, ఎంఎఫ్ గోపీనాథ్, ఝాన్సీ గడ్డం, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, సూరెపల్లి సుజాత, దస్రం నాయక్, సభ్యులు శంకర్, వీరస్వామి తదితరులు మాట్లాడారు. సర్కారుకు ఫోరం సూచనలు... ►ఉపాధ్యాయులు, ఎంఈఓ పోస్టుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి ►పాఠశాలల్లో టాయిలెట్లు, స్వచ్ఛమైన తాగునీరు, ఫ్యాన్, ట్యూబ్‌లైట్, గ్రీన్ బోర్డుతో సహా చదువుకునే వాతావరణం ఉన్న తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి ►రూ.2వేల కోట్ల గ్రాంట్‌ను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు తక్షణమే విడుదల చేయాలి ►పాఠశాలలను పునః ప్రారంభిస్తున్నందున డ్రాప్ అవుట్స్ లేకుండా దృష్టి పెట్టాలి. ►బడ్జెట్లో 20 శాతం నిధులను విద్యకు కేటాయించాలి. -
చేసేందుకు పనేం లేదని...
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి శనివారం ఆయన వీఆర్ఎస్ దరఖాస్తును అందజేశారు. చేసేందుకు పని లేదనే కారణంతోనే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నానని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రాజ్యాభిలేఖన, పరిశోధన సంస్థ (స్టేట్ ఆర్కివ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) డైరెక్టర్‌గా ఏడాదిన్నరగా కొనసాగుతు న్నారు. ప్రాధాన్యతలేని పోస్టు కేటాయించారని గత కొంతకాలంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. పదవీ విరమణకు 10 నెలల ముందే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2006 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో సెర్ప్ సీఈఓగా, భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా చేసిన సమయంలో స్థానిక అటవీ ప్రాంతంలోని గిరిజనుల్లో క్షయ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అడవి పంది, గొడ్డు మాంసం తినాలని ప్రోత్సహించే క్రమంలో ఆయన బ్రాహ్మణ సామాజికవర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత కొంత కాలానికి ప్రభుత్వం ఆయనను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ పదవి నుంచి స్టేట్ ఆర్కివ్స్కు బదిలీ చేసింది. పోస్టింగ్‌ల కేటాయింపుల్లో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల అధికారులకు అన్యాయం జరుగుతోందని, అధిక శాతం అధికారులు ప్రాధాన్యతలేని పోస్టుల్లో మగ్గిపోవాల్సి వస్తోందని కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దళితవర్గానికి చెందిన ఆయన కొంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐఏఎస్‌లతో కలిసి శాసనసభ ఎన్నికలకు ముందు సీఎస్ ఎస్కే జోషిని కలిసి పోస్టింగ్‌ల విషయంలో తమ అసంతృప్తిని తెలియజేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం తనకు కారును సైతం కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేసేవారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైనింగ్‌లో తీవ్ర లోపాలున్నాయని పేర్కొంటూ ఇటీవల∙ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశమయ్యాయి. -
ఐఏఎస్ అధికారి మురళి రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. సర్వీస్ నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి స్వచ్ఛంద పదవీ విరమణ లేఖను అందజేశారు. మరో 10 నెలల సర్వీస్ ఉండగానే మురళీ విధులను నుంచి తప్పుకుంటున్నారు. మురళీ ప్రస్తుతం పురావస్తు శాఖ సంచాలకులుగా ఉన్నారు. భూపాలపల్లి కలెక్టర్‌గా ఉన్న మురళిని తెలంగాణ ప్రభుత్వం ఆప్రాధాన్యత గల పురావాస్తు శాఖ సంచాలకులుగా బదిలీ చేసింది. దీంతో మనస్తాపం చెంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన 38 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ లేనంత ఖాళీగా ఉన్నానని.. అందుకే రాజీనామా చేస్తున్నానని మురళి పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిగా తాను పేదల కోసం కష్టపడ్డానని చెప్పారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కృషిచేశానన్నారు. ఏడాది కాలంగా సరైన పనిలేనందున తనకు అసంతృప్తిగా ఉందన్నారు. చాలామంది ఎస్సీ, బీసీ, ఎస్టీ ఐఏఎస్, ఏపీఎస్ అధికారులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. తనలాగే చాలా మంది అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. అందువల్ల బయటకు వచ్చి ఏదోఒకటి చేద్దామనే ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. -
కలెక్టర్‌పై బ్రాహ్మణ సంఘాలు గరంగరం
హైదరాబాద్: బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బ్రహ్మణ సంఘాల నేతలు డీజీపీని కలవనున్నారు. క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా శుక్రవారం కలెక్టర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బ్రహ్మణులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహానికి గురైన బ్రాహ్మణ సంఘం నేతలు ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు డీజీపీని కలవనున్నారు. ఎస్సీ, ఎస్టీలు పెద్ద మాంసం తినేవాళ్లు.. మధ్యలో దరిద్రపు బ్రాహ్మణ కల్చర్ వచ్చి పెద్ద మాంసం బంద్ చేయించిందంటూ నోరు జారారు. కాగా, తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశారు. టీబీ లాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం(పంది, గొడ్డు మాంసం) తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు అనే పదాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. -
కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ కల్చర్.. దేవుళ్ల మాలలు.. అడవి మాంసం అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన ఏటూర్ నాగారంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్వకాలంలో మనుషులు అడవి పంది మాంసం తినేవారని.. బ్రాహ్మణ కల్చర్ వచ్చిన తర్వాత ఆహారపు అలవాట్లు మారాయంటూ కామెంట్ చేశారు. దేవుళ్ల పేరుతో మాలలు వేస్తున్నారని.. ఇప్పుడు ఇది నడుస్తున్నదని చెప్పుకొచ్చారు. అడవి పందులను చంపి హాయిగా తినండని ప్రజలకు పిలుపునిచ్చారు కలెక్టర్ మురళి. తాను ఇప్పటివరకు తినలేదని.. మరోసారి వచ్చినప్పుడు నాకు కూడా ఆ మాంసం పెట్టాలన్నారు. అమెరికాలో అడవి పంది మాంసానికి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. -
కలెక్టర్ గారి మనవరాలు ప్రభుత్వాసుపత్రిలో పుట్టింది!
