All-Women
-
International Jazz Day: జాజ్ జాజిమల్లి
జాజ్ జాజిమల్లికి కొత్త అందాన్ని తీసుకువస్తోంది ముంబైకి చెందిన ఆల్–ఉమెన్ జాజ్ టీమ్. పాశ్చాత్య కళకు దేశీయత జత చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. జాజ్ డ్యాన్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపుతోంది. ముంబైలోని ఆల్–ఉమెన్ జాజ్ టీమ్‌లో శ్వేతన్ కన్వర్, రాధిక మాయాదేవ్, రోషిణి నాయర్, వేదిక అగర్వాల్, దీక్ష, రియా సూద్ అనే డ్యాన్సర్లు ఉన్నారు. ‘స్టీరియోటైప్‌ను బ్రేక్ చేయడానికి జాజ్ టీమ్ ప్రారంభించాం’ అంటుంది ఫౌండర్ శ్వేతన్ కన్వర్.\ డెహ్రాడూన్‌కు చెందిన శ్వేతన్ ఫ్యాషన్ మార్కెటింగ్ స్టూడెంట్. ఒకప్పుడు హాబీగా మాత్రమే ఉన్న జాజ్ డ్యాన్స్ ఇప్పుడు తన కెరీర్‌గా మారుతుందని ఆమె ఊహించలేదు. ‘జాజ్ డ్యాన్స్ అనేది అందరూ అనుకునేంత సులువైన విద్య కాదు. ఎంతో సాధన చేస్తే తప్ప ఆ విద్య మన సొంతం కాదు’ అంటుంది శ్వేతన్. రాధిక మాయదేవ్ పదహారు సంవత్సరాల వయసు నుంచే జాజ్ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అయితే తన అభిరుచినే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం ముందు తల్లిదండ్రులు అడ్డుచెప్పినప్పటికీ కూతురు ఉత్సాహాన్ని గమనించి ఆ తరువాత వారు ఆమోదించారు. కూతురికి లభించిన గుర్తింపుకు సంతోషిస్తున్నారు. కామర్స్ స్టూడెంట్ అయిన రోహిణి నాయర్ మొదట భరతనాట్యం చేసేది. ఆ తరువాత జాజ్ డ్యాన్స్‌లోకి వచ్చింది. ఇది వారి తల్లిదండ్రులకు నచ్చలేదు. అయితే వారిని తన మాటలతో మెప్పించింది. ‘మా అమ్మాయి జాజ్ డ్యాన్సర్’ అని గర్వంగా చెప్పుకునేలా చేసింది రోహిణి. ‘ప్రయోగాలతోనే ఏ కళ అయినా వృద్ధి చెందుతుంది. కళ ఎప్పుడూ నిలవనీరులా ఉండకూడదు’ అంటున్న వేదిక అగర్వాల్ జాజ్‌కు దేశీయ సొగసును జత చేయడానికి పలు రకాలుగా ఆలోచిస్తుంది. సాధారణంగా జాజ్ డ్యాన్స్ అనగానే శాక్స్ఫోన్ శబ్దాలు, ఇంగ్లీష్ పాటల లిరిక్స్ వినిపిస్తాయి. ‘అలా మాత్రమే ఎందుకు!’ అంటూ ఈ టీమ్ జాజ్ డ్యాన్స్‌కు కొత్త లుక్ తీసుకువచ్చింది. ప్రసిద్ధ బాలివుడ్ పాటలతో జాజ్ డ్యాన్స్ చేయడం ప్రారంభిచారు. ‘మొదట ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తరువాత ఆనందిస్తారు. ఆ తరువాత ఆమోదిస్తారు’ అనే మాట ఈ టీమ్ విషయంలో నిజమైంది. ‘జాజ్ డ్యాన్స్‌లో బాలీవుడ్ పాటలు ఏమిటి!’ అని ఆశ్చర్య పోయినవారే వారి ప్రదర్శన చూసిన తరువాత ‘ఆహా! అద్భుతం’ అని మెచ్చుకున్నారు. ‘హిందీ సినిమా పాటలకే కాదు సౌత్ ఇండియన్ మ్యూజిక్కు కూడా జాజ్ డ్యాన్స్ జత చేయనున్నాం’ అంటుంది రోహిణి నాయర్. ‘మీరు చూస్తే లావుగా కనిపిస్తారు. ఇంత చక్కగా ఎలా డ్యాన్స్ చేయగలుగుతున్నారు!’ అని చాలామంది రాధిక మాయదేవ్ను అడుగుతుంటారు. ఆమె ఆ సందేహానికి చెప్పే సమాధానం... ‘ప్రతి బాడీకి తనదైన ప్రత్యేకత ఉంటుంది. రిథమ్ ఉంటుంది. ప్రతి బాడీకి డ్యాన్స్ చేసే సామర్థ్యం ఉంటుంది. అందుకు అవసరమైనది సాధన మాత్రమే’ జాజ్ డ్యాన్స్‌లో కంటెంపరరీ, పుంక్, స్ట్రీట్ స్టైల్, లిరికల్ అండ్ కమర్శియల్...అంటూ రకరకాల స్టైల్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ అభినందనలు అందుకుంటోంది ఆల్–ఉమెన్ జాజ్ టీమ్. -
