ఇటు సేదతీరి.. అటు యుద్ధం!
ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఐసిస్ టెర్రరిస్టులతో యుద్ధం చేస్తున్న సైనికులకు, అక్కడ అంతర్యుద్ధానికి భయపడి వస్తున్న పౌరులకు హమ్మమ్ అల్ హలీల్ ప్రాంతం ఒయాసిస్సులా మారింది. తాగే మంచినీటి నుంచి స్నానానికి వాడే మురికినీరు వరకు దొరకడం కనాకష్టమైన మోసుల్ నగరం నుంచి వస్తున్న సైనికులు, పౌరులు హలీల్ ప్రాంతంలో సేద తీరుతున్నారు. అంతర్యుద్ధం కారణంగా ఎంతో కాలంగా మూతపడిన చారిత్రక ‘స్పా’ను కూడా మొన్ననే తెరిచారు.
గంధకం ఎక్కువగా ఉండే ఇక్కడి నీటి బావుల్లో స్నానం చేస్తే జబ్బులు నయం అవుతాయన్న నమ్మకంతో ఒక్క ఇరాక్ నుంచే కాకుండా ఇరుగు, పొరుగు దేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చేవారు. ఐసిస్ టెర్రరిస్టుల దాడుల కారణంగా ఇరుగు, పొరుగు దేశాల నుంచి ప్రజల రాక నిలిచిపోయినా ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. ఐసిస్ టెర్రరిస్టులతో చేస్తున్న యుద్ధం కాస్త తెరిపి ఇవ్వడంతో విడతల వారీగా సైనికులు ఇక్కడికి వచ్చి పోతున్నారు. ఇక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్లీ టెర్రరిస్టులపై యుద్ధానికి వెళుతున్నామని సహద్ మొహమ్మద్ జాబర్ అనే 32 ఏళ్ల సైనికుడు తెలిపారు. ఇక ప్రజల రాక మొదలైంది కనుక తమకు చేతినిండా పని దొరికి, జీతాలిచ్చే అవకాశం కూడా ఉందని స్పాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తెలిపారు. హమ్మమ్ అలీ అలీల్ అంటే అరబిక్ భాషలో రోగులు స్నానం చేసే చోటు అనే అర్థం ఉంది. ఇక్కడ నీళ్లలో గంధకం ఎక్కువ ఉండడం వల్ల జబ్బులు నయం అవుతున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.