ఆదర్శంగా నిలిచిన భూపాలపల్లి కలెక్టర్ మురళి విషమ పరిస్థితుల్లోనూ సడలని నమ్మకం సిజేరియన్ చేసిన వైద్యులు.. తల్లీబిడ్డలు క్షేమం ఒకవైపు ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి. ఎంత ఖర్చయినా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్న వైనం..మరోవైపు హైదరాబాద్‌లో నివసిస్తున్న తన కూతురికి నెలలు నిండాయి. ఆమెకు థైరాయిడ్ సమస్య. పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో డెలివరీ చేయించొచ్చు. కాని.. ప్రసవానికి ములుగు ప్రభుత్వ ఆస్పత్రినే ఎంచుకున్నారు. ప్రసవం క్రిటికల్ కావచ్చని వైద్యులు హెచ్చరించినా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు మనవరాలిని చూస్తూ మురిసిపోతున్నారాయన!...ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచేందుకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి చేసిన ప్రయత్నమిది. సాక్షి, భూపాలపల్లి: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం నింపేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి ముందుడుగు వేశారు. హైదరాబాద్‌లో ఆధునిక వైద్యం, కార్పొరేట్ ఆస్పత్రులున్నా.. ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగించే ఉద్దేశంతో తన కూతురికి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించాలని మురళి నిర్ణయించారు. నిర్ణయించినట్టుగా తన కుమార్తె ప్రగతిని ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మురళి కూతురు ప్రగతి, అల్లుడు ప్రదీప్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మురళి నిర్ణయం నేపథ్యంలో ప్రగతి ప్రసవం కోసం తండ్రి ఉంటున్న భూపాలపల్లికి వచ్చింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా శుక్రవారం ఉదయం పది గంటలకు చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు స్నిగ్ధ వచ్చి పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో నొప్పులు ప్రారంభం కావడంతో వెంటనే వైద్య సహాయం అందివ్వాలని సూచించారు. దీంతో ప్రగతిని హుటాహుటిన ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి కడుపులో ఉమ్మ నీరు తక్కువగా ఉన్నట్లు గమ నించిన వైద్యులు వెంటనే సిజేరియన్ చేయా లని నిర్ణయించారు. డీఎంహెచ్‌వో అప్పయ్య, ఆస్పత్రి సూపరింటెండ్ గోపాల్ పర్యవేక్షణలో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. సాయం త్రం 3:30 గంటలకు ప్రగతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రమాదం అని తెలిసినా... కలెక్టర్ మురళి కూతురు ప్రగతికి థైరాయిడ్ సమస్య ఉంది. ప్రసవం క్రిటికల్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆస్ప త్రులకు వెళ్లే అవకాశం ఉన్నా ప్రభుత్వ ఆస్ప త్రులు, అక్కడి సిబ్బందిపైనే కలెక్టర్ నమ్మకం ఉంచారు. భూపాలపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక్కటే ఉంది. వంద పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉంది. ఉమ్మ నీరు తక్కువ ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. భూపాలపల్లి నుంచి హన్మకొండకు 70 కిలోమీటర్లు.. ములుగు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో ములుగు వెళ్లేందుకే మురళి మొగ్గు చూపారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూడాలని వైద్యులకు సూచించినట్లు సమాచారం. పరిస్థితి విషమంగా ఉండటం వైద్యులు సిజేరియన్ చేశారు. ప్రసవం కోసం కూతురుని ములుగు పంపిన కలెక్టర్.. అనంతరం ఇసుక క్వారీలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాతే ఆస్పత్రికి వెళ్లి కూతురు, మనవరాలిని చూసుకున్నారు. ‘ప్రగతి’ బాటలో ప్రభుత్వాసుపత్రులు ‘కార్పొరేట్ ఆస్పత్రులకు తీసిపోని వైద్య సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభిస్తున్నాయి. సర్కారు దవాఖానాలపై విశ్వాసం ఉంచాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకే నా కుమార్తె ప్రసవానికి గ్రామీణ ప్రాంతమైన ములుగును ఎంచుకున్నా. ’ అని తెలిపారు కలెక్టర్ మురళి.