స్వావలంబన: ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు
ఆటో మొబైల్ రంగంలో మహిళలు పని చేయడం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని కాలదన్ని ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎందరో ఉన్నారు. హర్షించదగిన, ఆహ్వానించదగిన పరిణామం ఏమిటంటే ఆటో మొబైల్ రంగంలోని దిగ్గజ సంస్థలు స్త్రీ సాధికారత, స్వావలంబనకు పెద్ద పీట వేస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ను ప్రారంభించింది... మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. ‘ఇరవైమందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తేలిగ్గా జరగలేదు. కష్టపడాల్సి వచ్చింది. మహిళలు ఒక బృందంగా ఒకేచోట పనిచేయడం వల్ల అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవచ్చు. స్వావలంబనను బలోపేతం చేయవచ్చు. నేటి తరం మహిళలు ఇతరులపై ఆధారపడడం కంటే స్వతంత్రంగా ఎదగడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతల్లో మంచి విజయాలు సాధిస్తున్నారు’ అంటోంది షోరూమ్ జనరల్ మేనేజర్ లవ్లీసింగ్. ఆటోమొబైల్ రంగంలో లవ్లీసింగ్కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సేల్స్ బృందంలో సభ్యురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది లవ్లీసింగ్. ఆ రోజుల్లో నగరం మొత్తంలో ఆటో మొబైల్ రంగానికి సంబంధించి సేల్స్ విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ లవ్లీ. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాను’ అంటే ఆశ్చర్యంగా చూసేవారు.కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ‘టీచర్ జాబ్ చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. అయితే అవేమీ తనను ముందుకెళ్లకుండా అడ్డుకోలేకపోయాయి. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తే పదిమంది పలురకాలుగా అనుకుంటారు’ అనే భయం ఉంది. ఎన్నో అపోహలు ఉన్నాయి. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు? అంతమంది మగవాళ్ల మధ్య ఎలా పనిచేస్తున్నావు...’