ఆ గ్రామానికి అంతా మహిళలే..!
గుజరాత్ మహిళలు నారీభేరిని మోగిస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్ల నిర్మాణం, సౌరదీపాల్లాంటి మౌలిక సదుపాయాల రూపకల్పనకు నాందిపలికారు. 21-26 మధ్య వయసున్న యువతులంతా చేతులు కలిపి గ్రామాభివృద్ధే ధ్యేయంగా ప్రభంజనం సృష్టిస్తున్నారు.
నర్సింగ్ గ్రాడ్యుయేట్ హినాల్ పటేల్, ఇంజనీరింగ్ చదివిన రాధా పటేట్, మోటార్ బైక్ షోరూమ్ లో మేనేజర్ గా చేస్తున్న నిషా పటేల్, ఫార్మసీ చదువుతున్న విరాల్బెన్ సర్వయాలు తమ ఉద్యోగాలు, అధ్యయనాల్లో బిజీగా ఉంటూనే గ్రామసేవకు అంకితమయ్యారు. ప్రతివారం హినాల్ ఇంట్లో సమావేశమై గ్రామంలోని తీవ్ర సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. గుజరాత్ ఆనంద్ జిల్లాలోని శిశ్వగ్రామ పంచాయతీ మహిళాసభ్యులు... ఇప్పడు ప్రతి పంచాయతీకి స్ఫూర్తిదాయకంగా మారారు. మంచి విద్యార్హతలతో పాటు, 12 మంది యువ సర్పంచ్ లు హినాల్ పటేల్ నాయకత్వంలో గత నాలుగేళ్ళుగా గ్రామాభివృద్ధే అజెండాగా పనిచేస్తున్నారు.
శిశ్వ గ్రామం.. గుజరాత్ లోని వేల గ్రామాల్లో ఒకటి. అయితేనేం.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమర పథకానికి ఈ గ్రామం ఎంపికైంది. ఇలా ఎంపికైన గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. 2011 లో ఈ పథకానికి శిశ్వ సర్పంచ్ గా హినాల్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన సమయంలో ఆమెకు వయసు 22 ఏళ్లు. గ్రామాభివృద్ధిపై మక్కువ చూపుతున్న ఆమెకు... ఎన్నికల సమయంలో తండ్రి ప్రోత్సాహం అందించారు. హినాల్ సహా మహిళా సభ్యులంతా ఒక్కోరు ఒక్కో రంగాన్ని ఎంచుకొని ఆ దిశగా అభివృద్ధికి దారులు వేశారు.
ఆల్ ఉమెన్ పంచాయితీగా పేరొందిన శిశ్వ గ్రామంలో మహిళలు... ఆర్వో నీటి పథకంతోపాటు, సోలార్ లైట్లు, చెత్తడబ్బాలు వంటి అనేక మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చి గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వీరి అభివృద్ధికి తార్కాణంగా శిశ్వ గ్రామం నిర్మల్ గ్రామంగా ఎంపికై, రాష్ట్రపతి అవార్డును అందుకుంది. ఈ మహిళా సభ్యుల ఆధ్వర్యంలో ఓ వెబ్ సైట్ ను ప్రారంభించి శిశ్వ గ్రామాన్ని 'ఈ' గ్రామంగా మార్చారు. ఆన్ లైన్ లోనే గ్రామ ప్రజలకు అనేక సౌకర్యాలను అందిస్తున్నారు. అదే స్ఫూర్తితో చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పి ఈ విలేజ్ ను ఏర్పాటు చేసి, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే విద్యాలయాలనూ నిర్మించాలన్నది ప్రస్తుతం ఈ మహిళామణులు కల. అది కూడా త్వరలోనే సాకారమౌతుందని ఆశిస్తున్నారు. ఈ మహిళా సర్పంచుల ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న శిశ్వ గ్రామాన్ని నేడు.. రాష్ట్రంలోని అనేక గ్రామాలు రోల్ మోడల్ గా మార్చుకుంటున్నాయి.