అతను సచిన్ రికార్డును బ్రేక్ చేయగలడు
న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్లో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ పరుగుల రికార్డును ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ బ్రేక్ చేసే అవకాశముందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కుక్ వయసు 32 ఏళ్లలోపేనని, ఫిట్నెస్తో ఉన్నాడు కాబట్టి మరో 6-8 ఏళ్లు టెస్టు క్రికెట్ ఆడితే సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించవచ్చని చెప్పాడు. ఇంగ్లండ్ ఏడాదికి సరాసరి 12 టెస్టులు ఆడుతోందని, కుక్ టెస్టుకు సగటున 50 పరుగులు చేసినా అరుదైన ఘనత సాధించవచ్చని విశదీకరించాడు. టెస్టుల్లో కుక్ 10 వేల పరుగుల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే.
టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా, ఈ ఫీట్ నమోదు చేసిన అతి పిన్న వయస్కుడిగా కుక్ మరో రికార్డు నెలకొల్పాడు. సచిన్ 31 ఏళ్ల 10 నెలల వయసులో ఈ రికార్డు నెలకొల్పగా, కుక్ 31 ఏళ్ల 5 నెలల వయసులో ఈ ఫీట్ సాధించాడు. సచిన్ మొత్తం 15921 పరుగులు చేశాడు.