ప్రధానిగా అయ్యే అర్హతలున్నాయ్ కానీ..
బారాబంకి : నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేసే నేతగా పేరున్న సమాజ్ వాది పార్టీ లీడర్ అజమ్ ఖాన్ మరో సంచలన కామెంట్లు చేశారు. తనకు ప్రధానిగా అయ్యే లక్షణాలన్నీ ఉన్నాయట. కానీ తాను ముస్లిం కావడమే ప్రధాన సమస్యని వ్యాఖ్యానించారు. తనను ప్రధానిగా చేస్తే దేశాన్ని ఎలా పరిపాలించాలో చూపిస్తానన్నారు. ప్రధానిగా అయ్యే లక్షణాలు విద్యా, అనుభవం, నిజాయితీ, నిర్వహాణలో నైపుణ్యం, అన్నీ తనకున్నాయని పేర్కొన్నారు. తాను ముస్లిం కావడమే లోపం తప్ప మరే ఇతర కారణాలు లేవని హాస్యస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని యూరీలో ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అజమ్‌ఖాన్ అభివర్ణించారు. యూరీ ఉగ్రఘాతుకంపై కేంద్రం తీసుకున్న విధానాలేమిటని ప్రశ్నించారు. తనను ప్రధానిగా చేసిన ఏడాదిలోపే కశ్మీర్ సమస్యను ఓ కొలిక్కి తీసుకొస్తానని.. అఖండ భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
ప్రత్యర్థులు తనపై చేసే విమర్శలను మొరిగే కుక్కలుగా ఖాన్ అభివర్ణించారు. ఆ విమర్శలు తన పనితీరుపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని కొట్టిపారేశారు. సమాజ్‌వాదీ పార్టీ ముక్కలు చెక్కలు అవుతుందంటూ బయటవారు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పిన మాదిరిగా సమాజ్ వాదీ కుటుంబం ఎల్లప్పుడూ సమైక్యంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. కుటుంబం సమైక్యంగా, ధృడంగా ఉన్నప్పుడు, బయట శక్తులు ఏమీ చేయలేవని చెప్పారు. కొడుకు అఖిలేష్ యాదవ్ అభ్యంతరాలను పక్కన పెట్టి మరీ 2010లో పార్టీ నుంచి బహిష్కృతుడైన అమర్‌సింగ్‌ను సమాజ్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నియమించారు. ఈ నిర్ణయంతో మరోసారి అఖిలేష్‌కు తండ్రి ములాయం చెక్ పెట్టినట్టైంది.