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ముందుకు వచ్చేవి. వాటిని పట్టించుకొని ఉంటే సేల్స్ విభాగంలో పనిచేసిన వారం రోజుల్లోనే ఉద్యోగాన్ని వదిలి ఇంట్లో కూర్చునేదాన్ని అంటుంది లవ్లీసింగ్. ‘ఆటోమొబైల్ రంగంలో పనిచేయాలనే ఆసక్తి నాలో మొదట ఉండేది కాదు. దీనికి కారణం... పురుషులు మాత్రమే ఆ రంగంలో ఉంటారు అనుకోవడం. అయితే ఆటోమొబైల్ రంగంలో కూడా పురుషులతో సమానంగా మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. వారే నాకు స్ఫూర్తి. ఇరవైమంది సభ్యులు ఉన్న బృందంలో చేరడంతో అప్పటివరకు ఉన్న కాస్తో కూస్తో భయాలు పోయాయి. ఎంతో ధైర్యం వచ్చింది. ఉద్యోగంలో చేరినట్లుగా లేదు చిన్న విశ్వవిద్యాలయంలో చేరినట్లుగా ఉంది. ఇక్కడి అనుభవాలే మాకు గొప్ప పాఠాలు’ అంటుంది మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న సీమ. 27 సంవత్సరాల గుర్మీత్ ఆటో మొబైల్ రంగంలోకి రావాలనుకోవడానికి ముందు– ‘అంత తేలికైన విషయం కాదు. కార్లు–హెవీ డ్యూటీ ట్రక్స్ అసెంబ్లింగ్‌లో మగవాళ్లతో పోటీపడడం కష్టం. ఇండస్ట్రీలో మొదలైన కొత్త డిజిటల్ ట్రెండ్‌ను త్వరగా అందుకోవడం ఇంకా కష్టం’లాంటి మాటలు ఎన్నో వినిపించాయి. అయితే అలాంటి మాటలేవీ తనను ఇండస్ట్రీకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. ఎంజీ మోటర్స్ గత సంవత్సరం గుజరాత్‌లోని వడోదర ప్లాంట్‌లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను మొదలుపెట్టింది. ‘ప్రయోగాలకు, వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే బ్రాండ్ ఎంజీ. ఆల్–ఉమెన్ టీమ్ అనేది మహిళలు కష్టపడే తత్వానికి, అంకితభావానికి మేము ఇచ్చే గౌరవం’ అంటున్నాడు ఎంజీ మోటర్ ఇండియా ఎండీ రాజీవ్ చాబ. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని పాడుకోనక్కర్లేకుండానే ఆటోమొబైల్ రంగంలో మహిళలకు మేలు చేసే మంచికాలం వచ్చింది. దిగ్గజ సంస్థలు ‘ఆల్–ఉమెన్ టీమ్’లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
వంటకాల బండి...ఇది మహిళలదండి!
న్యూఢిల్లీ: గాజులు లేని వంట ఘుమ ఘుమ లాడున్....అనే మాట వంటను వృత్తిగా చేసుకొని బతుకుతున్న మగవాళ్ల గురించి స్ఫూర్తిగా చెప్పినదైయుండున్. ఇంటి వంటకు మాత్రమే పరిమితమవుతున్న మగువలు కూడా వంటను వృత్తిగా చేసుకుంటే నలభీములు కూడా వారి ముందు బలదూర్ అని నిరూపిస్తున్నారు బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల అర్చనా సింగ్. సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని వేడివేడిగా అందించడంతోపాటు తోటి మహిళలుకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో అర్చనా సింగ్ ట్రక్కు ద్వారా ఆహారాన్ని సరఫరాచేసే సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. చదువు, సంధ్యలు, నైపుణ్యం గల మహిళలు ఎక్కడైనా, ఏపనైనా చేసుకొని బతుకగలరు. ఇటు చదువు, అటు నైపుణ్యంలేని మహిళలు నేటి ఆధునిక సమాజంలో గౌరవప్రదంగా బతకడం కష్టమే. అందుకనే అర్చనా సింగ్ తన టీమ్‌లోకి అలాంటి మహిళలనే ఎక్కువగా తీసుకున్నారు. వారందరనికి ఆమెనే వివిధ ర కాల వంటకాల్లో శిక్షణ ఇచ్చారు. సాధారణ సంప్రదాయ భోజనాలతోపాటు పసందైన బిర్యానీ, చికెన్ టిక్కాలు, ఆలూ టిక్కీ హాట్‌డాగ్స్, చీజ్ కేక్స్ అన్నీ చేస్తారు అర్చనా సింగ్ టీమ్. వీరు తమ వంటకాలను ట్రక్కులో టెకీ సెంటర్లకు, కాలేజీలకు, ట్రాఫిక్ సెంటర్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అర్చనా టీమ్ ఈ వ్యాపారాన్ని చేపట్టి సరిగ్గా రెండు నెలలు కూడా కానప్పటికీ సూపర్ డూపర్ హిట్టయింది. ఘుమఘుమలాడే వంటకాలు అద్భుతం, అమోఘం అని భోజన ప్రియులు కితాబివ్వడమే కాకుండా మరిన్ని ట్రక్కులతో అన్ని వీధులకు వ్యాపారాన్ని విస్తరించాల్సిందిగా అర్చనా టీమ్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వారి సలహామేరకు ఇరుగు, పొరుగు పట్టణాలతోపాటు రాష్ట్రాలకు విస్తరించాలని అర్చనా సింగ్ భావిస్తున్నారు. త్వరలో ఔరంగాబాద్, పాట్నా నగరాల్లో కూడా తమ సర్వీసులను ప్రారంభిస్తున్నామని, మరో ఆరేడు నెలల్లో హైదరాబాద్-చెన్నై నగరాల మధ్య కూడా చేపడతామని చెప్పారు. ‘సెవెన్త్ సిన్’ పేరిట ట్రక్కు ద్వారా ఆహార సరఫరా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అర్చనా టీమ్ ఏడవ రోజైనా ఆదివారం నాడు విశ్రాంతేమీ తీసుకోవడం లేదు. బిచ్చగాళ్లు, నిరుపేదలు, మురకివాడల ప్రజలకు ఉచితంగా భోజనాలను అందిస్తూ సామాజిక సేవ కూడా చేస్తోంది. ఈ ఫుడ్ ట్రక్ సర్వీసును ప్రారంభించాలనే ఆలోచన తనకు తొలిసారిగా 2015, డిసెంబర్ నెలలోనే వచ్చిందని, నైపుణ్యంలేని మహిళలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నందున వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రారంభించేందుకు ఇంతకాలం పట్టిందని అర్చన తెలిపారు. వంట చేయడంలో తాను ఎక్కడా శిక్షణ తీసుకోలేదని, తన తండ్రి నౌకాధికారి అవడం వల్ల ఆయనతోపాటు దేశంలోని పలు ప్రాంతాలకు తిరగాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ప్రతి వంటకాన్ని రుచి చూడడమే కాకుండా అది ఎలా చేయాలో నేర్చుకున్నానని, ఇంటి పట్టున ఉండడంకన్నా తన అభిరుచితో వ్యాపారం ఎందుకు చేయకూడదని అనుకొని ఈ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు. ఆడవాళ్లే ఎందుకు, నైపుణ్యంగల చెఫ్‌లను తీసుకుంటే తాము కూడా పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన కొంతమంది వ్యాపారులు ఉన్నారని, అయినా తాను మహిళలతో మాత్రమే వ్యాపారాన్ని నిర్వహిస్తాననే కృతనిశ్చయంతో ముందుకు కదిలానని ఆర్చన వివరించారు. టెక్, యూనివర్శిటీ ప్రాంతాలకే కాకుండా ముందుగా ఫోన్ ద్వారా బుక్ చేసుకున్న పార్టీలకు కూడా తమ టీమ్ ఆహారాన్ని సరఫరా చేస్తోందని ఆమె చెప్పారు. ట్రక్కును తాను స్వయంగా నడుపుతుంటే ప్రవీణ్ నందూ ఫుడ్ సర్వీస్ సీఈవోగా, నటాషా పాత్రో చెఫ్‌గా, దీప, ఉషా, హేమ సహాయకులుగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. -
ఆ గ్రామానికి అంతా మహిళలే..!
