కనుగుడ్లకు పచ్చబొట్టు!
ఐ బాల్ టాటూ... ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఫ్యాషన్ ప్రియుల నేస్తంగా మారింది. ఆందోళనకరమైన ఈ కొత్త పోకడను జనం ప్రేమగా ఆహ్వానించేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు వారి కనుగుడ్లకు పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు. తెల్లగుడ్డుకు రంగులను ఇంజెక్ట్ చేయించుకుని... అందరికీ భిన్నంగా కనిపించేందుకు ఆరాటపడుతున్నారు. అమెరికన్ బాడీ మాడిఫికేషన్ ప్రతిపాదకుడు లూనా కోబ్రా స్థాపించిన ఈ ఐ బాల్ టాటూయింగ్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తోంది. అంధత్వానికి, క్యాన్సర్ కు కారణమౌతుందని వైద్యులు హెచ్చరిస్తున్నా ఫ్యాషన్ ప్రియులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
వెర్రి వేయి విధాలు అన్నట్టుగా తయారైంది ఇప్పుడీ ఫ్యాషన్ల జోరు. వద్దన్నా వినకుండా అందం కోసం అర్రులు చాస్తూ... ప్రపంచాన్ని చూపించే కనుపాపకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. కనుపాపకు చుట్టూ ఉండే తెల్లని గుడ్డు ప్రాంతానికి రంగులతో టాటూ వేయించుకొని సంబరపడిపోతున్నారు. జనం ధోరణి మారుతోందని... వారు విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారని.. ఐ బాల్ టాటూయింగ్ ఓ కొత్త ట్రెండ్ మాత్రమేనని లూనా కోబ్రా అంటున్నారు.
అయితే ఇది ఎవరికి వారు వేసుకునే ప్రయోగం చేస్తే ప్రమాదమౌతుందేమోనని వైద్యులు ఆందోళన చెందుతున్నారని కోబ్రా చెప్తున్నారు. జోయెల్ ట్రాన్, నేయీపయర్ దంపతులు వారి కనుగుడ్లకు టెన్నిస్ బాల్ రంగును, ద్రాక్ష రంగును వేయించుకున్నారని ఈ బాడీ మాడిఫికేషన్ ఆర్టిస్ట్ చెప్తున్నారు. అయితే ఇటీవల కనుగుడ్లకు లూనా కోబ్రా చేత నీలిరంగును వేయించుకుందన్న కైలీ గార్గ్ మాత్రం ఈ ఐబాల్ టాటూయింగ్ చేసేప్పుడు నొప్పిగా అనిపించకపోయినా... ఇదో భయానకమైన చర్య అని చెప్పడం విశేషం.