చైతన్య రెడ్డి శ్రమ వృథా
* కేరళ చేతిలో హెచ్‌సీఏఈ ‘బి’ ఓటమి.
* అండర్-19 ప్రాక్టీస్ మ్యాచ్‌లు
సాక్షి, హైదరాబాద్: అండర్-19 ప్రాక్టీస్ మ్యాచ్‌లో హెచ్‌సీఏఈ ‘బి’ ఆటగాడు పి.ఎస్.చైతన్య రెడ్డి (73 పరుగులు, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నా... జట్టును గెలిపించలేకపోయాడు. ఎంపీ కోల్ట్స్ మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేరళ 7 వికెట్ల తేడాతో హెచ్‌సీఏఈ‘బి’ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌సీఏఈ ‘బి’ జట్టు 208 పరుగులకే ఆలౌటైంది. చైతన్యతో పాటు సందీప్ గౌడ్ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించాడు. కేరళ బౌలర్ ఫనూస్ 5 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కేరళ 3 వికెట్లకు 212 పరుగులు చేసి గెలిచింది.
విష్ణురాజ్ (70) రాణించాడు. రోహన్ 46, సల్మాన్ 39 పరుగులు చేశారు.రాజస్థాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హెచ్‌సీఏఈ ‘ఎ’ జట్టు 66 పరుగుల తేడాతో చిత్తయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 8 వికెట్లకు 263 పరుగులు చేసింది. మహిపాల్ (57), ఆదిత్య అగర్వాల్ (57) రాణించారు. హెచ్‌సీఏఈ ‘ఎ’ 197 పరుగులకే ఆలౌటైంది. మిఖిల్ జైస్వాల్ (66) అర్ధసెంచరీ చేశాడు. రాజస్థాన్ బౌలర్లు వికాస్ 4, సునీల్ 3, గణపతి శర్మ 2 వికెట్లు తీశారు.