స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు
హృద్రోగులకు కేంద్రం తీపికబురు
► మెటల్ స్టెంట్ రూ. 7,260గా, డ్రగ్ స్టెంట్ రూ. 29,600గా నిర్ణయం
► సవరించిన ధరలు తక్షణం అమల్లోకి
న్యూఢిల్లీ: లక్షలాది మంది హృద్రోగులకు ఊరట నిచ్చేలా స్టెంట్ల ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గుండె శస్త్ర చికిత్సలో ఎంతో కీలమైన కరోనరీ స్టెంట్ల ధరల్ని 85 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బేర్ మెటల్ స్టెంట్ (బీఎంఎస్) ధరను రూ. 7,260గా, డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్ (డీఈఎస్) ధరను రూ. 29,600గా నిర్ణయిం చామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మంగళవారం తెలిపారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
వ్యాట్, స్థానిక పన్నులతో కలిపి గరిష్టంగా బీఎంఎస్ రూ.7,623కు, డీఈఎస్ రూ.31,080కు దొరుకుతుం దని చెప్పారు. ఇప్పటివరకు బీఎంఎస్ ధర గరిష్టంగా రూ. 45 వేలు ఉండగా, డీఈఎస్ రూ. 1.21 లక్షల వరకూ ఉండేది. ప్రస్తుతం కంపెనీల వద్ద ఉన్న స్టెంట్ల నిల్వలకు కూడా సవరించిన ధరల్ని అమలు చేయాలని, ఒకవేళ రోగుల నుంచి ఎక్కువ వసూలు చేస్తే... ఆస్పత్రులు, స్టెంట్ల సరఫరా దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంత్ కుమార్ హెచ్చరించారు.
రూ. 4,450 కోట్ల మేర తగ్గనున్న భారం
‘పలు ఆస్పత్రుల్లో కరోనరీ స్టెంట్ల ధరలు భారీగా ఉండడంపై కొనసాగుతున్న ఆందోళనకు ముగింపు పలకాలనుకున్నాం. ఎంతో జాగ్రత్తగా ఆలోచించి, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల సంస్థ (ఎన్ పీపీఏ) స్టెంట్ల గరిష్ట ధరను నిర్ణయించింది’ అని మంత్రి చెప్పారు. ఈ తగ్గింపుతో ఏడాదికి రూ. 4,450 కోట్ల మేర గుండె సంబంధిత రోగులపై భారం తగ్గుతుందన్నారు.
స్టెంట్ల సరఫరాలోని వివిధ దశల్లో ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు కనుగొన్నామని ఎన్ పీపీఏ పేర్కొంది. దీంతో ఆర్థికంగా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వారికి ఊరటనిచ్చేలా కరోనరీ స్టెంట్ల గరిష్ట ధరల్ని తక్షణం సవరించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనను పలు వైద్య విభాగాలు స్వాగతించాయి. కొన్ని ఆస్పత్రుల అనైతిక చర్యలకు ఈ నిర్ణయంతో చెక్ పెట్టారంటూ ఆలిండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్, డాక్టర్స్ ఆఫ్ ఎథికల్ హెల్త్కేర్లు ప్రశంసించాయి.