కర్ణాటక దూకుడు.. తెలంగాణ కలవరం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వీలైనంత ఎక్కువగా ఎగువనే తోడేయాలని దూకుడు ప్రదర్శిస్తున్న కర్ణాటక ప్రభుత్వం...ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్మట్టి ఎత్తు పెంపుతో దక్కే 130 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చేందుకు చేపట్టిన తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించినా వాటిని వచ్చే ఏడాదికల్లా ప్రారంభించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.
ఈ పథకాల్లో పెరిగిన అంచనా వ్యయాలకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముంపు అంశాన్ని పరిష్కరించే చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ వచ్చే ఏడాది నుంచి వీలైనంత నీటిని తోడే లక్ష్యంగానే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
అప్రమత్తం కాకుంటే అంతే సంగతి...
కృష్ణా జలాలకు సంబంధించి బచావత్ అవార్డుకు విరుద్ధంగా 65 శాతం డిపెండ బులిటీలో నీటి కేటాయింపులు చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్...కర్ణాటకకు అప్పటికే ఉన్న 734 టీఎంసీల కేటాయింపును 911 టీఎంసీలకు పెంచడం తెలిసిందే. ఇదే సమయంలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల ఎత్తు నుంచి 524.256 మీటర్లకు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది.
నిజానికి ఆల్మట్టిలో 129 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 173 టీఎంసీల నీటి వినియోగానికి వీలుంది. బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వస్తే నిల్వ సామర్థ్యం 130 టీఎంసీలకు పెరగనుంది. అయితే ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటంతో తీర్పు అవార్డు కాలేదు. అయినప్పటికీ అప్పర్ కృష్ణా స్టేజ్–3లో భాగంగా 130 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చేలా రూ. 17,207 కోట్లతో 9 ఎత్తిపోతల పథకాలకు కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ ప్రాజెక్టులకు భారీ ముంపు ఉండటం, నిర్వాసితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గత నెలలో కేంద్ర పర్యావరణ అనుమతి కోసం కర్ణాటక ప్రయత్నించగా అక్కడ చుక్కెదురైంది. ఈ పథకాలకు సీడబ్ల్యూసీ అనుమతి, హైడ్రాలజీ క్లియరెన్స్ తప్పనిసరంటూ ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) పర్యావరణ అనుమతులను తిరస్కరించింది.
రాజకీయ లాబీయింగ్ మొదలు...
పర్యావరణ అనుమతులు లభించనప్పటికీ పట్టువీడని కర్ణాటక సర్కారు... ఇటీవలే 9 ఎత్తిపోతల పథకాలకు అనుమతుల కోసం కేంద్రం వద్ద రాజకీయంగా లాబీయింగ్ మొదలు పెట్టింది. మరోవైపు ఎత్తిపోతల పథకాల కొత్త అంచనా వ్యయాలు, భూ పరిహార అంశాలపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గత బుధవారం సమావేశమైన కర్ణాటక కేబినెట్ గతంలో వేసిన అంచనాను రూ. 17,602 కోట్ల నుంచి రూ. 51,148.94 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
దీంతోపాటు ప్రాజెక్టు పరిధిలో 1.33 లక్షల ఎకరాల భూసేకరణ, నిర్వాసితుల భూ పరిహారం కోసం ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అక్టోబర్ 30 నాటికి పరిహార అంశాలన్నీ తేల్చేలా కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ఇవన్నీ పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసే భాగంలో జరుగుతున్నవేనని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రానికి కలవరమే...
కర్ణాటక కేబినెట్ సమావేశం అనంతరం ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో ఉన్న అన్ని పిటిషన్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పరిష్కారమవుతాయని, వచ్చే ఏడాది నుంచి నీటి వినియోగం ఉంటుందని పేర్కొన్నారు. ఇది రాష్ట్రాన్ని కలవరపెట్టే అంశమే. ఈ నేపథ్యంలో దిగువన ఉన్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రాజకీయ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల వర్గాలు సూచిస్తున్నాయి. లేకుంటే ఎగువ నీటిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నాయి.