గుజరాత్ మహిళలు నారీభేరిని మోగిస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్ల నిర్మాణం, సౌరదీపాల్లాంటి మౌలిక సదుపాయాల రూపకల్పనకు నాందిపలికారు. 21-26 మధ్య వయసున్న యువతులంతా చేతులు కలిపి గ్రామాభివృద్ధే ధ్యేయంగా ప్రభంజనం సృష్టిస్తున్నారు. నర్సింగ్ గ్రాడ్యుయేట్ హినాల్ పటేల్, ఇంజనీరింగ్ చదివిన రాధా పటేట్, మోటార్ బైక్ షోరూమ్ లో మేనేజర్ గా చేస్తున్న నిషా పటేల్, ఫార్మసీ చదువుతున్న విరాల్బెన్ సర్వయాలు తమ ఉద్యోగాలు, అధ్యయనాల్లో బిజీగా ఉంటూనే గ్రామసేవకు అంకితమయ్యారు. ప్రతివారం హినాల్ ఇంట్లో సమావేశమై గ్రామంలోని తీవ్ర సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. గుజరాత్ ఆనంద్ జిల్లాలోని శిశ్వగ్రామ పంచాయతీ మహిళాసభ్యులు... ఇప్పడు ప్రతి పంచాయతీకి స్ఫూర్తిదాయకంగా మారారు. మంచి విద్యార్హతలతో పాటు, 12 మంది యువ సర్పంచ్ లు హినాల్ పటేల్ నాయకత్వంలో గత నాలుగేళ్ళుగా గ్రామాభివృద్ధే అజెండాగా పనిచేస్తున్నారు. శిశ్వ గ్రామం.. గుజరాత్ లోని వేల గ్రామాల్లో ఒకటి. అయితేనేం.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమర పథకానికి ఈ గ్రామం ఎంపికైంది. ఇలా ఎంపికైన గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. 2011 లో ఈ పథకానికి శిశ్వ సర్పంచ్ గా హినాల్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన సమయంలో ఆమెకు వయసు 22 ఏళ్లు. గ్రామాభివృద్ధిపై మక్కువ చూపుతున్న ఆమెకు... ఎన్నికల సమయంలో తండ్రి ప్రోత్సాహం అందించారు. హినాల్ సహా మహిళా సభ్యులంతా ఒక్కోరు ఒక్కో రంగాన్ని ఎంచుకొని ఆ దిశగా అభివృద్ధికి దారులు వేశారు. ఆల్ ఉమెన్ పంచాయితీగా పేరొందిన శిశ్వ గ్రామంలో మహిళలు... ఆర్వో నీటి పథకంతోపాటు, సోలార్ లైట్లు, చెత్తడబ్బాలు వంటి అనేక మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చి గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వీరి అభివృద్ధికి తార్కాణంగా శిశ్వ గ్రామం నిర్మల్ గ్రామంగా ఎంపికై, రాష్ట్రపతి అవార్డును అందుకుంది. ఈ మహిళా సభ్యుల ఆధ్వర్యంలో ఓ వెబ్ సైట్ ను ప్రారంభించి శిశ్వ గ్రామాన్ని 'ఈ' గ్రామంగా మార్చారు. ఆన్ లైన్ లోనే గ్రామ ప్రజలకు అనేక సౌకర్యాలను అందిస్తున్నారు. అదే స్ఫూర్తితో చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పి ఈ విలేజ్ ను ఏర్పాటు చేసి, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే విద్యాలయాలనూ నిర్మించాలన్నది ప్రస్తుతం ఈ మహిళామణులు కల. అది కూడా త్వరలోనే సాకారమౌతుందని ఆశిస్తున్నారు. ఈ మహిళా సర్పంచుల ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న శిశ్వ గ్రామాన్ని నేడు.. రాష్ట్రంలోని అనేక గ్రామాలు రోల్ మోడల్ గా మార్చుకుంటున్నాయి.